గవర్నర్కు శశికళ మరో లేఖ
చెన్నై: తన శిబిరం నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు చేజారుతుండటం, వీరంతా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గంలో చేరుతుండటంతో ఆందోళన చెందుతున్న శశికళ.. గవర్నర్ విద్యాసాగర్ రావు అపాయింట్‌మెంట్ కోరారు. తనకు మెజార్టీ నిరూపించుకునే అవకావం ఇవ్వాలని ఆమె మరోసారి విన్నవించారు. శనివారం శశికళ ఈ మేరకు గవర్నర్కు లేఖ రాశారు.
అన్నా డీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా తాను ఏకగీవ్రంగా ఎన్నికయ్యానని, ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కోరిన విషయాన్ని శశికళ లేఖలో ప్రస్తావించారు. ఈ నెల 5వ తేదీన తమకు ఎమ్మెల్యేల జాబితాతో లేఖను సమర్పించానని, 9వ తేదీన వ్యక్తిగతంగా కలసినపుడు మరోసారి జాబితా అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరానని రాశారు. అంతకుముందు ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వం చేసిన రాజీనామాను ఆమోదించారని గుర్తు చేశారు. ఈ రోజు తమను కలిసేందుకు తనకు, తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. తమిళనాడు ప్రయోజనాలను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు వెంటనే చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని గవర్నర్‌కు శశికళ లేఖ రాశారు.