అదో సరికొత్త అనుభవం
క.క.క.పో చిత్రంలో నటించడానికి భయపడ్డానని ఆ చిత్రం కథానాయకి సాక్షీ అగర్వాల్ తెలిపారు.ఈమె నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం ఇది. నవ నటుడు కేశవన్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని డీఎన్‌ఎస్.ప్రొడక్షన్స్ పతాకంపై సెల్వి శంకరలింగం నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు పీఎస్.విజయ్ పరిచయం అవుతున్నారు.ఈయన వికడన్ పత్రిక సంస్థలో సుదీర్ఘ కాలం పని చేశారన్నది గమనార్హం.
విజయ్ కథ,కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ క.క.క.పో చిత్రానికి దినా, పీసీ.శివం,అమర్.సీవీ ముగ్గురు సంగీతాన్ని అందించడం విశేషం. చిత్ర వివరాలను దర్శకుడు పీఎస్.విజయ్ తెలుపుతూ ఇది వినోదమే ప్రధానంగా తెరకెక్కించిన వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రం అని చెప్పారు. ఫాంటసీతో కూడిన చిన్న మ్యాజిక్ కూడా చిత్రంలో ఉంటుందన్నారు. మరో విషయం ఏమిటంటే పవర్‌స్టార్ శ్రీనివాసన్, సింగంపులి,ఎంఎస్.భాస్కర్, కరుణాస్,మదన్‌బాబు, మయిల్‌సామి,రోబోశంకర్ తదితర 40 మంది హాస్య నటులు నటించిన చిత్రం ఇదని అన్నారు. దీన్ని తెలుగులో కూడా రీమేక్ చేయనున్నట్లు దర్శకుడు తెలిపారు.
హీరోలా ఫైట్స్ చేశాను
చిత్ర కథానాయకి సాక్షీ అగర్వాల్ మాట్లాడుతూ ఈ చిత్ర కథను దర్శకుడు చెప్పినప్పుడు ఇందులో నటించడానికి చాలా భయపడ్డానని, ఆ తరువాత అమ్మానాన్నలు కథ విని నటించమని ప్రోత్సహించడంతో తాను ధైర్యం చేశానని అన్నారు. చిత్రంలో అంతా వివాదాస్పద విషయం ఉందన్నారు.అయితే దర్శకుడు ఆ సన్నివేశాన్ని ఎలాంటి వివాదాస్పదానికి తావు లేకుండా చిత్రీకరించారని తెలిపారు.
సాధారణంగా చిత్రాల్లోహీరోలకు ఇంట్రో సాంగ్ ఉంటుందనీ, అలాంటిది ఈ చిత్రంలో తనకూ ఇంట్రో సాంగ్ ఉంటుందని చెప్పారు.అంతే కాదు చిత్ర తుది ఘట్ట సన్నివేశంలో తాను ఫైట్ చేశానని వెల్లడించారు.మొత్తం మీద ఈ చిత్రంలో నటించడం తనకు సరి కొత్త అనుభం అని సాక్షి పేర్కొన్నారు. ఇది పేమ ఇతివృత్తంతో కూడిన హాస్య భరిత చిత్రం కావడంతో చిత్ర సింగిల్ ట్రాక్ ఆడియోను ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు నిర్మాత వెల్లడిం చారు.చిత్రాన్ని మార్చిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.