cash van
-
రూ. 8 కోట్లు కొట్టేసి..ఫ్రీ ఫ్రూటీకి దొరికిపోయింది!
ఉచితంగా ఏదైనా లభిస్తున్నదంటే ఎవరైనా ఆసక్తి చూపిస్తారు. దానిని దక్కించుకునేందుకు తప్పక ప్రయత్నిస్తారు. ఈ నేపధ్యంలో కొందరు బోల్తా కొట్టిన సంఘటనలు కూడా చూస్తుంటాం. తాజాగా పంజాబ్‌లో రూ. 8 కోట్లు కొట్టేసి, పరారైన ఒక మహిళ ఫ్రీ ఫ్రూటీకి ఆశపడి పోలీసులకు పట్టుబడింది. పంజాబ్‌లోని లుథియానాలో రూ.8 కోట్ల 49 లక్షలు చోరీ చేసిన మాస్టర్‌మైండ్ ‘డాకూ హసీనా’ మన్దీప్ కౌర్ ఉరఫ్ మోనాను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఆ సమయంలో ఉత్తరాఖండ్‌లోని చమేలీలో గల హేమకుండ్ సాహిబ్‌కు మొక్కుతీర్చుకునేందుకు భర్తతో పాటు వెళుతోంది. ఈ ఉదంతంలో ఇప్పటికే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ కేసులో పోలీసులు 9 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 5 కోట్ల 96 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు అధికారి మన్దీప్ సింగ్ సిద్దూ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. పోలీసులకు అందిన సూచనల ప్రకారం మన్దీప్ కౌర్ దంపతులు నేపాల్ మార్గంలో విదేశాలకు పారిపోవచ్చని తెలిసింది. అయితే లుక్అవుట్ నోటీస్ జారీ చేసినందున వారి ప్రయత్నం సఫలం కాలేదు. వారి నుంచి రూ. 21 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, ఆమె భర్త గౌరవ్ ఉపఫ్ గుల్షన్‌ను కూడా అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. క్యాష్ వ్యాన్ చోరీ అనంతరం పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న మన్దీప్ కౌర్ గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ‘ఫ్రీ ఫ్రూటీ సర్వీస్’ పేరుతో వలపన్ని, ఆమె ఉచితంగా ఫ్రూటీ తీసుకునేందుకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. చోరీ విజయవంతం కావడంతో.. క్యాష్ వ్యాన్ చోరీ విజయవంతం కావడంతో మొక్కు తీర్చుకునేందుకు మన్దీప్ కౌర్ తన భర్తతో పాటు హేమకుండ్‌కు వచ్చింది. అక్కడి నుంచి వారు తిరిగివెళుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా మన్దీప్ కౌర్ దంపతులు హేమకుండ్ నుంచి కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారు. చోరీ జరిగిందిలా.. జూన్ 10న రాత్రి సమయంలో ఆయుధాలు ధరించిన దుండగులు లుథియానాలోని న్యూ రాజ్‌గురు నగర్ ప్రాంతంలో సిఎంఎస్ సెక్యూరిటీస్‌కు చెందిన ఒక క్యాష్ వ్యాన్‌ను చోరీ చేశారు. ఈ వ్యానులో రూ. 8 కోట్ల 49 లక్షలు ఉన్నాయి. లుథియానాకు 20 కిలోమీటర్ల దూరంలోని ముల్లాపూర్‌లో పోలీసులకు క్యాష్ వ్యాన్ రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో కనిపించింది. దానిలో ఉన్న మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు లుథియానా పోలీసులు సైబర్ టీమ్ సహాయం తీసుకుని, వ్యాన్ జీపీఎస్‌ను ట్రాక్ చేశారు. నిందితులు వినియోగిస్తున్న మొబైల్ టవర్ డిటైల్స్ లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు ఐదుగురు నిందితులను వెంటనే పట్టుకోగలిగారు. వారి దగ్గర నుంచి రూ. 5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఉదంతంలో మాస్టర్‌మైండ్ మన్దీప్ కౌర్ తన భర్త, మరో ఐదుగురుతో పాటు పరారయ్యింది. అయితే పోలీసులు మన్దీప్ కౌర్ మూమెంట్స్‌ను ట్రాక్ చేస్తూ వచ్చారు. చివరికి వారిని హేమకుండ్‌లో అరెస్టు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: రీల్స్ మెజులో బావిపైకి ఎక్కి.. -
ఆ టైమ్ దాటితే ఏటీఎంల్లో నగదు నింపరు..
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దుతో నగదు కోసం జనం పాట్లు మరువకముందే ఏటీఎంల్లో క్యాష్ దొరక్క ఇబ్బందులు ఎదుర్కోవడం రొటీన్‌గా మారింది. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం ఆరు దాటితే ఏటీఎంల్లో నగదు నింపరని, పట్టణ ప్రాంతాల్లో రాత్రి 9 తర్వాత ఏటీఎంలో నగదును నింపరని హోంమంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానున్నాయి. ఏటీఎంల్లో నగదును నింపే ప్రైవేట్ ఏజెన్సీలు ఆయా బ్యాంక్‌ల నుంచి ఉదయాన్నే నగదును సేకరించి సాయుధ వాహనాల్లో వాటిని తరలించి సాయంత్రం ఆరు లోగా గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంల్లో నింపాలని, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల్లోపే ఈ తతంగం పూర్తిచేయాలని హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ పేర్కొంది. నగదు వ్యాన్లపై దాడులు, ఏటీఎంల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్న క్రమంలో తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఫిబ్రవరి 8 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇక ప్రతి క్యాష్ వ్యాన్‌కు డ్రైవర్‌తో పాటు ఇద్దరు సాయుధ సెక్యూరిటీ గార్డు, ఇద్దరు ఏటీఏం అధికారులు లేదా కస్టోడియన్స్ నగదు నింపే ప్రక్రియలో పాలుపంచుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏటీఎం అధికారులను నేపథ్య పరిశీలన అనంతరమే నియమించుకోవాలని హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. నగదు రవాణాకు భద్రతాధికారిగా మాజీ సైనికోద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. క్యాష్ వ్యాన్‌లో ఐదు రోజుల రికార్డింగ్ సదుపాయంతో కూడిన చిన్న సీసీటీవీ వ్యవస్థను నెలకొల్పాలని పేర్కొంది. క్యాబిన్ లోపల, బయట మూడు కెమేరాలను ఏర్పాటు చేయాలని సూచించింది. -
క్యాష్ వ్యాన్‌పై కాల్పులు: రూ.11లక్షలు లూటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో దొంగలు చెలరేగి పోయారు. భారీ నగదుతో వెళుతున్న క్యాష్‌వ్యాన్ పై కాల్పులు జరిపి సుమారు రూ.11లక్షల సొమ్మును ఎత్తుకళ్లారు. బైక్ వచ్చిన ముగ్గురు ఆగంతకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. విజయ్ విహార్‌లో శనివారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ ఘటనలో క్యాషియర్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
సీఎం వెళ్లడానికి కొన్ని గంటల ముందు ...
థానే: పట్టపగలు... అదీ నడిరోడ్డుపై... రద్దీగా ఉన్న ప్రాంతంలో దుండగులు మారణాయుధాలతో బెదిరించి, రూ. 58 లక్షల నగదు దోచుకుని వెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ థానే జిల్లాలోని డోంబివ్యాలీలో ర్యాలీ నిర్వహించేందుకు ఇదే మార్గంలో కొన్ని గంటల ముందు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని అన్ని రైల్వేస్టేషన్లల్లో టికెట్లు విక్రయించిన సొమ్మను తీసుకుని భద్రతా సిబ్బందితో వ్యాన్ బయలుదేరింది. ఆ క్రమంలో కళ్యాణ్ - షిల్ రహదారిలోని నిల్జీ రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఏడుగురు దుండగులు ఆ వ్యాన్ ను ఆపారు. మారణాయుధాలతో బెదిరించి, నగదు మొత్తం తీసుకుని తెల్ల కారులో పరారయ్యారు. ఇదంతా కన్నుమూసి తెరిచేలోపు జరిగిపోయింది. వెంటనే తేరుకున్న సిబ్బంది... పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం కనిపించలేదు. అయితే దుండగులు ఉపయోగించిన తెల్లకారును మాత్రం వారు కనుగొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు జరుపుతున్నట్లు డీసీపీ పరాగ్ మనీరి వెల్లడించారు. -
బ్యాంక్ వాహనం నుంచి రూ. 1.35 కోట్లు దోపిడీ
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు బ్యాంక్ వాహనం నుంచి 1.35 కోట్ల రూపాయలను దోచుకెళ్లారు. బ్యాంక్ సిబ్బంది ఏటీఎంలలో డబ్బు నింపేందుకు తీసుకెళ్తుండగా దోపీడి జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఓ బ్యాంక్ ఏటీఎంలో డబ్బుల నింపుతుండగా, దొంగలు వాహనంలోని నగదును ఎత్తుకెళ్లారు. వాహనం డ్రైవర్, సెక్యూరిటీ గార్డు పాత్రపై పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరని అదుపులోకి తీసుకున్నారు.