జైలులో నాలుగు రోజులు అదనంగా గడపనున్న సంజయ్ దత్
సాక్షి, ముంబై: అక్రమ ఆయుధాలు కల్గి ఉన్న కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రముఖ నటుడు సంజయ్ దత్ శిక్షా కాలాన్ని మరో నాలుగు రోజులు పొడిగించినట్లు రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి రామ్ షిండే చెప్పారు. తనకు మంజూరైన సెలవు గడువు ముగిసినప్పటికీ రెండు రోజులు అధికంగా జైలు వెలుపలే గడిపినందుకు ఈ పరిస్థితి ఉత్పన్నమైందని అన్నారు. సంజయ్ దత్ శిక్ష అనుభవిస్తున్న పుణేలోని యేర్వాడ జైలు పరిపాలన విభాగం, స్థానిక పోలీసుల నిర్లక్ష్య వైఖరి, వారి మధ్య సమన్వయం లోపం వల్ల ఈ పరిస్థితి ఎదురైందని షిండే అన్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సంస్థాపరమైన దర్యాప్తుకు ఆదేశిస్తామని మంత్రి చెప్పారు. సంజయ్‌దత్‌కు మంజూరైన సెలవు జనవరి 8వ తేదీతో ముగిసిందని, ఆ రోజు సూర్యాస్తమయానికి ముందే ఆయన జైలులో సరెండర్ కావాల్సి ఉందని అన్నారు. అయితే తనకు మరో 14 రోజులు సెలవు మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసుకున్న దరఖాస్తుపై జైలు అధికారులు స్పందించలేదన్నారు. దీంతో 8వ తేదీన జైలు వరకూ వచ్చిన సంజయ్ దత్‌ను సిబ్బంది వెనక్కి పంపించారు.
ఆయన పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు జనవరి పదో తేదీన జైలు అధికారులు ప్రకటించారు. దీంతో దత్ వెంటనే జైలుకు బయలుదేరారు. కాగా ఆయన అక్రమంగా రెండు రోజులు జైలు బయట గడపడంతో నిబంధనల ప్రకారం ఆయన శిక్షా కాలంలో నాలుగు రోజులు అదనంగా జైలులో ఉండాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జైలు అధికారులు, స్థానిక పోలీసులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రామ్ షిండే చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో జైలు మాన్యువల్‌లో మార్పులు చే స్తామని ఆయన చెప్పారు.