సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా సంతకాల సేకరణ
Published Sat, Sep 21 2013 3:54 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
సీమాంధ్రలో సాగుతున్న ఉద్యమానికి మద్దతుగా సమైక్యాంధ్ర(తమిళనాడు) జేఏసీ లక్ష సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టింది. టీటీడీ సమాచార కేంద్రంలో ప్రత్యేక పూజలు చేసింది. సమైక్యాంధ్రను పరిరక్షించుకుంటామని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.
టీనగర్, న్యూస్‌లైన్: తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రం ప్రకటన చేయడంతో సీమాంధ్రలో ఉద్యమం రాజుకుంది. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమబాట పట్టారు. యూభై రోజులకుపైగా తిరుగులేని పోరాటం చేస్తున్నారు. వీరికి మద్దతుగా ఉద్యమించేందుకు తమిళనాడులోని తెలుగువారూ సిద్ధమయ్యారు. సమైక్యాంధ్ర జాయింట్ యూక్షన్ కమిటీ (తమిళనాడు) ఏర్పాటైంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. చెన్నై టీనగర్‌లోని టీటీడీ సమాచార కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడారు. లక్ష సంతకాల ఉద్యమాన్ని తమిళనాడులో ఇంత వరకూ ఎవరూ నిర్వహించలేదన్నారు.
ఈ కార్యక్రమానికి తెలుగు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. పలువురు తెలుగువారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా సంతకాలు చేస్తున్నారని చెప్పారు. సమైక్యాంధ్రను పరిరక్షించుకుంటామనే విశ్వాసం తమకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ తంగుటూరి రామకృష్ణ, ప్రోగ్రామ్ చైర్మన్ కె.అనిల్‌కుమార్ రెడ్డి, కోశాధికారి పుట్టా జయరాం, జాయింట్ కన్వీనర్ రంగనాయకులు, అంబత్తూరు తెలుగు సంఘం అధ్యక్షులు ప్రసాద్, ఈసీ సభ్యులు బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement