సాక్షి, ఎస్‌ఎస్ తాడ్వాయి(వరంగల్): మేడారం సమ్మక్క–సారలమ్మల మహాజాతర పూజాకార్యక్రమాలు బుధవారం జరగనున్న గుడిమెలిగె పండుగతో ఆరంభం కానున్నాయి. ఈ పండుగ నిర్వహించేందుకు పూజారులు మంగళవారం సాయంత్రంనుంచి సిద్ధమయ్యారు. వచ్చే బుధవారం (9న) మండమెలిగె పండుగకు వారానికి ముందుగా గుడిమెలిగె పండుగ నిర్వహించడం ఆనవాయితీ. మేడారంలోని సమ్మక్క గుడి పూర్వకాలంలో గుడిసెతో ఉండేది.
గుడిసెపై కొత్త గడ్డి కప్పి, పందిళ్లు వేసేది. సమ్మక్క గుడి భవనం నిర్మించడంతో పూజారులు సంప్రదాయంగా బుధవారం ఉదయాన్నే సమ్మక్క గుడిని శుద్ధిచేసి ముగ్గులతో అలంకరిస్తారు. అడవినుంచి సేకరించిన ఎట్టిగడ్డిని గుడిపై ఈశాన్య దిశలో పెడతారు. గుడిమెలిగె పండుగ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. నేటి గుడిమెలిగె పండుగతో మహాజాతరకు అంకురార్పణ జరిగినట్లుగానే భావించాలి. కన్నెపల్లి సారలమ్మ గుడిలో కూడా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
పూజారులు సిద్ధం
గుడిమెలిగె పండుగకు పూజారులు సిద్ధమయ్యారు. మంగళవారం సాయంత్రం సమ్మక్క పూజారులు సమావేశమై పండుగ కార్యక్రమాల నిర్వహణపై చర్చించుకున్నారు. ఉదయాన్నే పూజారులు తలస్నానాలు అచరించి అడవికి వెళ్లి ఎట్టిగడ్డిని తీసుకురానున్నారు. గుడిమెలిగె సందర్భంగా భక్తులు కూడా వేలాది మంది తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు.
పూజా కార్యక్రమాలన్నింటినీ సమ్మక్క పూజారులు సిద్దబోయిన మునిందర్, కొక్కర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్య, దూపగడ్డ నాగేశ్వర్‌రావు, బొక్కెన్న, సిద్దబోయిన లక్ష్మణ రావు, సిద్దబోయిన మహేష్, పూజారులు సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, తదితరులు నిర్వహించనున్నారు.
చదవండిః ‘పద్మశ్రీ’కి ఎంపికైన రామచంద్రయ్యకు కేసీఆర్ సర్కార్ బంపరాఫర్
Comments
Please login to add a commentAdd a comment