సంపాదకీయం
అందరికీ తెలిసిన విషయాలే మళ్లీ చెప్తే పెద్దగా ఆసక్తి అనిపించక పోవచ్చు. కానీ చెప్పే తీరునిబట్టి, చెప్పేవారినిబట్టి ఒక్కోసారి మళ్లీ కొత్తగా విన్న అనుభూతి కలుగుతుంది. ఆ అంశాలకు సాధికారత వస్తుంది. ప్రముఖ పాత్రికేయుడు సంజయ బారు వెలువరించిన గ్రంథం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ఇప్పుడలాంటి ఆసక్తినే కలిగిస్తున్నది. ఇది ఎన్నికల రుతువు గనుక ఆ పుస్తకం కావలసినంత వివాదాన్నీ, సంచలనాన్నీ కూడా సృష్టిస్తున్నది. దేశాధినేతలుగా ఉన్నవారూ, ఉన్నతాధికారులుగా పనిచేసినవారూ పదవులనుంచి వైదొలగాక తమ జ్ఞాపకాలను గ్రంథస్తం చేసే సంప్రదాయం అన్ని దేశాల్లోనూ ఉంది. మన దేశమూ అందుకు భిన్నం కాదు. కానీ, ఎవరినీ ఏమీ అనలేని అశక్తత కావొచ్చు...స్వోత్కర్షలతో నింపడంవల్ల కావొచ్చు ఆ పుస్తకాలు ఆసక్తి కలిగించిన సందర్భాలు తక్కువ. అందువల్లే వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియకుండానే పుస్తక దుకాణాల అల్మారాల్లో అవి మౌనంగా మిగిలిపోతాయి.
సంజయ పుస్తకం ఇందుకు భిన్నం. కాంగ్రెస్ అధినాయకత్వాన్ని, వ్యక్తిగతంగా మన్మోహన్‌ను ఇరకాటంలో పెట్టే అంశాలనేకం ఉండటమే దీనికి కారణం. ఆయన చెప్పిన విషయాలు ఎవరికీ తెలియనివి కాదు. పదేళ్లుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నవే. గతంలో ఎందరో విశ్లేషకులు చెప్పినవే. మన్మోహన్‌సింగ్, సోనియాగాంధీ... ఇద్దరికిద్దరూ రెండు అధికార కేంద్రాలుగా మారారని, అందువల్లే పాలన సర్వం కుంటుబడిందని చాలామంది అన్నారు. వివిధ దేశాలకు రేటింగ్‌లిచ్చే అంతర్జాతీయ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్... రాజకీయాధికారం సర్వస్వం సోనియాగాంధీ అధీనంలో ఉండగా మన్మోహన్ అలంకారప్రాయంగా మిగిలిపోయారని ఒకానొక సమయంలో ఎద్దేవా చేసింది. ఇప్పుడు సంజయ బారు కూడా దాన్నే ధ్రువపరుస్తున్నారు. రెండు రకాల అధికార కేంద్రాలవల్ల అయోమయం వస్తుంది గనుక సోనియానే అధికార కేంద్రమని మన్మోహన్ గుర్తించారని చెబుతున్నారు. సోనియా, ఆమె చుట్టూ చేరినవారి వ్యవహారశైలి... సహించలేని తత్వమూ ఈ పుస్తకం పట్టిచూపుతుంది.
యూపీఏ-1 పాలనపై ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉంది. అందువల్లే 2009 ఎన్నికల్లో అది గణనీయమైన విజయం సాధించింది. సర్వేల జోస్యాలన్నిటినీ తలకిందులు చేసి లోక్‌సభలో 206 స్థానాలను కైవసం చేసుకోగలిగింది. ఈ విజయాన్ని కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీకి ఆపాదించాలా, మన్మోహన్ పాలనాదక్షతకు ఆపాదించాలా అన్న మీమాంసకు మీడియా పోలేదు. అప్పట్లో విడుదలై, జనాదరణ పొందిన హిందీ చిత్రం ‘సింగ్ ఈజ్ కింగ్’ అందరికీ స్ఫురణకొచ్చి మీడియా అంతటా అదే పతాక శీర్షిక అయింది. మన్మోహన్ సైతం రెండో దఫా విజయం తన ప్రజ్ఞే అనుకొని ఉండొచ్చని సంజయ అంటున్నారు. మన్మోహన్‌లో నెలకొన్న ఈ అభిప్రాయం తర్వాతి దశలో ఆయనకు మేలు కంటే కీడే చేసింది. వాస్తవానికి దేశ చరిత్రలో మన్మోహన్‌ది ప్రత్యేక స్థానం. దశాబ్దాలపాటు సోషలిస్టు ఆర్ధిక విధానాల పేరిట సాగిన దశను తారుమారు చేసి పీవీ నరసింహారావు పాలనాకాలంలో ఆర్ధిక సంస్కరణలను తీసుకురావడంలో మన్మోహన్‌దే కీలకపాత్ర. మన్మోహన్ ప్రధాని అయ్యాక జరిగిన మంచేమైనా ఉంటే సోనియాకు...చెడంతా ఆయనకూ పంపకం చేయడానికి సోనియా సన్నిహితులు ఆదినుంచీ చాలా పట్టుదలగా ఉన్నారు. ఆ పట్టుదల రెండో దఫా పాలనలో మన్మోహన్‌ను ప్రశాంతంగా పనిచేసుకోనీయనంత స్థాయికి చేర్చింది. పర్యవసానంగా అంతా అస్తవ్యస్థమైంది. వరస కుంభకోణాలు వెలుగుచూశాయి. పారిశ్రామిక ప్రగతి కుంటుబడింది. స్టాక్ మార్కెట్లు కొడిగట్టాయి. వృద్ధిరేటు దిగజారింది. నిత్యావసరాల ధరలు పెరిగి, ఉపాధి కరువై సామాన్యుడి బతుకు దుర్భరమైంది. రూపాయి పతనం, ద్రవ్యోల్బణంవంటివి మరింతగా కుంగదీశాయి.
అయితే, ఈ పరిస్థితికి సోనియా అండ్ కో బాధ్యత ఎంతో, మన్మోహన్ బాధ్యతా అంతే ఉంది. స్వయంగా ఆర్ధిక నిపుణుడైన ఆయన ఈ పరిణామాలను చక్కదిద్దేందుకూ...అది సాధ్యంకాకపోతే వైదొల గేందుకూ సిద్ధపడలేదు. ఎంతో బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి కూడా నిమిత్తమాత్రంగా, మౌన సాక్షిగా మిగిలిపోయారు. సోనియా మొదట చెప్పిన వ్యక్తికి పీఎంఓలో స్థానం కల్పించకపోయినా, మరొకరి విషయంలో ఆమె మాట కాదనలేకపోయారు. ఫలితంగా ఫైళ్లన్నీ సోనియాకు వెళ్లేవని, చివరకు కీలక విధాన నిర్ణయాలకు సంబంధించి ఆమె ఆదేశాలు అమలయ్యేవన్నది సంజయ బారు అభియోగం. అసలు తన కేబినెట్‌లోకి ఎవరొస్తున్నారో, ఎవరికి ఏ శాఖ వెళ్తుందో తెలియనంత అయోమయంలో ప్రధాని ఉన్నాక పీఎంఓనుంచి ఫైళ్లు చట్టవిరుద్ధంగా వెలుపలకు వెళ్లడంలో వింతేమీ లేదు. ఈ గ్రంథం మన్మోహన్ నిస్సహాయతను స్పష్టంగా చూపినా, ఒకరకంగా ఆయనకు దీనివల్ల మంచే జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో ముగిసే సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ ఎటూ ఘోర పరాజయాన్ని చవిచూడబోతున్నది. అందుకు పూర్తి బాధ్యతను ‘మాట్లాడని’ మన్మోహన్‌కు అంటగట్టి సోనియా, రాహుల్‌గాంధీలను మణిపూసలుగా చిత్రించే పనిలో దిగ్విజయ్, జైరాంరమేష్, సల్మాన్ ఖుర్షీద్‌లాంటి వందిమాగధులు ఇప్పటికే తలము నకలై ఉన్నారు. సంజయ గ్రంథం ఆ ప్రయత్నాన్ని సమర్ధవంతంగానే అడ్డుకుంటుంది.
తన అశక్తతతో, పదవినిచ్చినవారిపట్ల అలివిమాలిన కృతజ్ఞతో... మొత్తానికి మన్మోహన్ మెతకగా మిగిలిపోవడం నిజం. పర్యవసానంగా జరగకూడనివెన్నో జరిగాయని పుస్తకం వెల్లడిస్తోంది. పీఎంఓ కొట్టిపారేసినంత మాత్రాన ఇదంతా సమసిపోదు. తనకు తెలి సిన విషయాల్లో సగమే రాశానని సంజయ బారు చెబుతున్నారు. ఇందులో నిజం లేదని చెప్పగలిగే ధైర్యముంటే సోనియా, మన్మోహన్ గొంతు విప్పాలి. దేశ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి.
దాచేస్తే దాగని సత్యం
Published Sun, Apr 13 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM
Advertisement
Advertisement