కొత్త వ్యూహం!
Published Mon, Jan 13 2014 4:03 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM
సాక్షి, చెన్నై: డీఎండీకే నేతృత్వంలో రంజాన్, క్రిస్మస్, దీపావళి, సంక్రాంతి ఇలా అన్ని రకాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ వేడుకల్లో ప్రతి ఏటా పేదలకు తన వంతుగా విజయకాంత్ చేయూతనందిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం పార్టీ కార్యాలయ ఆవరణలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. కోలాటాలు, పులి వేషాలు, కళాకారుల కళాజాతలతో గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా వేడుకను జరుపుకున్నారు. తన సతీమణి ప్రేమలతతో పాటుగా పార్టీ మహిళా నాయకులతో కలసి పొంగల్‌ని విజయకాంత్ వండారు. అందరితో కలసి ఉత్సాహంగా గడిపిన ఆయన పార్టీ తరపున పేదలకు కొత్త దుస్తులు, పండుగకు సరుకులను అందజేశారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో విజయకాంత్ ప్రసంగించారు.
కొత్త వ్యూహం: ‘నా స్టైలే వేరు, దీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నా, అందుకే తొందర పడి ఏ నిర్ణయాలు తీసుకోను’ అంటూ కెప్టెన్ ప్రసంగాన్ని మొదలెట్టారు. కుల, మత, వర్గ బేధాలకు అతీతంగా రాష్ట్రంలో ముందుకెళుతున్న పార్టీ ఒక్క డీఎండీకే మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. అన్ని పండుగల్ని అత్యంత వేడుకగా జరుపుకోవడంలో తమకు మరొకరు సాటి లేరంటూ పేర్కొన్నారు. ప్రజల నుంచి తనను వీడదీయడానికి కుట్రలు జరుగుతున్నాయని, ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చివరకు క్లైమాక్స్ తనదేనంటూ సినీ డైలాగుల్ని వల్లించి ఆకట్టుకున్నారు. అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉద్యమిస్తున్నదని తానొక్కడినేనని గుర్తు చేస్తూ, రాష్ర్టంలోని అవినీతి మంత్రుల భరతం పట్టేందుకు ప్రజలతో కలసి పోరాడతామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతి పనికి చేతులు తడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలపై దృష్టి పెట్టండి: తమ అధినేత్రి ని పీఎం చేయడంకోసం ఇప్పుటి నుంచే ప్రయత్నాలు మొదలెట్టడం కన్నా, ఇప్పటి నుంచైనా రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టు పనుల మీద దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని అన్నాడీఎంకే వర్గాలకు హితవు పలికారు. ‘సంక్రాంతి వేడుకల సాక్షిగా చెబుతున్నా, ఇక నా వ్యూహా లన్నీ సరికొత్తగానే ఉంటారుు, నిర్ణయాల్ని తొందర పడి తీసుకోను’ అని స్పష్టం చేశారు. పొత్తులకు ఇంకా సమయం ఉందని, వాటి గురించి ఆలోచించకుండా ప్రజల సమస్యల కోసం పోరాడదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పొత్తా...ఒంటరా..? అన్నది స్వయంగా మహానాడులో ప్రకటిస్తానని అంత వరకు పార్టీ, ప్రజా కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలంటూ సూచించారు. మళ్లీ చెబుతున్నా, ఇతర పార్టీల్లాగా ప్రజల్ని మోసం చేయడం, మభ్యపెట్టడం తనకు చేత కాదని, ఉన్నంతలో ప్రజల కోసం మంచి చేయాలన్నదే తన అభిమతం అంటూ ముగించారు. డీఎంకే నేతృత్వంలోనూ ఈ ఏటా సంక్రాంతి వేడుకలు జరగడం విశేషం. కుండ్రత్తూరు సమీపంలోని నందంబాక్కంలో తన సతీమణి దుర్గాతో కలిసి వేడుకల్లో స్టాలిన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement