‘సమైక్య’ గర్జన
Published Mon, Sep 2 2013 4:44 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
స్వార్థంతో, స్వప్రయోజ నాలతో ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టొద్దంటూ కేంద్రానికి చెన్నైలోని తెలుగు సంఘా లు విన్నవించాయి. విభజన బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన పక్షంలో మద్దతు ఇవ్వొద్దని డీఎంకే, అన్నాడీఎంకేలకు విజ్ఞప్తి చేశాయి. మరోవైపు రాజకీయ సెగ సమైక్య సింహగర్జనను తాకింది. దీంతో ప్రదర్శన రసాభాస గా మారింది.
సాక్షి, చెన్నై: తెలంగాణకు అనుకూలంగా కేంద్రం ప్రకటన చేయడంతో సీమాంధ్రలో ఉద్యమం మొదలైంది. ప్రజలు నెల రోజులకుపైగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణే తమ లక్ష్యమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని తెలుగు సంఘాలు సైతం రంగంలోకి దిగారుు. సమైక్యాంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాయి. ఈ కమిటీ నేతృత్వంలో ఆదివారం ఉదయం వళ్లువర్‌కోట్టం వద్ద సమైక్య సింహగర్జన ప్రదర్శన జరిగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా, కేసీఆర్, సోనియాలకు వ్యతిరేకంగా నినాదాల్ని హోరెత్తించారు. ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టొదని గర్జించారు. విభజన బిల్లు పార్లమెం ట్‌కు వస్తే వ్యతిరేకించాలని డీఎంకే, అన్నాడీఎంకేకు విజ్ఞప్తి చేశారు.
ఐక్యంగా నడవాలి
జేఏసీ కన్వీనర్ తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ జనాగ్రహంతోనైనా ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ నాయకులకు కనువిప్పు కలగాలన్నారు. తెలంగాణలో నేతలందరూ ఒక తాటి మీద నిలబ డితే, సీమాంధ్రలో ఎవరికి వారు అన్నట్టుగా వ్యవహరించడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఒకరి మీద మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం మానుకుని ఐక్యంగా నడవాలని కోరారు. ఈలం తమిళులకు అన్యాయం జరగగానే ప్రపంచంలోని తమిళులంతా గళం విప్పారని గుర్తు చేశారు. అలాగే తెలుగు వారందరూ సమైక్యాంధ్ర పరిరక్షణకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కెన్సెస్ అధినేత నరసారెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీలు కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచిన పక్షంలో విభజన ప్రక్రియ ఆగడం తథ్యమన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాల్ని ఇప్పటికైనా వీడండంటూ నాయకుల్ని కోరారు. ప్రముఖ ఆడిటర్ జేకేరెడ్డి మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్వలాభం కోసం ఈ నేతలు సోనియా వద్ద ఓ మాట, ప్రజల వద్ద మరోమాట చెబుతున్నారని మండిపడ్డారు. జేఏసీ కో కన్వీనర్ నారాయణ గుప్తా మాట్లాడుతూ రాజకీయూలకతీతంగా జేఏసీ ఆవిర్భవించిందన్నారు. తెలుగువారి ఐక్యత చాటుతూ సమైక్యాంధ్రప్రదేశ్‌ను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జాయింట్ కన్వీనర్లు రంగనాయకులు, పుట్టా జయరాం, శివప్రసాద్, ఐటీఏ అధ్యక్షుడు నగేష్, ఆస్కా మాజీ అధ్యక్షుడు ఆదిశేషయ్య, సభ్యుడు అనిల్‌కుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రసాభాస
సమైక్య గర్జన ప్రదర్శన ఆరంభం నుంచే వివాదానికి దారి తీసింది. ఈ ప్రదర్శనకు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం, ఆయన నిలువెత్తు ఫొటోతో సమైక్య సింహం చంద్రమోహన్ రెడ్డి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వివాదానికి ఆజ్యం పోసింది. సమైక్యవాదులు కొందరు దీన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయూలకు అతీతంగా ఉద్యమం సాగుతుంటే ఇక్కడ ముఖ్య అతిథులు అవసరమా అని ప్రశ్నించడంతో వివాదం రాజుకుంది. దీంతో జేఏసీ వర్గాలు మల్లగుల్లాలు పడ్డాయి. నిలదీసిన వారిని బుజ్జగించి గర్జన ప్రదర్శన నిర్వహించాయి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యాక ప్రదర్శనలో పలుమార్లు గందరగోళం చోటు చేసుకుంది. ఆయన ప్రసంగి స్తున్న సమయంలో కొందరు జేజేలు పలకడం, ఇంకొందరు వాగ్యుద్ధాలకు దిగడం జరిగింది.
రాజకీయ మెళికలతో చేస్తున్న ఆయన ప్రసంగానికి పలువురు అడ్డు తగిలారు. సమైక్యాంధ్ర జిందాబాద్ అని నినదించాలని డిమాండ్ చేశారు. మీడియా సంధించిన ప్రశ్నలకు సైతం సోమిరెడ్డి డొంక తిరుగుడు సమాధానాలు ఇవ్వడం గమనార్హం. ఇది అక్కడున్న ఇతర పార్టీలకు చెందిన సమైక్యవాదులకు కోపం తెప్పించింది. ఆయన్ను నిలదీయడానికి వారు యత్నించే క్రమంలో గందరగోళం నెలకొంది. దీంతో అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సీఎంకే రెడ్డి జోక్యం చేసుకున్నారు. ఇది రాజకీయాలకు వేదిక కాదని, ఆయా పార్టీలకు ఒక విధానం ఉంటుందని, ఇక్కడ రాజకీయాన్ని వీడాలని విజ్ఞప్తి చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు అందరం ముందుకు సాగుదామని సూచించడంతో వివాదం సద్దుమనిగింది. చివరగా కావలి (టీడీపీ) ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు సమైక్యం వర్థిల్లాలి అంటూ రెండు ముక్కల్లో ప్రసంగాన్ని ముగించారు.
Advertisement
Advertisement