ముంబై: రాష్ట్ర ప్రభుత్వం గేట్ వే ఆఫ్ ఇండి యా వద్ద నిర్వహిస్తున్న సంగీత, సాంస్కృతిక కార్యక్రమాల సమ్మేళనం ‘సప్తరంగ్ 2014’ ఉత్సవం శుక్రవారం రాత్రి ముంబైలో ఘనం గా ప్రారంభమయింది. ఔత్సాహిక కళాకారుల పురోగతికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. ‘ఔత్సాహికులు తమ ప్రతిభ ను ప్రదర్శించడానికి ఇది చక్కని వేదిక. మహా రాష్ట్ర ఘనసంస్కృతిని ప్రదర్శించడానికి కూడా ఉపకరిస్తుంది’ అని అన్నారు.
సప్తరంగ్‌ను ఈ నెల మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహిస్తారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ఆద్యం తరం అలరించింది. జనవరి ఐదువరకు గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద, ఆరు, ఏడో తేదీల్లో నవీముంబై విష్ణుదాస్ భవే ఆడిటోరియంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముగింపు ఉత్సవాన్ని ఠాణేలోని కాశీనాథ్ ఘనేకర్ నాట్యగృహలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వివిధ సంగీతకారులు, శాస్త్రీయ నృత్యకారులు ప్రదర్శనలు ఇస్తారు.