మన్మోహన్ సింగ్ కథతో బాలీవుడ్ సినిమా
ప్రస్తుతం ఇండియన్ స్క్రీన్ మీద బయోపిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అయితే ఎక్కువగా స్పోర్ట్స్ స్టార్ల జీవితాలనే వెండితెర మీద ఆవిష్కరిస్తుండగా.. తాజాగా ఓ పొలిటికల్ లీడర్ జీవితంపై సినిమాను తెరకెక్కిస్తున్నారు. అది కూడా ఈ జనరేషన్ మొత్తానికి తెలిసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితంపై సినిమా కావటంతో.. ఈ వార్త టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.
నాలుగేళ్ల పాటు మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ బారు రాసిన 'ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ - ద మేకింగ్ అండ్ అన్ మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్' పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత సునీల్ బోరా ఈ ప్రాజెక్ట్ను సెట్స్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసిన చిత్రయూనిట్ నటీనటుల ఎంపికలో బిజీగా ఉంది.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి కీలక పాత్రలకు నటీనటుల కోసం అన్వేషిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను స్టార్ట్ చేసిన ఆగస్టు 30న ఫస్ట్ లుక్ను, 2017లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను దాదాపు 12 భారతీయ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.