- పట్టాభిషేక ఉత్సవాలను విజయవంతం చేయాలి
- జెడ్పీ చైర్మన్ చమన్‌సాబ్
అనంతపురం ఎడ్యుకేషన్ : శ్రీకృష్ణదేవరాయల పాలన ఆదర్శనీయమని జిల్లా పరిషత్ చైర్మన్ చమన్‌సాబ్ అన్నారు. ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించే శ్రీకృష్ణదేవరాయల 504వ పట్టాభిషేక ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం అనంతపురంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కేఎస్‌ఆర్ బాలికల పాఠశాల వద్ద జెడ్పీ చైర్మన్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు మంచి పరిపాలనా దక్షుడన్నారు.
జనరంజకమైన పాలన అందించారని గుర్తు చేశారు. ప్రజోపయోగకరమైన కార్యాలతోపాటు, తెలుగువారి గొప్పతనాన్ని దశదిశలా చాటాడన్నారు. ఆయన పాలనలో వ్యవసాయం, సాగునీటికి అత్యంత ప్రాధాన్యత లభించిందన్నారు. అవకాశం ఉన్న ప్రతిచోటా చెరువులను నిర్మింపజేశారన్నారు. ఆయన తవ్వించిన చెరువులు నేటికీ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రస్తుత పాలకులకు శ్రీ కృష్ణదేవరాయల పాలనా విధానం ఆదర్శనీయమన్నారు.
కలెక్టరు సొలొమన్ ఆరోగ్యరాజ్ మాట్లాడుతూ కృష్ణదేవరాయలు ప్రజలకు చేసిన సేవలు నేటికీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని కొనియాడారు. ఆయన కళలు, కళాకారులను ప్రోత్సహించడంతోపాటు, తెలుగుభాషాభివృద్ధికి చేసిన కృషి మరువలేనిదన్నారు. రాయలపాలనపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాయల కీర్తిని స్ఫురణకు తెచ్చేందుకు ఈనెల 27,28 తేదీల్లో పెనుకొండలో కృష్ణదేవరాయల 504వ పట్టాభిషేక ఉత్సవాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు.
ఆకట్టుకున్న వేషధారణలు: వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు దేశనాయకులు, కృష్ణదేవరాయల వేషధారణ, సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కోలాటం, చెక్కభజన, మేళతాళాలతో వేలాది మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక కేఎస్‌ఆర్ బాలికల పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ సప్తగిరి సర్కిల్, సుభాష్‌రోడ్డు, టవర్‌క్లాక్, ఓవర్‌బ్రిడ్జి మీదుగా నడిమివంకలోని కృష్ణదేవరాయల విగ్రహం వరకు సాగింది.
అనంతరం రాయల విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మేయర్ మదమంచి స్వరూప, జాయింట్ కలెక్టర్ ఎస్. సత్యనారాయణ, డీఆర్‌ఓ హేమసాగర్, డీఈఓ మధుసూదన్‌రావు, డీఆర్‌డీఏ పీడీ నీలకంఠారెడ్డి, తహశీల్దార్ లక్ష్మినారాయణ, సమాచార శాఖ సహాయ సంచాలకులు వై. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.