సమంత ఫోన్ స్విచ్ ఆఫ్
సమంత ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతోంది. ఏమిటీ అర్థం కాలేదు కదూ అలా ఎందుకో తెలుసుకోవాలంటే కొంచెం లోతుగా వెళ్లాల్సిందే. సమంత నటిగా ఎంట్రీ ఇచ్చింది ఇక్కడే అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చెన్నై చిన్నదాన్ని తొలుత ఆదరించింది మాత్రం తెలుగు సినిమానే. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్న సమంతకు సొంతగడ్డపై సక్సెస్ లేదన్న చింత లేకపోలేదు. దీంతో ప్రస్తుతం తన దృష్టిని పూర్తిగా కోలీవుడ్‌పై దాల్చింది. రీఎంట్రీలనూ తొలి చిత్రం అంజాన్ అపజయాన్నే మిగిల్చింది.ఆ తరువాత చిత్రం కత్తి సూపర్ సక్సెస్‌ను అందించింది. అది చాలు అమ్మడు దూసుకుపోవడానికి అన్నట్లుగా ఇప్పుడిక్కడ టాప్ హీరోల భారీ చిత్రాలన్నీ ఈ బ్యూటీ కైవశమే.
విక్రమ్‌తో నటించిన పత్తు ఎండ్రదుకుళ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం ధనుష్ సరసన వీఐపీ2, సూర్యకు జంటగా 24, విజయ్ 59వ చిత్రంలో ఆయనకు జోడీగా ద్విభాషా చిత్రం బ్రహ్మోత్సవంలో మహేశ్‌బాబుతో, వడచెన్నై చిత్రంలో ధనుష్‌కు జంటగా అంటూ చేతినిండా చిత్రాలతో ఊపిరాడనంత బిజీగా ఉంది. దీంతో సమంతలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నది కోలీవుడ్ వర్గాల మధ్య జరుగుతున్న హాట్ టాపిక్. ఇంతకు ముందు మార్కెట్‌ను అందుకోవాలని హద్దులు మీరి అందాలారబోసింది. ఇప్పుడా విషయంలో పరిమితులు విధించుకోవాలని నిర్ణయించుకుందట. ముఖ్యంగా పారితోషికం విషయంతో ఖరాఖండీగా వ్యవహరించడం మొదలెట్టిందట.
ఇంతకు ముందు కొందరు సగం పారితోషికం చెల్లించి మిగిలింది ఇదుగో అదుగో అనడంతో గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు చిత్రషూటింగ్ నాలుగు రోజుల్లో పూర్తి అవుతుందనగానే పారితోషికం పూర్తిగా సెటిల్ చెయ్యాలని ముందుగాను దర్శక నిర్మాతలు నిబంధనలు విధిస్తోందట. గ్లామర్‌లో హద్దులు పాటిస్తునందున పారితోషికంలో కోతలంటే ఒప్పుకునేదిలేదంటూ ముందుగానే నిర్మోహమాటంగా చెప్పేస్తోందట. అలాగే పూర్తి పారితోషికం అందకుంటే చివరి నాలుగు రోజుల షూటింగ్ కోసం ఎవరైనా ఫోన్ చేస్తే సమంత ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందట.