'సమైక్యాంధ్రప్రదేశ్ కు అవిశ్రాంతంగా పోరాడాలి'
Published Sat, Oct 12 2013 3:31 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి: సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణకు అవిశ్రాంతంగా పోరాడాలని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారని ఆ పార్టీ తమిళనాడుశాఖ ఇన్‌చార్జ్ శరత్‌కుమార్ తెలిపారు. కార్యసాధన దిశగా తెలుగు ప్రజలు ఏకం కావాలని సూచించారన్నారు. ఆయన శుక్రవారం చెన్నైలో మీడియూతో మాట్లాడారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ వై.ఎస్.జగన్ ఇటీవల హైదరాబాద్ లో ఆమరణ దీక్ష చేపట్టారన్నారు.
ఈ సందర్భంగా ఆయన్ను కలిసినప్పుడు తమిళనాడులో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం గురించి అడిగి తెలుసుకున్నారన్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో పార్టీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు, వైఎస్‌ఆర్ వర్ధంతి సభ తదితరాలను వివరించగా జగన్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో బలోపేతం దిశగా పార్టీ సాగడం సంతోషకరమని అన్నారన్నారు. విభజనతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినడం, ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కష్టాల ఊబిలో చిక్కుకోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజనే జరిగితే భావితరాలు క్షమించబోవనే విషయాన్ని తెలుగు వారంతా గుర్తించి సమైక్యాంధ్ర సాధన కోసం పోరాడాలని జగన్ పిలుపునిచ్చారన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ సాగిస్తోంది రాజకీయ పోరాటం కాదని, అమ్మవంటి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకునే ప్రయత్నమని వివరించారని పేర్కొన్నారు. పోరాట పటిమను కోల్పోయి విభజనకు పరోక్షంగా కారకులైన వారిని తెలుగుజాతి ఎన్నటికీ క్షమించదనే సంగతిని ప్రతి తెలుగు బిడ్డా గుర్తించాలని జగన్ చెప్పినట్లు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకునే విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న రాజకీయ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోగలరని హెచ్చరించినట్లు తెలిపారు. పార్టీ తమిళనాడు శాఖ పరంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
Advertisement