సాక్షి ముంబై: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమావేశాల్లో రెండో రోజైన మంగళవారం కూడా ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించాయి. సభ ప్రారంభమైన తర్వాత రైతుల సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపిస్తూ చర్చలు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రంలోని కరువు పరిస్థితి, రైతుల ఆత్మహత్యలపై ధ్వజమెత్తాయి. ఇరు సభల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు గందరగోళం సృష్టించాయి. అకాల, వడగళ్ల వర్షం కారణంగా రైతులకు కలిగిన నష్టంపై వెంటనే చర్చలు జరపాలని ప్రతిపక్షాలు ప్రారంభం నుంచి కోరాయి. సెక్షన్ 97, 57 మేరకు నోటీసులు అందించాయి. కాగా, విధానసభలో చర్చలు జరిపేందుకు అధికార పక్షం సిద్ధమైనప్పటికీ స్పీకర్ మాత్రం చర్చలకు నిరాకరించారు.
దీంతో ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభను వాకౌట్ చేస్తూ బయటికి వెళ్లిపోయారు. అనంతరం స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ముస్లీం రిజర్వేషన్ల విషయంపై కూడా అసెంబ్లీ బయట తమదైన పద్ధతిలో నిరసన వ్యక్తం చేశాయి. ముస్లీం రిజర్వేషన్ బిల్లు రద్దు చేసిన జీఆర్ కాపీలను కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు దహనం చేశారు.
రైతులకు న్యాయం చేయాల్సిందే: విఖే పాటిల్
రాష్ట్రంలోని రైతులందరికి న్యాయం చేయాల్సిందేనని విధాన మండలి ప్రతిపక్ష నాయకుడు రాధకృష్ణ విఖేపాటిల్ పేర్కొన్నారు. రైతుల సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అన్ని అంశాలను పక్కన బెట్టి రైతుల అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేసినా రైతుల సమస్యపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. మరోవైపు శాసన సభ ప్రతిపక్ష నాయకుడు ధనంజయ్‌ముండేతో పాటు ఎన్సీపీ నాయకుడు జితేంద్రఅవాడ్ కూడా ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టారు.
భివండీ పరిసరాల్లో ‘లాజిస్టిక్ హబ్’
సాక్షి, ముంబై: భివండీ పరిసరాల్లో 2200 హెక్టార్ల స్థలంలో ‘లాజిస్టిక్ హబ్’ నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విధాన మండలిలో మంగళవారం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఠాణే జిల్లా భివండీ పరిసరాల్లో మఢవీ కంపౌండ్‌లో ఓ రద్దీ గోడౌన్‌లో జరిగిన అగ్నిప్రమాదం విషయంపై ఎమ్మెల్సీ అజయ్ చౌదరీ ప్రశ్న లేవనెత్తారు. దీనికి సమాధానంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న గోడౌన్‌లన్నింటిని పర్యవేక్షిస్తున్నామని, భద్రత విషయంపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. పర్యవేక్షణ అనంతరం గోడౌన్లను క్రమబద్ధీకరిస్తామని, నియమాలను సడలించినప్పటికీ క్రమబద్ధీకరణ చేయలేని పరిస్థితిలోఉన్న గోడౌన్‌లను తొలగిస్తామని చెప్పారు.
రెండోరోజూ అదే లొల్లి
Published Wed, Mar 11 2015 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM
Advertisement