లక్ష సంతకాల ఉద్యమం
Published Thu, Sep 19 2013 2:22 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా లక్ష సంతకాల సేకరణకు సమైక్యాంధ్ర జేఏసీ (తమిళనాడు) శనివారం శ్రీకారం చుట్టనుంది. ప్రముఖులతో త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహణకు సమాయత్తమవుతోంది. విభజన వలన కలిగే నష్టాలను వివరిస్తూ కరపత్రాలను బుధవారం విడుదల చేసింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో ఉద్యమం ఉద్ధృ తంగా సాగుతోంది. తమిళనాడులోని తెలుగువారు సైతం తమ వంతుగా ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమైక్యాంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ (తమిళనాడు) కన్వీనర్ తంగుటూరి రామకృష్ణ చెన్నైలో బుధవారం మీడియూతో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఈ నెల 21వ తేదీ సాయంత్రం 4 గంటలకు చెన్నై వెంకటనారాయణ రోడ్డులోని టీటీడీ ఆలయ సమీపంలో లక్ష సంతకాల సేకరణను ప్రారంభిస్తామన్నారు. కమిటీ సభ్యులు బృందాలుగా ఏర్పడి తమిళనాడులోని తెలుగువారు, తమిళుల నుంచి సంతకాలు సేకరిస్తారని చెప్పా రు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అనేక ఉద్యమాలు జరిగాయన్నారు.
పతి ఉద్యమం వెనుక ఏదో ఒక రాజకీయ పార్టీ ప్రోద్బలం ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందన్నారు. ఎక్కడికక్కడ ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నారని తెలిపారు. విభజన అంటూ జరిగితే రాష్ట్రానికి కలిగే నష్టాలు ప్రజల కళ్ల ముందు కదలాడడమే ఉద్యమ ఉద్ధృతికి కారణమని వివరించారు. స్వచ్ఛందంగా సాగుతున్న ఉద్యమంతో ఏమీ పాలుపోక రాజకీయ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకున్న తెలంగాణ ఏర్పాటు నిర్ణయం అనేక రాష్ట్రాలో నిప్పురాజేసిందని వెల్లడించారు. అనేక ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ తెరపైకి వచ్చిందని చెప్పారు.
త్వరలో భారీ బహిరంగ సభ
సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమై బుధవారానికి 50 రోజులు పూర్తయిందని తంగుటూరి రామకృష్ణ తెలిపారు. ఈ దృష్ట్యా రాష్ట్ర విభజన జరిగితే కలిగే నష్టాలను వివరిస్తూ కరపత్రాన్ని ముద్రించి ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. మంత్రి టీజీ వెంకటేష్, ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, లగడపాటి రాజగోపాల్ తదితర రాజకీయ ప్రముఖులతో త్వరలో చెన్నైలో భారీఎత్తున సమైక్యాంధ్ర సభను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశ స్వాతంత్య్ర పోరాటం తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమమే అతిపెద్ద ఆందోళనగా రికార్డులకు ఎక్కనుందని జేఏసీ కో కన్వీనర్ పి.రంగనాయకులు అన్నారు. ఈ మీడియా సమావేశంలో కమిటీ కోశాధికారి పుట్టా జయరాం, సభ్యులు బి.నాగేష్, బి.శ్రీనివాస్, జి.శివప్రసాద్, రమణరాజు, వి.వేణుగోపాల్, వి.రవికుమార్, ఎస్.చక్రధ ర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement