‘ముత్తూట్‌’లో ఘరానా దోపిడీ | Robbery in the Muthoot Finance | Sakshi
Sakshi News home page

‘ముత్తూట్‌’లో ఘరానా దోపిడీ

Published Thu, Dec 29 2016 2:06 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

‘ముత్తూట్‌’లో ఘరానా దోపిడీ - Sakshi

‘ముత్తూట్‌’లో ఘరానా దోపిడీ

సీబీఐ అధికారులమంటూ 46 కిలోల బంగారంతో పరార్‌
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో చోరీ
పక్కా స్కెచ్‌తో వచ్చిన ఐదుగురు సభ్యుల ముఠా
నల్లడబ్బుతో కొందరు బంగారం కొని ఇక్కడే దాచారని దబాయింపు
లాకర్లు తెరవాలంటూ తుపాకీతో బెదిరింపు
సిబ్బందిని బాత్రూమ్‌లో బంధించి బంగారంతో చెక్కేసిన ముఠా
దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు

రామచంద్రాపురం: ఒకడిది నల్లటి సఫారీ డ్రెస్‌.. చేతిలో పిస్టోల్‌.. ఇంకొకడిది ట్రాఫిక్‌ పోలీస్‌ వేషధారణ.. మరొకడి ముఖానికి మంకీ క్యాప్‌.. ఇలా ఐదుగురు ఐదు రకాలుగా వచ్చారు.. తామంతా సీబీఐ అధికారుల మన్నారు.. అచ్చూ పోలీసుల మాదిరే మాట్లా డారు.. నల్లడబ్బుతో కొందరు బంగారం కొని ఇక్కడే దాచారని దబాయించారు.. ఇదిగో వీడే దొంగ అంటూ ‘మంకీ క్యాప్‌’వేసుకున్నవాడిని చూపించారు.. లాకర్లు తెరవమన్నారు.. ‘నో’అన్నందుకు తుపాకీతో బెదిరించారు.. గదిలో బంధించారు.. 15 నిమిషాల్లోనే రూ.13 కోట్ల విలువైన 46 కిలోల బంగారంతో ఉడాయించారు! సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బీరంగూడ కమాన్‌ సమీపంలో ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌లో జరిగిన ఘరానా దోపిడీ ఇది!! నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే 65వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న ఈ సంస్థలో బుధవారం ఉదయం సినీఫక్కీలో చోటుచేసుకున్న ఈ భారీ దొంగతనం సంచలనం సృష్టించింది.

ఎలా వచ్చారు.. ఏమన్నారు..?
బుధవారం ఉదయం 8.45 నిమిషాలకు రోజూలాగే ముత్తూట్‌ ఫైనాన్స్‌ సిబ్బంది కార్యాలయాన్ని తెరిచారు. రోజువారీ మాదిరే అంతర్గత సమావేశం నిర్వహించేందుకు సిద్ధ మయ్యారు. తొమ్మిది గంటల సమయంలో ఐదుగురు సభ్యులున్న దోపిడీ ముఠా ఓ నల్లటి స్కార్పియో వాహనంలో వచ్చింది. వాహనాన్ని రోడ్డుపై ఆపి.. వారంతా మొదటి అంతస్తులోని ‘ముత్తూట్‌’కార్యాలయంలోకి వెళ్లారు. ఫైనాన్స్‌ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డ్‌ దేవరాజ్‌తో తాము సీబీఐ అధికారులని చెప్పారు. అతడిని కూడా కార్యాలయంలోకి తీసుకెళ్లారు. వాచ్‌మన్‌ను కేబిన్‌ బయటే ఉంచి.. అతడికి కాపలాగా తమలో ఒకడిని ఉంచారు. మిగతా నలుగురు గదిలో సమావేశమైన సిబ్బంది వద్దకు వెళ్లారు. తాము సీబీఐ అధికారులమని, కొందరు నల్లధనంతో బంగారం కొని ఇక్కడ దాచినట్లు సమాచారం అందిందని, తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. వారిలో ఒకరు తలపాగా, సఫారీతో సర్దార్జీలా ఉన్నాడు.

మరో వ్యక్తి మంకీ క్యాప్‌తో ఉన్నాడు. మంకీ క్యాప్‌ వేసుకున్న వ్యక్తి ఎవరని సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. ఇందుకు సఫారీ దుస్తుల్లోని వ్యక్తి.. అతడు దొంగ అని చెప్పాడు. అతను చోరీ చేసిన సొత్తును ఇక్కడే దాచినట్లు తమకు సమాచారం ఉందని.. లాకర్లు తెరవాలని బెదిరించాడు. సీబీఐ అధికారులు లాకర్లు తెరవమని అడగరంటూ ఫైనాన్స్‌ సిబ్బంది నిరాకరించారు. ఇంతలో సర్దార్‌ వేషధారణలో ఉన్న వ్యక్తి తుపాకీతో బెదిరించాడు. భయాందోళనకు లోనైన సిబ్బంది లాకర్‌ తెరిచారు. అందులో ఉన్న సుమారు 46 కిలోల బంగారాన్ని తమ వెంట తెచ్చుకున్న బ్యాగులో దోపిడీ ముఠా సభ్యులు నింపారు.

బ్యాగు పూర్తిగా నిండటంతో వారిలో ఓ వ్యక్తి కిందకు వెళ్లి వాహనం నుంచి ఓ దుప్పటి తేగా.. అందులో కొంత మూట కట్టారు. వచ్చిన పని పూర్తయ్యేంత వరకు ఫైనాన్స్‌ సిబ్బందిని బాత్రూమ్‌ ముందు కూర్చోబెట్టారు. బంగారం మూటలతో వెళ్తూవెళ్తూ.. సీసీ కెమెరా ఫుటేజీని రికార్డు చేసే డీఆర్‌ బాక్స్‌ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. డీఆర్‌ బాక్స్‌ను చూపడంతో దాన్ని కూడా వెంట తీసుకెళ్లారు. పరారయ్యే ముందు ఫైనాన్స్‌ సిబ్బందిని బాత్రూమ్‌లో బంధించి బయట్నుంచి గడియ పెట్టారు. కాసేపటి తర్వాత ఫైనాన్స్‌కు వచ్చిన ఓ ఖాతాదారుడికి బాత్రూమ్‌ నుంచి అరుపులు రావడంతో గడియ తీశాడు. బయటకు వచ్చిన సిబ్బంది వెంటనే 100 నంబర్‌కు డయల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసుల మాదిరి ప్రశ్నలడుగుతూ..
దోపిడీ చేయడానికి వచ్చిన దుండగులు ఎవ్వరికి అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సిబ్బందితో వారు సుమారు ఐదారు నిమిషాలు హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో మాట్లాడినట్లు సైబరాబాద్‌ కమిషనర్‌ తెలి పారు. సిబ్బందిని వారి పేర్లు, వారి తల్లిదం డ్రుల పేర్లు, ఎవరేం చేస్తారో పోలీసుల మాదిరిగా ప్రశ్నించినట్లు తెలిసింది. దోపిడీ దొంగలు వచ్చిన నల్లటి వాహనాన్ని జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీసు రోడ్డుపై నిలిపారు. దోచుకున్న సొత్తుతో అదే వాహ నంలో పటాన్‌చెరు వైపు వెళ్లినట్లు పలువురు చెబుతున్నారు. పోలీసులు సంగారెడ్డి జిల్లా పరిధిలోని కంది, సదాశివపేట, జహీరాబాద్‌ తోపాటు జోగిపేటలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. ముత్తూట్‌ ఫైనాన్స్‌ను సైబరాబాద్‌ కమి షనర్‌ సందీప్‌ శాండిల్యా పరిశీలించారు. సుమారు గంటకుపైగా సిబ్బందితో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... దోపిడీ ఎలా జరిగిందో వివరించారు. దుండగులను పట్టుకునేం దుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నట్టు తెలిపారు. తాకట్టు పెట్టిన బంగారంపై ఇన్సూరెన్స్‌ ఉందని, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముత్తూట్‌ అధికారి ఒకరు తెలిపారు.

దొంగల ముఠాలో ఎవరెలా ఉన్నారంటే..
► సర్దార్జీ: బ్లాక్‌ సఫారీ డ్రెస్, బూట్లు ధరించి సీబీఐ అధికారిగా చెప్పుకున్నా డు. కుడి చేతికి బంగారం ఉంగరం ధరిం చాడు. 35 నుంచి 40 ఏళ్ల వయసు ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్‌లో అనర్గళం గా మాట్లాడాడు. చేతిలో పిస్టోల్‌ ఉంది
► రెండో వ్యక్తి: పలుచటి గులాబీ రంగు గల మంకీ క్యాప్‌ ధరించాడు. ఇతడినే దొంగగా చూపారు. ఇతడే బంగారం దాచి ఉండే అల్మార్లలోని సొత్తును ఒకచోటకు చేర్చి బ్యాగ్‌లో నింపాడు
► మూడో వ్యక్తి: ట్రాఫిక్‌ పోలీసు వేషధారణలో తెల్లటి చొక్కా, లైట్‌ బ్లాక్‌ ప్యాంట్‌ ధరించాడు
► నాలుగో వ్యక్తి: సఫారీ డ్రెస్‌లో ఉన్నా డు. ఇతడి వద్ద కూడా పిస్తోల్‌ వంటి ఆయుధం ఉంది
► ఐదో వ్యక్తి: మిలిటరీ క్యాప్‌ ధరిం చాడు. వైట్‌ షర్ట్‌ టక్‌ చేసి ఆఫీసర్‌లా ఉన్నాడు.

 గుల్బార్గాకు ముఠా...
ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దోపిడీకి పాల్పడిన దొంగల ముఠా కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన 16 బృందాలు అక్కడికెళ్లాయి. ఈ దోపిడీ అంతర్రాష్ట ముఠా సభ్యుల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముఠా ప్రయాణించిన వాహనం నంబర్‌ను ఏపీ 28 ఎన్‌3107. ఇది రంగారెడ్డి జిల్లా ఇబ్ర హీంపట్నం షాయిగూడకు చెందిన తిరుమల్‌రెడ్డికి చెందిన మోటార్‌ సైకిల్‌ నం బరుగా తేలింది. పోలీసులను బురిడీ కొట్టిం చేందుకే దొంగలు ఈ నకిలీ నంబర్‌ను వినియోగించినట్టు భావిస్తున్నారు. నిందితు లు ఈ వాహనంలో కొంత దూరం ప్రయా ణించి.. ఆ తర్వాత మరో వాహనంలోకి మారి ఉంటారా? అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ముఠాలో ఐదుగురు సభ్యుల తోపాటు ఓ మహిళ కూడా ఉన్నట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా అంచనాకు వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement