పూండిలో పడిపోయిన నీటిమట్టం
Published Wed, Oct 9 2013 2:43 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
చెన్నైకి చేరే తెలుగు గంగకూ సమైక్యాంధ్ర సెగ తగిలింది. తెలుగు గంగ పథకం కింద చేరాల్సిన కృష్ణా జలాలను ఆందోళనకారులు అడ్డుకోవడంతో పూండి రిజర్వాయరులో నీటి మట్టం పడిపోయింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: తెలంగాణ విభజనకు తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి చిదంబరమే ప్రధాన కారణమని సమైక్యాంధ్ర ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ఇందుకు ప్రతీకారంగా చెన్నై వాసుల దాహార్తిని తీర్చే తెలుగుగంగ ప్రవాహాన్ని అడ్డుకుంటామని ప్రకటించారు. శ్రీశైలం నుంచి సోమశిల రిజర్వాయరు, అక్కడి నుంచి కండలేరు ప్రాజెక్టు ద్వారా తమిళనాడులోని పూండి రిజర్వాయరుకు నీరు చేరుకోవాల్సి ఉంది. సోమవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని కల్లిపూడి వద్ద తెలుగుగంగ కల్వర్టును మూసివేశారు.
తెలుగు గంగ కాలువల మరమ్మతువల్ల ఇటీవల వరకు తెలుగుగంగ నీటిని విడుదల చేయలేదు. జూలై 1వ తేదీన నీటిని విడుదల చేయగా 400 ఘనపుటడుగుల నీరు ప్రవహిస్తోంది. ఈ నెల 6వ తేదీ నాటికి తమిళనాడు సరిహద్దు జీరో పాయింట్ వద్దకు నీరు చేరడం ప్రారంభమైంది. గత నెలాఖరు నాటికి టీఎంసీ నీరు మాత్రమే చేరింది.
కండలేరులో 600 ఘనపుటడుగుల నీరు విడుదల చేస్తే 200 ఘనపుటడుగులు చేరాల్సి ఉంది. ఆందోళనకారులు అడ్డుకున్న కారణంగా కేవలం 75 నుంచి 80 ఘనపుటడుగులు మాత్రమే చేరింది. దీనిపై తమిళనాడులోని ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ ఉద్యమకారులు అడ్డుకోవడంతోపాటు కాల్వల మార్గ మధ్యంలోని వరదయ్యపాళెం తదితర ప్రాంతాల వారు సైతం ఆందోళనలో భాగంగా ఈ నీటిని సాగునీటి అవసరాలకు మళ్లించడంతో కాలువలో నీటి ప్రవాహ మట్టం దారుణంగా పడిపోయిందని తెలిపారు.
Advertisement