
బీవోబీ ఉన్నతాధికారులతో హైదరాబాద్ జోన్ జీఎం మన్మోహన్ గుప్తా (మధ్యలో)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల విభాగంలో 25 శాతం వృద్ధి సాధించాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) హైదరాబాద్ జోన్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి వీటి పరిమాణం రూ. 9,100 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ. 600 కోట్ల పైచిలుకు రుణాలు అందించడంతో.. ఇది సుమారు రూ. 9,700 కోట్లకు చేరింది. బీవోబీ నిర్వహిస్తున్న రైతు పక్షోత్సవ కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్ (జీఎం) మన్మోహన్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బీవోబీ కార్యకలాపాలు హైదరాబాద్ జోన్ పరిధిలోకి వస్తాయి. కరోనా వైరస్ విజృంభణ అనంతరం ఎకానమీ నెమ్మదిగా కుదుటపడుతున్న నేపథ్యంలో మొండిబాకీల రికవరీ క్రమంగా మెరుగుపడుతోందని గుప్తా తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తమకు 397 బ్రాంచీలు ఉన్నాయని, తమ శాఖలు లేని చోట్ల కూడా బ్యాంక్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. వ్యవసాయానికి తోడ్పాటు అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 4వ విడత ‘‘బరోడా రైతు పక్షోత్సవాలు’’ నిర్వహిస్తున్నామని, అక్టోబర్ 16న ప్రారంభమైన ఈ కార్యక్రమాలు 31 దాకా కొనసాగుతాయని వివరించారు. ‘మన చర్యలే మన భవిష్యత్’ నినాదంతో చేపట్టిన ఈ పక్షోత్సవాల్లో భాగంగా రైతుల కోసం క్రెడిట్ క్యాంపులు, చౌపల్స్, పశువులకు ఆరోగ్య పరీక్షలు, ఆర్థిక సాక్షరత క్యాంపులు మొదలైనవి నిర్వహిస్తున్నామని గుప్తా చెప్పారు. అలాగే వ్యవసాయ రుణాల కోసం ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా తమ 18 జోనల్ కార్యాలయల్లో సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ప్రాసెసింగ్ (సీఏఎంపీ) పేరిట ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో ఒకటి హైదరాబాద్ జోన్‌లో కూడా ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment