నందా, మన్‌మోహన్ దేశాయ్
గుమ్ హై కిసీ కే ప్యార్ మే దిల్ సుబహ్ శామ్.. పర్ తుమ్హే లిఖ్ నహీ పావూ మై ఉస్‌కా నామ్.. హాయ్ రామ్.. హాయ్ రామ్..
(ప్రేమలో పడ్డ నా మనసు పగలు, రేయి ఆ పలవరింతలోనే ఉంటోంది. కాని ఆమె ఎవరో నీకు చెప్పలేకపోతున్నా.. ఏం చేయను..)
ఇది రామ్‌పూర్ కా లక్ష్మణ్ అనే సినిమాలోని పాట. దీని దర్శకుడు మన్‌మోహన్ దేశాయ్. ఆ పంక్తులను అతని మనసు గ్రహించే రాశాడేమో గీత రచయిత మజ్రూ సుల్తాన్‌పురి.
ఎక్ ప్యార్ కా నగ్‌మా హై... మౌజోంకీ రవానీ హై... జిందగీ ఔర్ కుఛ్ భీ నహీ... తేరీ మేరీ కహానీ హై..
(ఇదో ప్రేమ గీతం.. భావోద్వేగాల ప్రవాహం.. జీవితం అంటే ఇంకేదో కాదు.. నీ, నా కథ అంతే)
‘షోర్’ సినిమాలోనిదీ పాట. నందా మీద చిత్రీకరించారు. ఇదీ అంతే ఆమె భవిష్యత్ ఊహించి రాసినట్టే ఉంటుంది.
మన్‌మోహన్ దేశాయ్.. బాలీవుడ్ టాప్ డైరెక్టర్. అమర్ అక్బర్ ఆంథోని, నసీబ్, కూలీ లాంటి సినిమాలతో అమితాబ్‌కు స్టార్‌డమ్ ఇచ్చిన దర్శకులలో ముఖ్యుడు.
నందా.. బాలనటిగా పరిచయమై అరవయ్యో దశకంలో అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయికగా స్థిరపడింది.
ఆ ఇద్దరి మధ్య ప్రేమ ఎంత ఆలస్యంగా మొదలైందో అంతే వేగంగా ముగిసింది. మన్‌మోహన్ మరణంతో!
నందా.. మరాఠీ చిత్రపరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు వినాయక్ దామోదర్ కర్ణాటకీ కూతురు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వి.శాంతారాం ఆమెకు
పెద్దనాన్న. నందా ఎనిమిదేళ్ల వయసప్పుడు తండ్రి చనిపోవడంతో కుటుంబపోషణార్థం సినిమాల్లోకి వచ్చింది. తక్కువగా మాట్లాడ్డం నందా నైజం, కుటుంబమే ఆమె ప్రపంచం. ప్రముఖ నటి వహీదా రెహమాన్ ఆమెకు అత్యంత ఆప్తురాలు. కుటుంబ బాధ్యతల్లో నందా ఎంతగా కూరుకుపోయిందంటే యవ్వనం కరిగిపోతోందన్న నిజాన్నీ గ్రహించలేనంతగా. సినీరంగంలో, బయటా చాలామందే ఆమెతో ప్రేమలో పడ్డా ఆమె పట్టించుకోలేదు. తల్లి, సోదరులు పెళ్లి చేసుకొమ్మని చెప్పినా వినలేదు నందా. తోబుట్టువులందరూ స్థిరపడేవరకు పెళ్లి చేసుకోనని మొండికేసింది.
అవ్యక్త ప్రేమ
తన పనేదో తాను అన్నట్టుండే నందా... మన్‌మోహన్‌ను ఆకర్షించింది. ఆమె అమాయకమైన మొహం.. బాధ్యతగల నైజం నందాను అతను ప్రేమించేలా చేశాయి. కాని ఆమెతో తన ప్రేమను చెప్పడానికి ధైర్యం చేయలేకపోయిడు. కొన్నేళ్లపాటు నందాను అలా మౌనంగా ఆరాధిస్తూనే ఉన్నాడు తప్ప ఇష్టాన్ని ప్రకటించలేదు. మన్‌మోహన్ ఇష్క్ బాలీవుడ్ అంతా తెలిసినా నందా చెవినపడలేదు.. అనేకంటే ఆమె ఆ ఊసుకి చెవి ఒగ్గలేదు. ఒకవేళ ఆత్రం చూపించి ఉంటే ఆ ప్రేమకథ ఇంకో మలుపు తిరిగేది. ఆ ఇద్దరి జీవితాలూ ఇంకో రకంగా ఉండేవి.
