
'లొల్లి పోతుందని కర్ణాటకలో కలిపేసేవారే'
హైదరాబాద్: జిల్లాల విభజన నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేశారని, కర్ణాటక ఒప్పుకొని ఉంటే తన సొంత మండలాన్ని ఆ రాష్ట్రంలో కలిపేవారేమోనని టీటీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాల విభజన తర్వాత ఎవరు, ఏ జిల్లాలో ఉన్నారో అర్థం కాకుండా ఉందన్నారు.
రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, మండలం ఏ జిల్లాలో ఉందని ఓ విలేకరి ప్రశ్నించగా ఆయన... ‘నియోజకవర్గం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఉంది. ఇంకా నయం.. నాకు సొంత ఇల్లున్న కొడంగల్‌ను కర్నాటకలో కలిపేవారేమో. కర్నాటక ఒప్పుకుంటే నా లొల్లి పోతుందని కేసీఆర్ అదే పని చేసేవారు’ అన్నారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారి గురించి ప్రస్తావిస్తూ.. మొన్నటిదాకా బహిరంగంగా మాట్లాడినవాళ్లంతా ఇప్పుడు బల్లలు, చప్పట్లు కొట్టడంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పోటీపడుతున్నారన్నారు. ఇప్పుడిప్పుడే పశ్చాత్తాపపడుతున్నారని, ఏదో ఓరోజు ప్లేటు ఫిరాయించినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు.