Nanda
-
సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ హీరో కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ యువ నటుడు మరణించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఒడియా నటుడు పింటు నందా(45) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. మొదట భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చదవండి: రితికాపై మీడియా ఫైర్, క్షమాపణలు కోరిన హీరోయిన్! కాలేయ మార్పిడి కోసం న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ILBS)కి తరలించి చికిత్స అందించారు. అక్కడ అవయవదాత అందుబాటులో లేకపోవడంతో ఆయనను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. పింటు నందా మృతితో ఒడియా సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. చదవండి: తొలిసారి జిమ్‌లో అలా.. మహేశ్ బీస్ట్ లుక్ చూశారా? ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. పింటు నందా ఒడియా సినీ పరిశ్రమలో హీరోగా, ప్రతినాయకుడిగా, హాస్య నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. 1996లో కోయిలి చిత్రంతో అరంగేట్రం చేశారు నందా. దోస్తీ, హట ధారి చాలు తా, రుంకు ఝుమానా , రాంగ్ నంబర్, ప్రేమ రుతు అసిగల చిత్రాల్లో నటించారు. -
పేదరికం బీసీలకు పెద్ద శాపం
అమీర్‌పేట: పేదరికం బీసీలకు పెద్ద శాపమని, బీసీల్లో చాలా మంది చదువుకోలేక పోతున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరెపల్లి నంద ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సమాజ్ ఆధ్వర్యంలో అమీర్‌పేటలో మంగళవారం నిర్వహించిన ‘బీసీ ఉమెన్ సింపోజియం’లో జస్టిస్ నంద మాట్లాడారు. పనిలో ఇచ్చే వేతనం మహిళలకు తక్కువగా ఉంటుందని, ఉద్యోగాలు, ప్రమోషన్లలో సైతం వివక్ష చూపిస్తున్నారని అన్నారు. మహిళలకు చదువు చెప్పిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందని.. ఇంట్లో అమ్మ చదువుకుంటే అందరూ చదువుకున్నట్లేనని పేర్కొన్నారు. విద్య అన్నిటికంటే ముఖ్యం కాగా రెండో ముఖ్యమైన రంగం రాజకీయమన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాజకీయ సాధికారతకు నిదర్శనమన్నారు. కూతురే కావాలంటున్నారు: ఈటల కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ .. ఇప్పుడు ట్రెండ్ మారింది. అబ్బాయి వద్దు.. అమ్మాయి కావాలని చాలా మంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారని చెప్పారు. ఏ తల్లి కుటుంబాన్ని పట్టించుకుంటుందో ఆ కుటుంబమే బాగుపడుతుందన్నారు. దేశంలో వ్యవసాయం ఇంకా ఉందంటే అది మహిళల శ్రమవల్లేనని అన్నారు. జ్ఞానం, సంస్కారం కులాన్ని బట్టి రావనీ, చైతన్యానికి, ఐక్యతకు, పోరాటానికి కులం లేదని చెప్పారు. కార్యక్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. -
మార్గదర్శకాలతోనే టెలీమెడిసిన్ అమలు
సనత్‌నగర్ (హైదరాబాద్): రోగులకు టెలీ మెడిసిన్ విధానం సులభతరమై నప్పటికీ ఆ విధానంలో నిర్దిష్ట మార్గదర్శకాలు తప్పనిసరని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.నందా స్పష్టం చేశారు. టెలీమెడిసిన్ సొసైటీ ఆఫ్ ఇండియా (టీఎస్ఐ) తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో బేగంపేటలోని లక్ష్మీబిల్డింగ్స్లో సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన టీఎస్ఐ సేవల ప్రారంభ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నందా టెలీ మెడిసిన్ ద్వారా పలు రాష్ట్రాల్లో చికిత్స పొంది మృతి చెందిన వారి వివరాలను ఉదహరిస్తూ.. ఆ విధానంలో నిబంధనలు, పాలసీలను మరింతగా పటిష్టం చేయాలని కోరారు. వైద్య విద్యార్థులకు కళాశాల స్థాయిలోనే టెలీ మెడిసిన్ కోర్సులు కూడా తీసుకురావలసిన అవసరం ఉందని సూచించారు. టీఎస్ఐ తెలంగాణ అధ్యక్షుడు డీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ 14 రాష్ట్రాల్లో టీఎస్ఐ సేవలు అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌మిశ్రా, టీఎస్ఐ జాతీయ అధ్యక్షుడు పీకే ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: బాబ్జినంద
సాక్షి, అమరావతి: నాయీ బ్రాహ్మణులను కులం పేరుతో అవమానించే వారిపై చర్యలు తీసుకునేలా జీవో నంబరు 50ని ప్రభుత్వం విడుదల చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ ఆత్మగౌరవం కాపాడేలా జీవో విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాయీ బ్రాహ్మణులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ‘థ్యాంక్యూ సీఎం’ అంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ నాయిబ్రాహ్మణ నందయువసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఇంటూరి బాబ్జినంద బుధవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసి స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్రలో తమకు ఇచ్చిన మిగిలిన హామీలు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని విన్నవించారు. తమ అభ్యర్థనకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని బాబ్జి వెల్లడించారు. సీఎంను కలిసే అవకాశం కల్పించిన నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలుకు ధన్యవాదాలు తెలిపారు. (క్లిక్: నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం) -
తొలివైద్యుల చరిత్ర
అనేక కులవృత్తులు ఉన్నాయి. వాటన్నింటికీ వాటి వాటి చరిత్రలూ ఉన్నాయి. అణగారిన కొన్ని కులాల వృత్తుల చరిత్రలు చాలావరకు మరుగునపడ్డాయి. చరిత్ర మూలాల్లోకి వెళ్లి వాటిని వెలికితీసే ప్రయత్నం అంత తేలికేమీ కాదు. ‘తొలి వైద్యులు’ పుస్తకం ద్వారా అలాంటి ప్రయత్నమే చేశారు రచయిత అన్నవరపు బ్రహ్మయ్య. అంతేకాదు, తన ప్రయత్నంలో కృతకృత్యులయ్యారు కూడా. క్షురక వృత్తికి సంబంధించిన ప్రాచీన మూలలను పరిశోధించి, చక్కని పుస్తకాన్ని అందించిన రచయితకు అభినందనలు. భారత భూభాగాన్ని ఏలిన తొలి చక్రవర్తి మహాపద్మనందుడు మంగలి కులస్తుడు. భారతదేశంలోనే కాదు, మిగిలిన ప్రపంచ దేశాల్లోనూ ఎక్కడైనా తొలినాటి వైద్యులు క్షురక వృత్తి చేసేవారే. శరీర శుభ్రతకు దోహదపడేలా వెంట్రుకలు కత్తిరించడమే కాదు, వ్రణాలు, గాయాల వల్ల పాడైపోయిన అవయవాలను తొలగించే తొలి శస్త్రచికిత్సకులు క్షురకులే! మంగళవాద్యాలను వాయించే క్షురకులకు సంగీతంతో గల చిరకాల అనుబంధాన్ని కూడా ఈ పుస్తకంలో చారిత్రక ఆధారాలతో సహా ప్రస్తావించడం విశేషం. క్షురక సామాజిక వర్గం నుంచి ఎదిగి వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారి సంక్షిప్త పరిచయ వ్యాసాలు ఈ పుస్తకానికి నిండుదనాన్ని ఇచ్చాయి. ఒకనాడు దేశాన్ని ఏలిన కులానికి చెందిన వారు, ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచిన కులానికి చెందినవారు కాలక్రమంలో వెనుకబాటుకు లోనైన క్రమాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకాన్ని తప్పక చదవాల్సిందే! కుల వివక్ష వేళ్లూనుకున్న మన దేశంలో అణగారిన కులాలకు సంబంధించిన చారిత్రక విశేషాలను వెలుగులోకి తెచ్చే ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - దాసు తొలివైద్యులు రచయిత: అన్నవరపు బ్రహ్మయ్య ప్రచురణ: తెలుగు తోరణం ప్రచురణ, విజయవాడ ధర: రూ.180 ప్రతులకు: రచయిత, ఇంటినం: 15–103/3డి, గొల్లపూడి డైమండ్ అపార్ట్మెంట్, గొల్లపూడి, విజయవాడ మొబైల్: 94403 20886, 89198 23256 -
తాను చెప్పలేక.. ఆమె తెలుసుకోలేక
గుమ్ హై కిసీ కే ప్యార్ మే దిల్ సుబహ్ శామ్.. పర్ తుమ్హే లిఖ్ నహీ పావూ మై ఉస్కా నామ్.. హాయ్ రామ్.. హాయ్ రామ్.. (ప్రేమలో పడ్డ నా మనసు పగలు, రేయి ఆ పలవరింతలోనే ఉంటోంది. కాని ఆమె ఎవరో నీకు చెప్పలేకపోతున్నా.. ఏం చేయను..) ఇది రామ్‌పూర్ కా లక్ష్మణ్ అనే సినిమాలోని పాట. దీని దర్శకుడు మన్మోహన్ దేశాయ్. ఆ పంక్తులను అతని మనసు గ్రహించే రాశాడేమో గీత రచయిత మజ్రూ సుల్తాన్‌పురి. ఎక్ ప్యార్ కా నగ్మా హై... మౌజోంకీ రవానీ హై... జిందగీ ఔర్ కుఛ్ భీ నహీ... తేరీ మేరీ కహానీ హై.. (ఇదో ప్రేమ గీతం.. భావోద్వేగాల ప్రవాహం.. జీవితం అంటే ఇంకేదో కాదు.. నీ, నా కథ అంతే) ‘షోర్’ సినిమాలోనిదీ పాట. నందా మీద చిత్రీకరించారు. ఇదీ అంతే ఆమె భవిష్యత్ ఊహించి రాసినట్టే ఉంటుంది. మన్మోహన్ దేశాయ్.. బాలీవుడ్ టాప్ డైరెక్టర్. అమర్ అక్బర్ ఆంథోని, నసీబ్, కూలీ లాంటి సినిమాలతో అమితాబ్‌కు స్టార్డమ్ ఇచ్చిన దర్శకులలో ముఖ్యుడు. నందా.. బాలనటిగా పరిచయమై అరవయ్యో దశకంలో అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయికగా స్థిరపడింది. ఆ ఇద్దరి మధ్య ప్రేమ ఎంత ఆలస్యంగా మొదలైందో అంతే వేగంగా ముగిసింది. మన్మోహన్ మరణంతో! నందా.. మరాఠీ చిత్రపరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు వినాయక్ దామోదర్ కర్ణాటకీ కూతురు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వి.శాంతారాం ఆమెకు పెద్దనాన్న. నందా ఎనిమిదేళ్ల వయసప్పుడు తండ్రి చనిపోవడంతో కుటుంబపోషణార్థం సినిమాల్లోకి వచ్చింది. తక్కువగా మాట్లాడ్డం నందా నైజం, కుటుంబమే ఆమె ప్రపంచం. ప్రముఖ నటి వహీదా రెహమాన్ ఆమెకు అత్యంత ఆప్తురాలు. కుటుంబ బాధ్యతల్లో నందా ఎంతగా కూరుకుపోయిందంటే యవ్వనం కరిగిపోతోందన్న నిజాన్నీ గ్రహించలేనంతగా. సినీరంగంలో, బయటా చాలామందే ఆమెతో ప్రేమలో పడ్డా ఆమె పట్టించుకోలేదు. తల్లి, సోదరులు పెళ్లి చేసుకొమ్మని చెప్పినా వినలేదు నందా. తోబుట్టువులందరూ స్థిరపడేవరకు పెళ్లి చేసుకోనని మొండికేసింది. అవ్యక్త ప్రేమ తన పనేదో తాను అన్నట్టుండే నందా... మన్మోహన్‌ను ఆకర్షించింది. ఆమె అమాయకమైన మొహం.. బాధ్యతగల నైజం నందాను అతను ప్రేమించేలా చేశాయి. కాని ఆమెతో తన ప్రేమను చెప్పడానికి ధైర్యం చేయలేకపోయిడు. కొన్నేళ్లపాటు నందాను అలా మౌనంగా ఆరాధిస్తూనే ఉన్నాడు తప్ప ఇష్టాన్ని ప్రకటించలేదు. మన్మోహన్ ఇష్క్ బాలీవుడ్ అంతా తెలిసినా నందా చెవినపడలేదు.. అనేకంటే ఆమె ఆ ఊసుకి చెవి ఒగ్గలేదు. ఒకవేళ ఆత్రం చూపించి ఉంటే ఆ ప్రేమకథ ఇంకో మలుపు తిరిగేది. ఆ ఇద్దరి జీవితాలూ ఇంకో రకంగా ఉండేవి. ఏమైంది? తాను చెప్పలేక.. ఆమె తెలుసుకోలేక ఆ ప్రేమ ముందుకు సాగేది లేదనుకున్న మన్మోహన్.. జీవన్‌ప్రభ గాంధీని పెళ్లి చేసుకున్నాడు.. నందాను మనసు మూలన ప్రతిష్టించుకొనే. ఆ భాగస్వామ్యమూ అర్ధంతరమే అయింది.. జీవన్‌ప్రభ ఆకస్మిక మరణంతో. ఎక్కడలేని ఒంటరితనం ఆవహించింది మన్మోహన్ని. నందా తలపులు అతణ్ణి మరింత బాధించసాగాయి. తట్టుకోలేక వహీదాతో చెప్పాడు. నందా ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాననీ స్పష్టం చేశాడు. అంతకన్నా శుభవార్త ఇంకోటి ఉండదు అనుకుంటూ పరుగుపరుగున నందా ఇంటికి చేరింది వహీదా. ఇక్కడ నందా గురించి ఒక్క మాట.. తోబుట్టువులంతా స్థిరపడేవరకు పెళ్లికి ససేమిరా అన్న నందా.. తోబుట్టువులు స్థిరపడ్డాక.. ‘ఈ వయసులో పెళ్లేంటి?’ అని దాటవేసి అవివాహితగానే ఉండిపోయింది. అందుకే మన్మోహన్ మదిలో ఇంకా నందా ఉండడం వహీదాను ఆనందపరిచింది. ఎలాగైనా తన స్నేహితురాలికి జతకూర్చాలి అన్న తన ఆరాటం ఫలించినట్టనిపించింది. మన్మోహన్ మనసులోని మాట నందాకు చెప్పింది. ఆ ప్రేమ ఏనాటిదో కూడా వివరించింది వహీదా. ఒప్పుకుంది నందా. అప్పటికి ఆమె వయసు 53.. అతని వయసు 55. ఇది 1992 నాటి ముచ్చట. మన్మోహన్, నందా ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. తనంటే అతనికున్న ప్రేమకు ఆశ్చర్యపోయింది నంద. వెంటనే నిశ్చితార్థం అయిపోయింది ఆ జంటకు. రెండేళ్లు గడిచాయి. నందా చేయూత మన్మోహన్ మనోబలాన్ని పెంచింది. కొడుకు కేతన్‌తో గొడవలున్నా ఆమె నవ్వు చూసి అన్ని మరిచిపోయేవాడు. మన్మోహన్ సాంగత్యం నందాలో జీవనాసక్తిని కలిగించింది. పెళ్లి ముహూర్తాలూ నిర్ణయించుకోవాలనుకుంటున్న వేళ.. ఊహించని పరిణామం.. టెర్రస్ మీద నుంచి కిందపడి మన్మోహన్ చనిపోయాడు. ఆ వార్త బాలీవుడ్‌కి షాక్. నందా సంగతి చెప్పక్కర్లేదు. మిగిలిన జీవితం నీ తోడిదే అని బాస చేసి.. జంట జీవితపు ఆనందాన్ని ఊరించి.. ఊహగానే వదిలేసి వెళ్లిన ప్రేమికుడిని తలచుకుని ఏడ్వాలా? బతుకంత ప్రేమను ముణ్ణాళ్ల ముచ్చటగా చూపిన విధిని పట్టుకొని నిందించాలా? తెలియలేదు నందాకు. వహీదా గుండెలో తలదాచుకొని పొగిలి పొగిలి ఏడ్చింది. ఆ క్షణం నుంచి తన ఇంటినే లోకం చేసుకుంది. బయటకు వెళ్లడమే మానేసింది. మన్మోహన్ పంచిన జ్ఞాపకాలతోనే కాలం వెలిబుచ్చింది. 75వ యేట హార్ట్ఎటాక్తో ఈ లోకానికి అల్విదా చెప్పింది నందా. -ఎస్సార్ -
భర్త చేతిలో లైంగిక దాడికి గురైన వివాహిత మృతి
సాక్షి, చిత్తూరు : భర్త చేతిలో లైంగిక దాడికి గురైన పద్మ (32) బుధవారం మృతి చెందారు. చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మూడు రోజుల కిందట ఆమెపై భర్త నంద లైంగికదాడికి పాల్పడిన విషయం తెలిసిందే. బిడ్డకు జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్న సమయంలో తన లైంగిక వాంఛ తీర్చాలంటూ పద్మను నంద తీవ్రంగా వేధించడం.. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో బలవంతంగా ఆస్పత్రి మిద్దెపైకి తీసుకెళ్లి లైంగిక దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించడం తెలిసిందే. ఈ ఘటనలో అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు రక్తస్రావం ఎక్కువయ్యి పద్మ కోమాలోకి వెళ్లిపోయింది. గత మూడు రోజులుగా ఐసీయూలో పద్మను కాపాడటానికి వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పద్మను చంపడానికి ఆమె చీరతోనే గొంతుకు బిగించడంతో మెదడుకు రక్త సరఫరా అయ్యే నాళాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. పద్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడిపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా హత్య కేసు కూడా నమోదు చేశారు. -
చిన్నారిని చెరువులో పడేసిన తండ్రి
