
సర్దార్ పటేల్‌ను హైజాక్ చేసిన మోడీ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హైజాక్ చేశారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. పటేల్ పేరును ప్రస్తావించడానికి మోడీకి నైతిక హక్కు లేదని విమర్శించారు. ఇక్కడి నందినీ లేఔట్‌లో కాంగ్రెస్ పార్టీ 129వ వ్యవస్థాపక దినోత్సవం, జవహర్‌లాల్ నెహ్రూ 125వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు.
సర్దార్ పటేల్ ఇంకా బతికి ఉంటే మోడీపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఉండేవారని అన్నారు. మాజీ ఉప ప్రధాని ఎల్‌కే. అద్వానీని బీజేపీ వారు ఉక్కు మనిషి అని సంబోధించడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడిన పటేల్ ఒక్కరే ఉక్కు మనిషి అని పేర్కొన్నారు. ఈ దేశంలో మరొకరు ఉక్కు మనిషి కాలేరని తెలిపారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర మాట్లాడుతూ.. కాంగ్రెస్ లేని దేశాన్ని నిర్మిస్తామని మోడీ ప్రగల్బాలు పలకడం హాస్యాస్పదమన్నారు.
ఆయన కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమేనని, ప్రధాని కాదని దెప్పి పొడిచారు. కాంగ్రెస్ చరిత్రను తెలియని వారే పార్టీని విమర్శిస్తుంటారని అన్నారు. త్యాగం, బలిదానాలతో దేశం పురోభివృద్ధికి కాంగ్రెస్ శ్రమించిందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవడానికి కృషి చేయాలని ఆయన కార్యకర్తలను కోరారు.