మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి
తాడ్వాయి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో బుధవారం నుంచి జరగనున్న మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దీన్నే మండ మెలిగే పండగ అంటారు. మేడారం జాతరకు ముందు వచ్చే ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో రానుండటంతో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి నాలుగు రోజులపాటు కొనసాగే ఈ జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు.
సాయంత్రం డీఎస్పీ, ఓఎస్డీలతో జిల్లా ఎస్పీ భద్రతా ఏర్పాట్లపై సమీక్షిస్తారు. పలువురు వీఐపీలు సమ్మక్కసారలమ్మలను దర్శించుకోనున్నారు. వేలాదిమంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఆర్టీసీ, విద్యుత్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులు కూడా తమ శాఖల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.