మరో వివాహానికి అడ్డుగా ఉందని ఘాతుకం తానూరు(ఆదిలాబాద్) : తన రెండో వివాహానికి అడ్డుగా ఉందని కన్న కూతురిని చెరువులో పడేశాడో తండ్రి. ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలం కర్భాల గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సోంటకే గౌతం కొన్నేళ్లుగా హైదరాబాద్, భైంసాలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో భైంసాలో నంద అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆమెకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. గౌతం, నంద కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు జేసికా(5) ఉంది. ఇద్దరు కలిసి రెండేళ్లుగా భైంసాలో నివాసం ఉంటున్నారు. నెల రోజుల క్రితం స్వగ్రామమైన కర్భాలకు వచ్చి ఉంటున్నారు. వారం రోజుల క్రితం భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో నంద వెళ్లిపోయింది. అయితే, మరో వివాహం చేసుకోవడానికి కూతురు జేసికా అడ్డుగా ఉందని గౌతం భావించాడు. శనివారం అర్ధరాత్రి కూతురిని తీసుకెళ్లి గ్రామ సమీపంలోని చెరువులో ఉన్న నీటి గుంతలో పడేశాడు. ఆదివారం ఉదయం తానూరు పోలీసుస్టేషన్‌కు వెళ్లి తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్న సమయంలో చెరువులో బాలిక మృతదేహం పైకి తేలింది. పశువుల కాపరి గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ గణపతిజాదవ్ గౌతంను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. మరో వివాహం చేసుకోవడానికి అడ్డుగా ఉందని హతమార్చినట్లు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. -
బాలీవుడ్ నటి నందా మృతి
అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటి నందా(75) ఇకలేరు. ఆమె మంగళవారం ఉదయం ముంబయ్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. నందా అందంతోపాటు చక్కటి నటనతో 1960, 70లలో వెండితెరను ఏలారు. ‘హమ్ దోనో’, ‘గుమ్నామ్’, ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’ తదితర చిత్రాల్లో మరపురాని, ఆధునిక భావాలున్న పాత్రలతో అభిమానులను ఆకట్టుకున్నారు. దేవానంద్, కిశోర్ కుమార్, అశోక్ కుమార్, రాజేశ్ ఖన్నా తదితర హీరోలతో నటించారు. ప్రముఖ దర్శకుడు వి.శాంతారామ్‌కు మేనకోడలైన నందా 1939లో మహారాష్ట్రలో జన్మించారు. 1950లలో ‘జగ్గు’ సినిమాతో తెరంగేట్రం చేసిన నందా తొలినాళ్లలో చెల్లెలి పాత్రలు పోషించారు. ఆ తర్వాత నాయికగా చేశారు. 1992లో నడివయసులో నిర్మాత మన్మోహన్ దేశాయ్‌కి దగ్గరై 1994లో దేశాయ్ చనిపోయేంతవరకు ఆయనతో కలిసి జీవించారు. -
బాలీవుడ్ నటి నందా కన్నుమూత
ముంబై: అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటి నందా(75) కన్నుమూశారు. అంధేరీలోని తన నివాసంలో ఈరోజు ఉదయం గుండెపోటులో ఆమె మృతి చెందారు. ఆరోగ్యంగా ఉన్న నందా ఆకస్మికంగా మృతి చెందినట్లు ఆమె బంధువులు చెప్పారు. నందా చక్కటి అందంతోపాటు అద్భుతమైన నటననను ప్రదర్శించారు. 1960-70 దశకంలో వెండితెరను ఏలారు. హమ్ దోనో, గుమ్నామ్, జబ్ జబ్ పూల్ ఖిలే... వంటి చిత్రాలలో మరపురాని పాత్రలు పోషించారు. దేవానంద్, కిషోర్ కుమార్, అశోక్ కుమార్, రాజేష్ ఖన్నా వంటి అగ్ర హీరోలతో నటించారు. ప్రముఖ దర్శకుడు వి.శాంతారామ్‌కు నందా మేనకోడలు. ఆమె తండ్రి వినాయక్ దామోదర్ మరాఠీ దర్శకుడు. 1939లో మహారాష్ట్రలో జన్మించిన నందా బాల్యంలోనే నటించడం మొదలుపెట్టారు. ఆమె బాల్యంలో ఉండగానే తండ్రి మరణించారు. దాంతో కుటుంబానికి అండగా నిలవవలసి వచ్చింది. నందా నడివయసులో నిర్మాత మన్మోహన్ దేశాయ్‌కు దగ్గరయ్యారు. 1994లో దేశాయ్ చనిపోయేంతవరకు ఆయనతోనే కలసి ఉన్నారు. నందా మృతికి బాలీవుడ్ ప్రముఖులు పలువురు సంతాపం తెలిపారు.