సీఎం వెళ్లడానికి కొన్ని గంటల ముందు ...
థానే: పట్టపగలు... అదీ నడిరోడ్డుపై... రద్దీగా ఉన్న ప్రాంతంలో దుండగులు మారణాయుధాలతో బెదిరించి, రూ. 58 లక్షల నగదు దోచుకుని వెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ థానే జిల్లాలోని డోంబివ్యాలీలో ర్యాలీ నిర్వహించేందుకు ఇదే మార్గంలో కొన్ని గంటల ముందు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని అన్ని రైల్వేస్టేషన్లల్లో టికెట్లు విక్రయించిన సొమ్మను తీసుకుని భద్రతా సిబ్బందితో వ్యాన్ బయలుదేరింది. ఆ క్రమంలో కళ్యాణ్ - షిల్ రహదారిలోని నిల్జీ రైల్వే స్టేషన్కు కూతవేటు దూరంలో ఏడుగురు దుండగులు ఆ వ్యాన్ ను ఆపారు. మారణాయుధాలతో బెదిరించి, నగదు మొత్తం తీసుకుని తెల్ల కారులో పరారయ్యారు.
ఇదంతా కన్నుమూసి తెరిచేలోపు జరిగిపోయింది. వెంటనే తేరుకున్న సిబ్బంది... పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం కనిపించలేదు. అయితే దుండగులు ఉపయోగించిన తెల్లకారును మాత్రం వారు కనుగొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు జరుపుతున్నట్లు డీసీపీ పరాగ్ మనీరి వెల్లడించారు.