ఏమైంది?
తాను చెప్పలేక.. ఆమె తెలుసుకోలేక ఆ ప్రేమ ముందుకు సాగేది లేదనుకున్న మన్‌మోహన్.. జీవన్‌ప్రభ గాంధీని పెళ్లి చేసుకున్నాడు.. నందాను మనసు మూలన ప్రతిష్టించుకొనే. ఆ భాగస్వామ్యమూ అర్ధంతరమే అయింది.. జీవన్‌ప్రభ ఆకస్మిక మరణంతో. ఎక్కడలేని ఒంటరితనం ఆవహించింది మన్‌మోహన్‌ని. నందా తలపులు అతణ్ణి మరింత బాధించసాగాయి. తట్టుకోలేక వహీదాతో చెప్పాడు. నందా ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాననీ స్పష్టం చేశాడు. అంతకన్నా శుభవార్త ఇంకోటి ఉండదు అనుకుంటూ పరుగుపరుగున నందా ఇంటికి చేరింది వహీదా. ఇక్కడ నందా గురించి ఒక్క మాట.. తోబుట్టువులంతా స్థిరపడేవరకు పెళ్లికి ససేమిరా అన్న నందా.. తోబుట్టువులు స్థిరపడ్డాక.. ‘ఈ వయసులో పెళ్లేంటి?’ అని దాటవేసి అవివాహితగానే ఉండిపోయింది. అందుకే మన్‌మోహన్ మదిలో ఇంకా నందా ఉండడం వహీదాను ఆనందపరిచింది. ఎలాగైనా తన స్నేహితురాలికి జతకూర్చాలి అన్న తన ఆరాటం ఫలించినట్టనిపించింది. మన్‌మోహన్ మనసులోని మాట నందాకు చెప్పింది. ఆ ప్రేమ ఏనాటిదో కూడా వివరించింది వహీదా. ఒప్పుకుంది నందా.
అప్పటికి ఆమె వయసు 53.. అతని వయసు 55. ఇది 1992 నాటి ముచ్చట.
మన్‌మోహన్, నందా ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. తనంటే అతనికున్న ప్రేమకు ఆశ్చర్యపోయింది నంద. వెంటనే నిశ్చితార్థం అయిపోయింది ఆ జంటకు. రెండేళ్లు గడిచాయి. నందా చేయూత మన్‌మోహన్ మనోబలాన్ని పెంచింది. కొడుకు కేతన్‌తో గొడవలున్నా ఆమె నవ్వు చూసి అన్ని మరిచిపోయేవాడు. మన్‌మోహన్ సాంగత్యం నందాలో జీవనాసక్తిని కలిగించింది. పెళ్లి ముహూర్తాలూ నిర్ణయించుకోవాలనుకుంటున్న వేళ.. ఊహించని పరిణామం.. టెర్రస్ మీద నుంచి కిందపడి మన్‌మోహన్ చనిపోయాడు. ఆ వార్త బాలీవుడ్‌కి షాక్. నందా సంగతి చెప్పక్కర్లేదు.
మిగిలిన జీవితం నీ తోడిదే అని బాస చేసి.. జంట జీవితపు ఆనందాన్ని ఊరించి.. ఊహగానే వదిలేసి వెళ్లిన ప్రేమికుడిని తలచుకుని ఏడ్వాలా? బతుకంత ప్రేమను ముణ్ణాళ్ల ముచ్చటగా చూపిన విధిని పట్టుకొని నిందించాలా? తెలియలేదు నందాకు. వహీదా గుండెలో తలదాచుకొని పొగిలి పొగిలి ఏడ్చింది. ఆ క్షణం నుంచి తన ఇంటినే లోకం చేసుకుంది. బయటకు వెళ్లడమే మానేసింది. మన్‌మోహన్ పంచిన జ్ఞాపకాలతోనే కాలం వెలిబుచ్చింది. 75వ యేట హార్ట్‌ఎటాక్‌తో ఈ లోకానికి అల్విదా చెప్పింది నందా.
-ఎస్సార్
Comments
Please login to add a commentAdd a comment