'పీఎంవోలో మన్మోహన్ పాత్రను పరిశీలించుకోవాలి'
న్యూఢిల్లీ: ప్రధాని మంత్రి కార్యాలయం (పీఎంవో) లో దేశ ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్ర ఏమిటో ఒక్కసారి ఆయన పునఃపరిశీలించుకోవాలని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ విమర్శించారు.ప్రధాని కార్యాలయంలో అతనొక నిమిత్త మాత్రుడేనేనని మన్మోహన్ మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకంలో పేర్కొనడంతో బీజేపీ తన మాటలకు మరింత పదునుపెట్టింది. ప్రధాని కార్యాలయంలో ప్రభుత్వం యొక్క ప్రభావం కంటే ప్రధాన కార్యదర్శి పాత్ర ఎక్కువగా కన్పిస్తుంని జైట్లీ తన బ్లాగులో పోస్ట్ చేశారు. గత రెండు రోజులుగా ఈ పుస్తకాన్ని చదువుతున్నానని ఆయన తెలిపారు. ప్రధాని అధికారాలను ఏవిధంగా కుంచించారో ఈ పుస్తకంలో వెల్లడించారని అన్నారు.
ప్రధాని మన్మోహన్ సింగ్ పై సంజయ్ బారు రాసిన పుస్తకంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని బీజేపీ అభిప్రాయపడుతోంది. ఈ పుస్తకంలో ఉన్న చాలా విషయాలు పీఎంవో కార్యాలయంలో ప్రధాని పాత్రపై అనేక సందేహాలకు దారితీస్తోందని తెలిపింది. ‘ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్- ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్‌సింగ్’ పేరుతో బారు రాసిన పుస్తకంపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే.