![ఆర్థిక సంస్కరణలతో దేశాన్నికాపాడింది పీవీయే!](/styles/webp/s3/article_images/2017/09/4/51476391355_625x300.jpg.webp?itok=vN-EwM-g)
ఆర్థిక సంస్కరణలతో దేశాన్నికాపాడింది పీవీయే!
సాక్షి, హైదరాబాద్: నూతన సంస్కరణలను ప్రవేశపెట్టి, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడిన హీరో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని మాజీ గవర్నర్ రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఆయన తన విధానాలతో దేశాన్ని అనేక సమస్యల నుంచి బయటపడవేయగలిగారని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎకనమిక్ సోషల్ స్టడీస్‌లో జరిగిన కార్యక్రమంలో సంజయ్ బారు రచించిన ‘1991 హౌ పీవీ నరసింహారావు మేడ్ హిస్టరీ’ అనే పుస్తకాన్ని రంగరాజన్ ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడారు. సంజయ్‌బారు తన పుస్తకంలో పీవీ కన్నా ముందు ప్రధానులుగా ఉన్న వీపీ సింగ్, చంద్రశేఖర్‌లకు ఈ దేశ పరిస్థితులపై ఎటువంటి అవగాహన ఉన్నదన్న సంశయాన్ని లేవనెత్తారని రంగరాజన్ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సాయాన్ని పొందడంపై కూడా ఆనాటి రాజకీయనేతల్లో అవసరమైన చొరవ కొరవడిందని వ్యాఖ్యానించారు.
అయితే 1991 నాటి రాజకీయ, ఆర్థిక పరిస్థితులు పీవీ నరసింహారావుకు సంస్కరణల అవకాశం కల్పించాయని చెప్పారు. ఒకవేళ అప్పుడు చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నా ఆర్థిక సంస్కరణలను ఆహ్వానించక తప్పేది కాదన్నారు. ఈ పుస్తకం ఆద్యంత ఆసక్తిదాయకంగా ఉందని చెప్పారు. అయితే 1992లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన ప్రస్తావన కూడా పుస్తకంలో ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
అద్భుత పథకాల రూపశిల్పి
ఆర్థిక సంస్కరణల సృష్టికర్త మాత్రమే కాదని.. సోషలిజాన్ని కాంక్షించిన నెహ్రూ అనుయాయుడు పీవీ అని ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు సీహెచ్ హనుమంతరావు పేర్కొన్నారు. ఉపాధి అవకాశాల ద్వారానే సామాజిక న్యాయం చేకూర్చగలమని ఆయన నమ్మి, ఆచరించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అట్టడుగు బలహీన వర్గాలకు పథకాలు చేరకపోతే నష్టం జరుగుతుందని భావించి.. నేరుగా కేంద్రం నుంచి పేద, దళిత, బలహీనవర్గాలకు అందేలా అద్భుతమైన పథకాలను రూపొందించారని ప్రశంసించారు.
ఆనాడు పీవీ వద్ద పనిచేసిన ఎస్.ఆర్.శంకరన్, కె.ఆర్.వేణుగోపాల్‌లు రూపొం దించిన అనేక పథకాల ఫలితాలను ప్రజలు ఇప్పటికీ అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు చేరువైన మానవతా మూర్తి పీవీ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆర్థిక సౌలభ్యాలన్నీ ఆయన సంస్కరణల ఫలితమేనని చెప్పారు. పుస్తక రచయిత సంజయ్ బారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు చరిత్రను పూర్తిగా చెరిపేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆర్కీవ్స్‌లోగానీ, లైబ్రరీలోగానీ పీవీ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు కూడా లేకుండా చేశారన్నారు. కానీ పీవీ లేని కాంగ్రెస్ చరిత్ర ప్రజలు అంగీకరించరని వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి సంధానకర్తగా శ్రీరాం వ్యవహరించగా.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీఆర్ విఠల్ తదితరులు పాల్గొన్నారు.