Sanjaya Baru
-
ఆర్థిక సంస్కరణలతో దేశాన్నికాపాడింది పీవీయే!
-
ఆర్థిక సంస్కరణలతో దేశాన్నికాపాడింది పీవీయే!
సాక్షి, హైదరాబాద్: నూతన సంస్కరణలను ప్రవేశపెట్టి, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడిన హీరో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని మాజీ గవర్నర్ రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఆయన తన విధానాలతో దేశాన్ని అనేక సమస్యల నుంచి బయటపడవేయగలిగారని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎకనమిక్ సోషల్ స్టడీస్‌లో జరిగిన కార్యక్రమంలో సంజయ్ బారు రచించిన ‘1991 హౌ పీవీ నరసింహారావు మేడ్ హిస్టరీ’ అనే పుస్తకాన్ని రంగరాజన్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. సంజయ్‌బారు తన పుస్తకంలో పీవీ కన్నా ముందు ప్రధానులుగా ఉన్న వీపీ సింగ్, చంద్రశేఖర్లకు ఈ దేశ పరిస్థితులపై ఎటువంటి అవగాహన ఉన్నదన్న సంశయాన్ని లేవనెత్తారని రంగరాజన్ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సాయాన్ని పొందడంపై కూడా ఆనాటి రాజకీయనేతల్లో అవసరమైన చొరవ కొరవడిందని వ్యాఖ్యానించారు. అయితే 1991 నాటి రాజకీయ, ఆర్థిక పరిస్థితులు పీవీ నరసింహారావుకు సంస్కరణల అవకాశం కల్పించాయని చెప్పారు. ఒకవేళ అప్పుడు చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నా ఆర్థిక సంస్కరణలను ఆహ్వానించక తప్పేది కాదన్నారు. ఈ పుస్తకం ఆద్యంత ఆసక్తిదాయకంగా ఉందని చెప్పారు. అయితే 1992లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన ప్రస్తావన కూడా పుస్తకంలో ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అద్భుత పథకాల రూపశిల్పి ఆర్థిక సంస్కరణల సృష్టికర్త మాత్రమే కాదని.. సోషలిజాన్ని కాంక్షించిన నెహ్రూ అనుయాయుడు పీవీ అని ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు సీహెచ్ హనుమంతరావు పేర్కొన్నారు. ఉపాధి అవకాశాల ద్వారానే సామాజిక న్యాయం చేకూర్చగలమని ఆయన నమ్మి, ఆచరించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అట్టడుగు బలహీన వర్గాలకు పథకాలు చేరకపోతే నష్టం జరుగుతుందని భావించి.. నేరుగా కేంద్రం నుంచి పేద, దళిత, బలహీనవర్గాలకు అందేలా అద్భుతమైన పథకాలను రూపొందించారని ప్రశంసించారు. ఆనాడు పీవీ వద్ద పనిచేసిన ఎస్.ఆర్.శంకరన్, కె.ఆర్.వేణుగోపాల్‌లు రూపొం దించిన అనేక పథకాల ఫలితాలను ప్రజలు ఇప్పటికీ అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు చేరువైన మానవతా మూర్తి పీవీ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆర్థిక సౌలభ్యాలన్నీ ఆయన సంస్కరణల ఫలితమేనని చెప్పారు. పుస్తక రచయిత సంజయ్ బారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు చరిత్రను పూర్తిగా చెరిపేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆర్కీవ్స్లోగానీ, లైబ్రరీలోగానీ పీవీ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు కూడా లేకుండా చేశారన్నారు. కానీ పీవీ లేని కాంగ్రెస్ చరిత్ర ప్రజలు అంగీకరించరని వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి సంధానకర్తగా శ్రీరాం వ్యవహరించగా.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీఆర్ విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
పీవీకి భారతరత్న ఇవ్వాలి
పుస్తకావిష్కరణ సభలో సంజయ్ బారు సాక్షి,న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు, సీనియర్ పాత్రికేయుడు సంజయ్ బారు రచించిన ‘1991: హౌ పీవీ నరసింహారావు మేడ్ హిస్టరీ’ పుస్తకాన్ని ఢిల్లీలో మంగళవారం కేంద్ర మాజీ మంత్రులు పి.చిదంబరం, యశ్వంత్‌సిన్హా ఆవిష్కరించారు. కాంగ్రెస్‌లో నెహ్రూ-గాంధీ కుటుంబం ఆధిపత్యానికి గండికొట్టి పీవీ అధికారాన్ని చేపట్టినందుకే ఆయన చనిపోయినపుడు పార్థివ దేహాన్ని లోపలికి తీసుకురానీయకుండా పార్టీ కార్యాలయ ద్వారాలు మూసేశారని, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలూ నిర్వహించలేదని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. పీవీ పాలనలో చూపిన దక్షతకు భారతరత్న ప్రకటించాలని, కాంగ్రెస్‌లో నెహ్రూ-గాంధీ కుటుంబంవారే కాక ఇతరులూ ప్రధానులు కావొచ్చన్న ఆశలు నింపిన వ్యక్తి పీవీ అని సంజయ్ అన్నారు. భారత చరిత్రలో 1991 సంవత్సరానికి ఎంతో ప్రత్యేకత ఉందనీ, అత్యంత అవసరమైన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడమేకాక, రాజకీయ సుస్థిరతను పీవీ పునరుద్ధరించారని గుర్తుచేశారు. -
మన్మోహన్ సింగ్ కథతో బాలీవుడ్ సినిమా
ప్రస్తుతం ఇండియన్ స్క్రీన్ మీద బయోపిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అయితే ఎక్కువగా స్పోర్ట్స్ స్టార్ల జీవితాలనే వెండితెర మీద ఆవిష్కరిస్తుండగా.. తాజాగా ఓ పొలిటికల్ లీడర్ జీవితంపై సినిమాను తెరకెక్కిస్తున్నారు. అది కూడా ఈ జనరేషన్ మొత్తానికి తెలిసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితంపై సినిమా కావటంతో.. ఈ వార్త టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. నాలుగేళ్ల పాటు మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ బారు రాసిన 'ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ - ద మేకింగ్ అండ్ అన్ మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్' పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత సునీల్ బోరా ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసిన చిత్రయూనిట్ నటీనటుల ఎంపికలో బిజీగా ఉంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి కీలక పాత్రలకు నటీనటుల కోసం అన్వేషిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను స్టార్ట్ చేసిన ఆగస్టు 30న ఫస్ట్ లుక్‌ను, 2017లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను దాదాపు 12 భారతీయ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
వెండితెరపై... మన్మోహన్ సింగ్ పాలన!
పుస్తకం రైట్స్ కొన్న నిర్మాత మరణించిన ప్రముఖులతో పాటు సజీవంగా ఉన్న ప్రముఖుల మీద కూడా జీవితకథా చిత్రాలు తీయడం ఇటీవల హిందీ చిత్రసీమలో బాగా పెరిగింది. ఆ ప్రముఖుల జాబితాలో ఇప్పుడు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పేరు కూడా వచ్చి చేరింది. ప్రపంచం మెచ్చిన ఈ ఆర్థికవేత్త రాజకీయ జీవితంపై ప్రముఖ నిర్మాత సునీల్ బోహ్రా ఒక సినిమా తీయనున్నారు. మన్మోహన్ సింగ్ పదవిలో ఉన్నప్పుడు ఆయనకు మీడియా సలహాదారుగా వ్యవహరించిన ప్రముఖ జర్నలిస్టు సంజయ్ బారు రాసిన పుస్తకం ఈ చిత్రానికి ఆధారం. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్ - ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్’ అనే ఈ రచన గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్కెట్లోకి వచ్చి, సంచలనం రేపింది. ఇప్పుడీ పుస్తకం హక్కుల్ని సునీల్ పొందారు. గమ్మత్తేమిటంటే, రాజకీయంగా ఎంతో కీలకమైన గడచిన దశాబ్ద కాలం గురించి వస్తున్న ఈ సినిమాను పూర్తిగా రాజకీయేతరంగా ఉండేలా తీయాలని భావించడం! గతంలో ‘చిట్టగాంగ్’, ‘షాహిద్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్’ లాంటి పలు చిత్రాలు అందించిన బోహ్రా బ్రదర్స్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సునీల్ బోహ్రా మాట్లాడుతూ, ‘‘ఇదేదో రాజకీయ అజెండాతో తీస్తున్న సినిమా కాదు. సంజయ్ బారు తన పుస్తకంలో ఏం రాశారో, సరిగ్గా అదే సినిమాలో చూపెడతాం’’ అన్నారు. ‘‘2004 నుంచి 2014 దాకా గడచిన పదేళ్ళు రాజకీయ చరిత్రనూ, దేశంలోనే పురాతన రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ భవితవ్యాన్నీ మార్చేశాయి. ఆ పదేళ్ళ కాలాన్ని ప్రతిబింబించేలా సినిమా తీయాలన్నది నా ఉద్దేశం’’ అని ఆయన చెప్పారు. రానున్న ఎన్నికల ముందు... సినిమా పాలనా కాలంలో క్యాబినెట్ సహచరులపై మన్మోహన్‌కు కానీ, ప్రధానమంత్రి కార్యాలయానికి కానీ నియంత్రణ ఉండేది కాదంటూ సంజయ్ బారు తన రచనలో పేర్కొన్నారు. ఈ అంశాలన్నిటినీ తెర మీద కెక్కిస్తే, అత్యంత నాటకీయంగా ఉంటుందంటూ రచయితను సునీల్ సంప్రతించారు. సంజయ్ బారు కూడా సరేనన్నారు. దేశంలోని బెస్ట్ సెల్లర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ పుస్తకంలో లేనిదేదీ స్క్రిప్టులో చేర్చబోమంటూ ముందుగానే ఒప్పందం రాసుకున్నారు. కాగా, ఇప్పుడీ తీయబోయే చిత్రం 2018 చివరకు రిలీజవుతుందని భావిస్తున్నారు. అంటే, 2019లో ఓటర్ల తీర్పు కోరుతూ మోదీ మళ్ళీ జనం ముందుకు వెళ్ళడానికి కొద్దిగా ముందు ఈ సినిమా వస్తుందన్న మాట. డాక్యుమెంటరీ లాగా కాకుండా ఫీచర్ఫిల్మ్గా దీన్ని తీస్తానంటున్న నిర్మాత అంతకు మించి వివరాలు చెప్పడానికి ఇష్టపడడం లేదు. ప్రీప్రొడక్షన్ ప్రారంభించామన్న ఆయన వివిధ పాత్రలను పోషించడానికి నటీనటుల కోసం ఆన్లైన్లో ఆడిషన్స్ నిర్వహించనున్నారు. మన మధ్య ఉన్న నిజజీవిత వ్యక్తుల పాత్రలను ఎవరు పోషిస్తారో కానీ, ఎవరు చేసినా అది సంచలనమే! ఏమైనా, ఏదో సామెత చెప్పినట్లు... రాసేవాళ్ళు ఒకందుకు రాస్తే, తీసేవాళ్ళు ఒకందుకు తీయడమంటే ఇదేనేమో! -
'ఆత్మ' తక్కువ కథ ఎక్కువ!
దేశంలో ఆత్మకథల పరంపర కొనసాగుతోంది. నట్వర్ సింగ్ వివాదం ఇంకా చల్లారకముందే తెర మీదకు మరో ఆత్మ కథ వచ్చింది. ఇప్పటికే తమ ఆత్మకథలతో సంజయ్‌బారు, పీసీ పరేఖ్, నట్వర్ సింగ్ తదితరులు సంచలనం సృష్టించగా.... తాజాగా మార్గరెట్ అల్వా ఈ జాబితాలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మార్గరెట్ అల్వా కూడా త్వరలో తన ఆత్మకథ రాయబోతున్నారు. రాజస్థాన్ గవర్నర్ గా పదవీ విరమణ చేసిన ఆమె త్వరలో పెన్ను పట్టుకోనున్నారు. సాధారణ కుటుంబం నుంచి రాజ్ భవన్ వరకూ సాగిన తన పయనం గురించి ఆమె ఈ పుస్తకంలో వివరించనున్నట్లు సమాచారం. అయితే వివాదాలు సృష్టించేందుకు ఈ పుస్తకం రాయటం లేదని మార్గరెట్ స్పష్టం చేయటం విశేషం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్‌బారు రచించిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ద మేకింగ్, అన్‌మేకింగ్' అప్పట్లో టాక్ ఆఫ్ ది నేషన్ అయిన విషయం తెలిసిందే. మహా భారతంలో భీష్ముడితో మన్మోహన్‌ను పోల్చిన సంజయ్ బారు, సోనియా ఎలా చెబితే అలా మన్మోహన్ నడుచుకున్నారని ఆ పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరుకే మన్మోహన్ ప్రధాని అని, సోనియా కనుసన్నల్లోనే ఆయన పాలన సాగించారంటూ విమర్శలు గుప్పించారు. ఇక సంజయ్ బారును స్పూర్తిగా తీసుకున్నారో ఏమో....కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శిగా పని చేసిన పీసీ పరేఖ్ కూడా 'క్రూసేడర్ అండ్ కాన్స్పిరేటర్' పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం ద్వారా తీవ్ర సంచలనం సంచలనం సృష్టించింది. తన పుస్తకంలో బొగ్గు మసి మొత్తం బయటపెట్టిన ఆయన కోల్గేట్ వ్యవహారంలో ప్రధాని పాత్రపై నిగ్గుతేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక అంతకు ముందు బీజేపీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ 'మై కంట్రీ.. మై లైఫ్' పేరుతో ఆత్మకథను రాశారు. రాజకీయాల్లో ఉక్కుమనిషిగా తన ఇమేజ్ను పెంచుకునే విధంగా ఈ పుస్తక రచన సాగిందనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. అధికారం అనుభవించిన వారి జీవితాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఎక్కడ రహస్యం ఉంటుందో అక్కడ ఆసక్తి ఉంటుంది. అధికారం అన్నప్పుడు, అధికారం ఉన్నవారి వద్ద పని చేసినప్పుడు.... వారి మధ్య ఎన్నో రహస్యాలు ఇమిడి ఉంటాయి. అలాంటి వారు ఆత్మకథలు రాస్తే అవి మిగతావారికి ఆసక్తిని రేకెత్తించటంలో సందేహం లేదు. అయితే అధికారం చేతులు మారాక... ప్రయివేట్ సంభాషణలను ఆత్మకథల పేరుతో బయట పెట్టడం ఎంత వరకూ సమంజసం. సంచలనాల కన్నా మీడియా మాత్రం మాస్ మసాలా దొరికినట్లే. గతంలో మన్మోహన్పై సంజయ్ బారు, తాజాగా సోనియాపై నట్వర్ సింగ్ వెల్లడించిన విషయాలు అందరికి ముందు నుంచి తెలిసినవే. వారంటూ కొత్తగా చేసిన ఆరోపణలు ఏమాత్రం లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుస్తకాల అమ్ముకోవటానికి, వార్తల్లో నిలవటానికి జిమ్మిక్కులని కొట్టి పారేస్తున్నారు. నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఆత్మ కథల్లో ...'కథ'లు తప్ప దానిలో ఆత్మ కనిపించటం లేదని వినికిడి. -
'పీఎంవోలో మన్మోహన్ పాత్రను పరిశీలించుకోవాలి'
న్యూఢిల్లీ: ప్రధాని మంత్రి కార్యాలయం (పీఎంవో) లో దేశ ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్ర ఏమిటో ఒక్కసారి ఆయన పునఃపరిశీలించుకోవాలని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ విమర్శించారు.ప్రధాని కార్యాలయంలో అతనొక నిమిత్త మాత్రుడేనేనని మన్మోహన్ మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకంలో పేర్కొనడంతో బీజేపీ తన మాటలకు మరింత పదునుపెట్టింది. ప్రధాని కార్యాలయంలో ప్రభుత్వం యొక్క ప్రభావం కంటే ప్రధాన కార్యదర్శి పాత్ర ఎక్కువగా కన్పిస్తుంని జైట్లీ తన బ్లాగులో పోస్ట్ చేశారు. గత రెండు రోజులుగా ఈ పుస్తకాన్ని చదువుతున్నానని ఆయన తెలిపారు. ప్రధాని అధికారాలను ఏవిధంగా కుంచించారో ఈ పుస్తకంలో వెల్లడించారని అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ పై సంజయ్ బారు రాసిన పుస్తకంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని బీజేపీ అభిప్రాయపడుతోంది. ఈ పుస్తకంలో ఉన్న చాలా విషయాలు పీఎంవో కార్యాలయంలో ప్రధాని పాత్రపై అనేక సందేహాలకు దారితీస్తోందని తెలిపింది. ‘ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్- ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్’ పేరుతో బారు రాసిన పుస్తకంపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. -
దాచేస్తే దాగని సత్యం
సంపాదకీయం అందరికీ తెలిసిన విషయాలే మళ్లీ చెప్తే పెద్దగా ఆసక్తి అనిపించక పోవచ్చు. కానీ చెప్పే తీరునిబట్టి, చెప్పేవారినిబట్టి ఒక్కోసారి మళ్లీ కొత్తగా విన్న అనుభూతి కలుగుతుంది. ఆ అంశాలకు సాధికారత వస్తుంది. ప్రముఖ పాత్రికేయుడు సంజయ బారు వెలువరించిన గ్రంథం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ఇప్పుడలాంటి ఆసక్తినే కలిగిస్తున్నది. ఇది ఎన్నికల రుతువు గనుక ఆ పుస్తకం కావలసినంత వివాదాన్నీ, సంచలనాన్నీ కూడా సృష్టిస్తున్నది. దేశాధినేతలుగా ఉన్నవారూ, ఉన్నతాధికారులుగా పనిచేసినవారూ పదవులనుంచి వైదొలగాక తమ జ్ఞాపకాలను గ్రంథస్తం చేసే సంప్రదాయం అన్ని దేశాల్లోనూ ఉంది. మన దేశమూ అందుకు భిన్నం కాదు. కానీ, ఎవరినీ ఏమీ అనలేని అశక్తత కావొచ్చు...స్వోత్కర్షలతో నింపడంవల్ల కావొచ్చు ఆ పుస్తకాలు ఆసక్తి కలిగించిన సందర్భాలు తక్కువ. అందువల్లే వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియకుండానే పుస్తక దుకాణాల అల్మారాల్లో అవి మౌనంగా మిగిలిపోతాయి. సంజయ పుస్తకం ఇందుకు భిన్నం. కాంగ్రెస్ అధినాయకత్వాన్ని, వ్యక్తిగతంగా మన్మోహన్‌ను ఇరకాటంలో పెట్టే అంశాలనేకం ఉండటమే దీనికి కారణం. ఆయన చెప్పిన విషయాలు ఎవరికీ తెలియనివి కాదు. పదేళ్లుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నవే. గతంలో ఎందరో విశ్లేషకులు చెప్పినవే. మన్మోహన్సింగ్, సోనియాగాంధీ... ఇద్దరికిద్దరూ రెండు అధికార కేంద్రాలుగా మారారని, అందువల్లే పాలన సర్వం కుంటుబడిందని చాలామంది అన్నారు. వివిధ దేశాలకు రేటింగ్లిచ్చే అంతర్జాతీయ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్... రాజకీయాధికారం సర్వస్వం సోనియాగాంధీ అధీనంలో ఉండగా మన్మోహన్ అలంకారప్రాయంగా మిగిలిపోయారని ఒకానొక సమయంలో ఎద్దేవా చేసింది. ఇప్పుడు సంజయ బారు కూడా దాన్నే ధ్రువపరుస్తున్నారు. రెండు రకాల అధికార కేంద్రాలవల్ల అయోమయం వస్తుంది గనుక సోనియానే అధికార కేంద్రమని మన్మోహన్ గుర్తించారని చెబుతున్నారు. సోనియా, ఆమె చుట్టూ చేరినవారి వ్యవహారశైలి... సహించలేని తత్వమూ ఈ పుస్తకం పట్టిచూపుతుంది. యూపీఏ-1 పాలనపై ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉంది. అందువల్లే 2009 ఎన్నికల్లో అది గణనీయమైన విజయం సాధించింది. సర్వేల జోస్యాలన్నిటినీ తలకిందులు చేసి లోక్‌సభలో 206 స్థానాలను కైవసం చేసుకోగలిగింది. ఈ విజయాన్ని కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీకి ఆపాదించాలా, మన్మోహన్ పాలనాదక్షతకు ఆపాదించాలా అన్న మీమాంసకు మీడియా పోలేదు. అప్పట్లో విడుదలై, జనాదరణ పొందిన హిందీ చిత్రం ‘సింగ్ ఈజ్ కింగ్’ అందరికీ స్ఫురణకొచ్చి మీడియా అంతటా అదే పతాక శీర్షిక అయింది. మన్మోహన్ సైతం రెండో దఫా విజయం తన ప్రజ్ఞే అనుకొని ఉండొచ్చని సంజయ అంటున్నారు. మన్మోహన్‌లో నెలకొన్న ఈ అభిప్రాయం తర్వాతి దశలో ఆయనకు మేలు కంటే కీడే చేసింది. వాస్తవానికి దేశ చరిత్రలో మన్మోహన్‌ది ప్రత్యేక స్థానం. దశాబ్దాలపాటు సోషలిస్టు ఆర్ధిక విధానాల పేరిట సాగిన దశను తారుమారు చేసి పీవీ నరసింహారావు పాలనాకాలంలో ఆర్ధిక సంస్కరణలను తీసుకురావడంలో మన్మోహన్‌దే కీలకపాత్ర. మన్మోహన్ ప్రధాని అయ్యాక జరిగిన మంచేమైనా ఉంటే సోనియాకు...చెడంతా ఆయనకూ పంపకం చేయడానికి సోనియా సన్నిహితులు ఆదినుంచీ చాలా పట్టుదలగా ఉన్నారు. ఆ పట్టుదల రెండో దఫా పాలనలో మన్మోహన్‌ను ప్రశాంతంగా పనిచేసుకోనీయనంత స్థాయికి చేర్చింది. పర్యవసానంగా అంతా అస్తవ్యస్థమైంది. వరస కుంభకోణాలు వెలుగుచూశాయి. పారిశ్రామిక ప్రగతి కుంటుబడింది. స్టాక్ మార్కెట్లు కొడిగట్టాయి. వృద్ధిరేటు దిగజారింది. నిత్యావసరాల ధరలు పెరిగి, ఉపాధి కరువై సామాన్యుడి బతుకు దుర్భరమైంది. రూపాయి పతనం, ద్రవ్యోల్బణంవంటివి మరింతగా కుంగదీశాయి. అయితే, ఈ పరిస్థితికి సోనియా అండ్ కో బాధ్యత ఎంతో, మన్మోహన్ బాధ్యతా అంతే ఉంది. స్వయంగా ఆర్ధిక నిపుణుడైన ఆయన ఈ పరిణామాలను చక్కదిద్దేందుకూ...అది సాధ్యంకాకపోతే వైదొల గేందుకూ సిద్ధపడలేదు. ఎంతో బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి కూడా నిమిత్తమాత్రంగా, మౌన సాక్షిగా మిగిలిపోయారు. సోనియా మొదట చెప్పిన వ్యక్తికి పీఎంఓలో స్థానం కల్పించకపోయినా, మరొకరి విషయంలో ఆమె మాట కాదనలేకపోయారు. ఫలితంగా ఫైళ్లన్నీ సోనియాకు వెళ్లేవని, చివరకు కీలక విధాన నిర్ణయాలకు సంబంధించి ఆమె ఆదేశాలు అమలయ్యేవన్నది సంజయ బారు అభియోగం. అసలు తన కేబినెట్లోకి ఎవరొస్తున్నారో, ఎవరికి ఏ శాఖ వెళ్తుందో తెలియనంత అయోమయంలో ప్రధాని ఉన్నాక పీఎంఓనుంచి ఫైళ్లు చట్టవిరుద్ధంగా వెలుపలకు వెళ్లడంలో వింతేమీ లేదు. ఈ గ్రంథం మన్మోహన్ నిస్సహాయతను స్పష్టంగా చూపినా, ఒకరకంగా ఆయనకు దీనివల్ల మంచే జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో ముగిసే సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ ఎటూ ఘోర పరాజయాన్ని చవిచూడబోతున్నది. అందుకు పూర్తి బాధ్యతను ‘మాట్లాడని’ మన్మోహన్‌కు అంటగట్టి సోనియా, రాహుల్‌గాంధీలను మణిపూసలుగా చిత్రించే పనిలో దిగ్విజయ్, జైరాంరమేష్, సల్మాన్ ఖుర్షీద్లాంటి వందిమాగధులు ఇప్పటికే తలము నకలై ఉన్నారు. సంజయ గ్రంథం ఆ ప్రయత్నాన్ని సమర్ధవంతంగానే అడ్డుకుంటుంది. తన అశక్తతతో, పదవినిచ్చినవారిపట్ల అలివిమాలిన కృతజ్ఞతో... మొత్తానికి మన్మోహన్ మెతకగా మిగిలిపోవడం నిజం. పర్యవసానంగా జరగకూడనివెన్నో జరిగాయని పుస్తకం వెల్లడిస్తోంది. పీఎంఓ కొట్టిపారేసినంత మాత్రాన ఇదంతా సమసిపోదు. తనకు తెలి సిన విషయాల్లో సగమే రాశానని సంజయ బారు చెబుతున్నారు. ఇందులో నిజం లేదని చెప్పగలిగే ధైర్యముంటే సోనియా, మన్మోహన్ గొంతు విప్పాలి. దేశ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి. -
ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు, వివాదంలో సంజయ్ బారు
న్యూఢిల్లీ: ప్రధాని మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారువా వివాదంలో చిక్కుకున్నారు. పుస్తక రచనలో వ్యక్తిగత ఆర్థిక లాభం కోసం తన పదవిని దుర్వినియోగం చేశారని ప్రధాని మంత్రిత్వశాఖ ఆరోపించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ ను కాంగ్రెస్ పార్టీ కీలుబొమ్మగా చేసిందని బారువా పుస్తకంలో పేర్కొనడం వివాదస్పదమైంది. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్ మేకింగ్ మన్మోహన్ సింగ్' అనే పుస్తకంలోని కొంత భాగం పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. వ్యక్తిగత స్వార్ధం కోసం తన హోదాను వాడుకోవడంపై ప్రధాని కార్యాలయం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.