సభలో సంజయ్ బారుతో పి.చిదంబరం
పుస్తకావిష్కరణ సభలో సంజయ్ బారు
సాక్షి,న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు, సీనియర్ పాత్రికేయుడు సంజయ్ బారు రచించిన ‘1991: హౌ పీవీ నరసింహారావు మేడ్ హిస్టరీ’ పుస్తకాన్ని ఢిల్లీలో మంగళవారం కేంద్ర మాజీ మంత్రులు పి.చిదంబరం, యశ్వంత్‌సిన్హా ఆవిష్కరించారు. కాంగ్రెస్‌లో నెహ్రూ-గాంధీ కుటుంబం ఆధిపత్యానికి గండికొట్టి పీవీ అధికారాన్ని చేపట్టినందుకే ఆయన చనిపోయినపుడు పార్థివ దేహాన్ని లోపలికి తీసుకురానీయకుండా పార్టీ కార్యాలయ ద్వారాలు మూసేశారని, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలూ నిర్వహించలేదని ఈ పుస్తకంలో పేర్కొన్నారు.
పీవీ పాలనలో చూపిన దక్షతకు భారతరత్న ప్రకటించాలని, కాంగ్రెస్‌లో నెహ్రూ-గాంధీ కుటుంబంవారే కాక ఇతరులూ ప్రధానులు కావొచ్చన్న ఆశలు నింపిన వ్యక్తి పీవీ అని సంజయ్ అన్నారు. భారత చరిత్రలో 1991 సంవత్సరానికి ఎంతో ప్రత్యేకత ఉందనీ, అత్యంత అవసరమైన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడమేకాక, రాజకీయ సుస్థిరతను పీవీ పునరుద్ధరించారని గుర్తుచేశారు.