- బరిలో ఉన్నత విద్యావంతులు
- రెంటికీ చెడ్డ రేవడైన శైలజానాథ్
- తల్లి ఇమేజ్‌పై యామినిబాల
- దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పద్మావతి
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గ శాసనసభ పదవికి జరుగుతున్న పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు ఉన్నత విద్యావంతులే. వీరిలో ఒకరు తాజా మాజీ మంత్రి కాగా, మరొకరు మాజీ మంత్రి కుమార్తె. మరొకరు ఉన్నత విద్యా సంస్థకు అధిపతి. విభజన నేపథ్యంలో ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో నామమాత్రమేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు. నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థులుగా వైఎస్సార్‌సీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి, టీడీపీ నుంచి యామిని బాల బరిలో ఉంటారన్నది స్పష్టం అవుతోంది.
ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ
నియోజకవర్గ ప్రచారంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి అందరికన్నా ముందున్నారు. ఆమె ఇంజినీరింగ్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేయడంతోపాటు, స్థానికురాలు కావడం నియోజకవర్గంలో ఆమెకు లాభించే అంశాలు. పైగా వైఎస్సార్‌సీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉండడం కూడా కలిసివస్తోంది. భర్త ఆలూరు సాంబశివారెడ్డి సారథ్యంలో నియోజకవర్గంలో ఆమె ఇప్పటికే గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమం పూర్తిచేశారు.
ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే పద్మావతి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో ఆమె నియోజకవరంపై దృషి ్టసారించి ప్రతి గ్రామంలో పర్యటించి, అక్కడి సమస్యలను అవగతం చేసుకున్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి మహిళలతో మాట్లాడుతూ పార్టీ చేపట్టబోయే సంక్షేమ పథకాలను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. దీనిపై ప్రజలనుంచి ఆమెకు మంచి స్పందన లభిస్తోంది కూడా.
అయోమయంలో శైలూ
టీడీపీ అభ్యర్థి యామిని బాల, కాంగ్రెస్ మాజీ మంత్రి శైలజానాథ్ ప్రచారంలో వెనుకబడ్డారని చెప్పవచ్చు. టీడీపీ టిక్కెట్ కోసం వీరిద్దరూ పోటీ పడినప్పటికీ శైలజానాథ్‌కు టీడీపీ మొండిచేయి చూపడంతో గత్యంతరం లేక ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీలో నిలవాల్సి వచ్చింది. పైగా జేసీ సోదరులు ఆడిన నాటకంలో శైలజానాథ్ బలిపశువయ్యారని ఆయన అనుచరులంటున్నారు. టిక్కెట్ విషయంలో నియోజకవర్గంలో శైలజానాథ్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క చందంగా మారింది. కార్యకర్తలు ఎటూ తేల్చుకోలేక కార్యకర్తలూ అయోమయంలో పడ్డారు.
మరోవైపు రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్యాంధ్ర జేఏసీ ఫోరం కన్వీనర్‌గా ఉన్న శైలజానాథ్ ప్రజలను న మ్మించి మోసం చేశారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. దీనికి తోడు మంత్రిగా ఉన్నన్ని రోజులు ఆయన కోటరిలోని కొంత మందిని మాత్రకే దగ్గరకు తీసుకున్న ఆయన మిగిలిన వారిని కేవలం ఓట్ల కోసమే వాడుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. గోడమీద పిల్లలా వ్యవహరించి మాజీ మంత్రి చివరకు కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసినా ప్రజల వద్దకు వెళ్లే పరిస్థితి లేదని నియోజకవర్గ ప్రజలంటున్నారు.
తల్లి ఇమేజ్‌తో టీడీపీ అభ్యర్థి యామినిబాల..
తెలుగుదేశం పార్టీ నాయకురాలు శమంతకమణి ఇమేజ్‌తో ఆమె కూతురు యామిని బాల ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగారు. అయితే శమంతకమణికి నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత యామినిబాలపై పడనుంది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో శైలజానాథ్, రఘువీరారెడ్డి ఇద్దరి వద్ద సుమారు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు అభివృద్ధి నిధులను విడుదల చేయించుకుని.. ఆ పనులను గుడ్‌విల్‌కు అమ్ముకున్నారని ఆ పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. గ్రూపు రాజకీయాలను పెంచి మండల నాయకులను రెండు వర్గాలుగా విడగొట్టేశారని అపవాదు ఉంది.
గత సింగిల్‌విండో ఎన్నికల్లో బుక్కరాయసముద్రం సింగిల్‌విండో డెరైక్టర్‌గా టీడీపీ అభ్యర్థి విజయం సాధించినా..ముందుగా కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు శమంతకమణి ఆ డెరైక్టర్‌ను కాంగ్రెస్ ఖాతాలో కలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనివల్లే బుక్కరాయసముద్రం సొసైటీని కోల్పోయామని టీడీపీలోని మరో వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. యామిని బాలకు టికెట్టు ఇప్పించినా ఆమె ఉపాధ్యాయ వృత్తిలో ఉండడంతో నియోజకవర్గ ప్రజలతో నేరుగా సంబంధాలు లేవు. దీనికితోడు ఈమె స్థానికేతరురాలన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమె ఏమేరకు సక్సెస్ అవుతారో తెలియని పరిస్థితి.
నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ హవా..
కాంగ్రెస్, టీడీపీ నాయకులతో విసిగి వేసారి పోయిన నియోజకవర్గ ప్రజలకు పంచాయతీ, సింగిల్ విండో ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకే పట్టం కట్టారు. నియోజకవర్గంలో మొత్తం116 పంచాయతీలు ఉండగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు 68, టీడీపీ 46, కాంగ్రెస్ రెండు పంచాయతీలు దక్కించుకుంది. అలాగే నియోజకవర్గంలో ఏదు సొసైటీలు ఉండగా ఐదు సొసైటీలు వైఎస్సార్‌సీపీ పరంగా కాగా, టీడీపీ, కాంగ్రెస్‌లు చెరో సొసైటీని దక్కించుకున్నారు.