మళ్లీ తెరపైకి సుడా
Published Mon, Oct 17 2016 1:48 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు యోచన
ఏడాదికాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలు
30 సంవత్సరాల అవసరాలకు మాస్టర్‌ప్లాన్
శివారు గ్రామాల విలీనంతో విస్తరించనున్న నగరం
కరీంనగర్ కార్పొరేషన్ : కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం అన్ని జిల్లా కేంద్రాల్లో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదించడంతో కరీంనగర్‌కు సంబంధించి శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లా కేంద్రానికి నాలుగు దిక్కులా సుమారు పది కిలోమీటర్ల విస్తీర్ణంలో ‘సుడా’ను ఏర్పాటు చేస్తూ హైదరాబాద్‌లో హుడా, వరంగల్‌లో కుడా తరహాలో అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. కరీంనగర్‌లో జనాభా రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నగర శివారు గ్రామాలను అథారిటీ పరిధిలోకి తీసుకొచ్చి ఆ ప్రాంతం చుట్టూ ఔటర్‌రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తూ, పక్కా ప్రణాళికతో నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకుంటారు. దీనికి సంబంధించి ప్రభుత్వం గత సంవత్సరమే ప్రతిపాదనలు కోరింది. ఈ మేరకు కరీంనగర్ కార్పొరేషన్ అధికారులు ‘సుడా’గా నామకరణం చేస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ ఏడాదికాలంగా పెండింగ్‌లో పడింది.
ముప్పై ఏళ్ల అవసరాలకు ప్లాన్
అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పడ్డాక ముప్పై ఏళ్ల అవసరాలను పరిగణలోకి తీసుకొని మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తారు. వాణిజ్యసంస్థలు, పారిశ్రామికప్రాంతాలు, నివాసగృహాలు, మార్కెట్లు, అటవీ ప్రాంతాలుగా విభజించి ఎక్కడెక్కడ ఏవి ఉండాలనేది ప్రణాళిక రూపొందించి మౌలిక వసతులు కల్పిస్తారు. అవసరమైన ప్రాంతాల్లో భూసేకరణ చేయడంతోపాటు రోడ్ల విస్తరణ, పర్యావరణానికి పెద్దపీట వేయనున్నారు. ఇప్పటివరకు గ్రామపంచాయతీల్లో భవన నిర్మాణ అనుమతులు గ్రామకార్యదర్శి ద్వారా తీసుకునే వీలుండేది. అర్బన్ అథారిటీ ఏర్పడ్డాక టౌన్‌ప్లానింగ్ విభాగం ద్వారా అనుమతులు పొందాల్సి ఉంటుంది.
అక్రమాలకు చెక్..!
రోడ్ల ఆక్రమణలు, అనుమతి లేని నిర్మాణాలు, లేఅవుట్ల భూ వివాదాలకు చెక్ పడనుంది. ఇళ్ల నిర్మాణాల అనుమతుల్లో ఇబ్బందులు తొలగడంతోపాటు పక్కా ప్రణాళికతో నిర్మాణా లు సాగే అవకాశం ఉంది. ఇప్పటివరకు భవన నిర్మాణాల అనుమతి పరిమితి దాటినప్పటి కీ రీజినల్ స్థాయిలోనూ అన్ని అనుమతులు ఇక్కడే తీసుకునే వీలుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొత్త ప్లాట్లు చేసే సమయంలో తప్పనిసరిగా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మౌలిక వసతులు అథారిటీ ద్వారానే అందుబాటులోకి వస్తాయి. సాంకేతిక పరిజ్ఞానంతో పట్టణాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
Advertisement