ముంబై: ‘అగ్లీ’ సినిమాలో పొగ తాగే దృశ్యం వచ్చినపుడు ‘సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్’ ప్రకటన (డిస్‌క్లెయిమర్) వేయనని చెప్పినప్పటికీ సెన్సార్ బోర్డు అభ్యంతరంపై తుదివరకు పోరాడతానని దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ పేర్కొన్నాడు. అవసరమైతే సుప్రీంకోర్టుదాకా వెళతానన్నాడు. అటువంటి డిస్‌క్లెయిమర్‌లతో సినిమాను విడుదల చేసేందుకు తాను సిద్ధంగా లేనన్నాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికెటేషన్‌ను సవాలుచేస్తూ అనురాగ్... బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ‘అది అసలు సమంజసం కాదనేది నా భావన. ఇది పూర్తిగా మతి లేని చర్య.
నా విన్నపాన్ని బాంబే హైకోర్టు ఆలకించకపోతే సుప్రీంకోర్టుకు వెళతా’ అని తెలిపాడు. దర్ మోషన్ పిక్చర్స్, ఫాంటం ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన అగ్లీ సినిమా వాస్తవానికి ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీనే విడుదల కావాల్సిఉంది. అయితే డిస్‌క్లెయిమర్‌లు వేసేందుకు అనురాగ్ అంగీకరించకపోవడంతో వచ్చే సంవత్సరానికి వాయిదాపడింది. ‘అటువంటి ప్రకటనలతో ఈ సినిమాను విడుదల చేయడం నాకు ఇష్టం లేదు. కడదాకా పోరాడతా. నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అధికారం నాకు ఉంది. నా సినిమాలు నేను తీసుకుంటా. తీర్పు ఏవిధంగా వచ్చినా ఫర్వాలేదు.
ప్రజాస్వామ్య దేశం అయినందువల్ల పోరాటాన్ని కొనసాగిస్తా. ఎందుచేతనంటే ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఎదురొడ్డి నిలబడాల్సిందే. పోరాటం జరపాల్సిందే. అటువంటి డిస్‌క్లెయిమర్‌లు ఎవరికైనా అవమానకరంగానే అనిపిస్తుంద’ని ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’, ‘దేవ్ డి’, ‘గులాల్’, ‘నో స్మోకింగ్’ తదితర సినిమాలతో బాలీవుడ్‌లో తళుక్కుమన్న అనురాగ్ చెప్పాడు.
అవసరమైతే ‘సుప్రీం’కెళతా అనురాగ్ కశ్యప్
Published Wed, Dec 18 2013 11:34 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement