ఉచితంగా ఏదైనా లభిస్తున్నదంటే ఎవరైనా ఆసక్తి చూపిస్తారు. దానిని దక్కించుకునేందుకు తప్పక ప్రయత్నిస్తారు. ఈ నేపధ్యంలో కొందరు బోల్తా కొట్టిన సంఘటనలు కూడా చూస్తుంటాం. తాజాగా పంజాబ్‌లో రూ. 8 కోట్లు కొట్టేసి, పరారైన ఒక మహిళ ఫ్రీ ఫ్రూటీకి ఆశపడి పోలీసులకు పట్టుబడింది.
పంజాబ్‌లోని లుథియానాలో రూ.8 కోట్ల 49 లక్షలు చోరీ చేసిన మాస్టర్‌మైండ్ ‘డాకూ హసీనా’ మన్‌దీప్ కౌర్ ఉరఫ్ మోనాను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఆ సమయంలో ఉత్తరాఖండ్‌లోని చమేలీలో గల హేమకుండ్ సాహిబ్‌కు మొక్కుతీర్చుకునేందుకు భర్తతో పాటు వెళుతోంది. ఈ ఉదంతంలో ఇప్పటికే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ కేసులో పోలీసులు 9 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 5 కోట్ల 96 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసు అధికారి మన్‌దీప్ సింగ్ సిద్దూ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. పోలీసులకు అందిన సూచనల ప్రకారం మన్‌దీప్ కౌర్ దంపతులు నేపాల్ మార్గంలో విదేశాలకు పారిపోవచ్చని తెలిసింది. అయితే లుక్‌అవుట్ నోటీస్ జారీ చేసినందున వారి ప్రయత్నం సఫలం కాలేదు. వారి నుంచి రూ. 21 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, ఆమె భర్త గౌరవ్ ఉపఫ్ గుల్షన్‌ను కూడా అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
క్యాష్ వ్యాన్ చోరీ అనంతరం పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న మన్‌దీప్ కౌర్ గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ‘ఫ్రీ ఫ్రూటీ సర్వీస్’ పేరుతో వలపన్ని, ఆమె ఉచితంగా ఫ్రూటీ తీసుకునేందుకు రాగానే అదుపులోకి తీసుకున్నారు.
చోరీ విజయవంతం కావడంతో..
క్యాష్ వ్యాన్ చోరీ విజయవంతం కావడంతో మొక్కు తీర్చుకునేందుకు మన్‌దీప్ కౌర్ తన భర్తతో పాటు హేమకుండ్‌కు వచ్చింది. అక్కడి నుంచి వారు తిరిగివెళుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా మన్‌దీప్ కౌర్ దంపతులు హేమకుండ్ నుంచి కేదార్‌నాథ్, బద్రీనాథ్ వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారు.
చోరీ జరిగిందిలా..
జూన్ 10న రాత్రి సమయంలో ఆయుధాలు ధరించిన దుండగులు లుథియానాలోని న్యూ రాజ్‌గురు నగర్ ప్రాంతంలో సిఎంఎస్ సెక్యూరిటీస్‌కు చెందిన ఒక క్యాష్ వ్యాన్‌ను చోరీ చేశారు. ఈ వ్యానులో రూ. 8 కోట్ల 49 లక్షలు ఉన్నాయి. లుథియానాకు 20 కిలోమీటర్ల దూరంలోని ముల్లాపూర్‌లో పోలీసులకు క్యాష్ వ్యాన్ రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో కనిపించింది. దానిలో ఉన్న మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను పట్టుకునేందుకు లుథియానా పోలీసులు సైబర్ టీమ్ సహాయం తీసుకుని, వ్యాన్ జీపీఎస్‌ను ట్రాక్ చేశారు. నిందితులు వినియోగిస్తున్న మొబైల్ టవర్ డిటైల్స్ లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు ఐదుగురు నిందితులను వెంటనే పట్టుకోగలిగారు. వారి దగ్గర నుంచి రూ. 5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఉదంతంలో మాస్టర్‌మైండ్ మన్‌దీప్ కౌర్ తన భర్త, మరో ఐదుగురుతో పాటు పరారయ్యింది. అయితే పోలీసులు మన్‌దీప్ కౌర్ మూమెంట్స్‌ను ట్రాక్ చేస్తూ వచ్చారు. చివరికి వారిని హేమకుండ్‌లో అరెస్టు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: రీల్స్ మెజులో బావిపైకి ఎక్కి..
Comments
Please login to add a commentAdd a comment