
అమీర్‌పేట: పేదరికం బీసీలకు పెద్ద శాపమని, బీసీల్లో చాలా మంది చదువుకోలేక పోతున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరెపల్లి నంద ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సమాజ్ ఆధ్వర్యంలో అమీర్‌పేటలో మంగళవారం నిర్వహించిన ‘బీసీ ఉమెన్ సింపోజియం’లో జస్టిస్ నంద మాట్లాడారు. పనిలో ఇచ్చే వేతనం మహిళలకు తక్కువగా ఉంటుందని, ఉద్యోగాలు, ప్రమోషన్లలో సైతం వివక్ష చూపిస్తున్నారని అన్నారు.
మహిళలకు చదువు చెప్పిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందని.. ఇంట్లో అమ్మ చదువుకుంటే అందరూ చదువుకున్నట్లేనని పేర్కొన్నారు. విద్య అన్నిటికంటే ముఖ్యం కాగా రెండో ముఖ్యమైన రంగం రాజకీయమన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాజకీయ సాధికారతకు నిదర్శనమన్నారు.
కూతురే కావాలంటున్నారు: ఈటల
కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ .. ఇప్పుడు ట్రెండ్ మారింది. అబ్బాయి వద్దు.. అమ్మాయి కావాలని చాలా మంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారని చెప్పారు. ఏ తల్లి కుటుంబాన్ని పట్టించుకుంటుందో ఆ కుటుంబమే బాగుపడుతుందన్నారు. దేశంలో వ్యవసాయం ఇంకా ఉందంటే అది మహిళల శ్రమవల్లేనని అన్నారు. జ్ఞానం, సంస్కారం కులాన్ని బట్టి రావనీ, చైతన్యానికి, ఐక్యతకు, పోరాటానికి కులం లేదని చెప్పారు. కార్యక్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment