కావేరీ మంటలు | SC directs Karnataka to release 15000 cusecs of Cauvery water per day to Tamil Nadu | Sakshi
Sakshi News home page

కావేరీ మంటలు

Published Wed, Sep 7 2016 3:09 AM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM

SC directs Karnataka to release 15000 cusecs of Cauvery water per day to Tamil Nadu

 తమిళనాడుకు కావేరీ జలాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కర్ణాటక ప్రభుత్వం  ఆగ్రహంతో భగ్గుమంది. తమిళనాడుకు నీటిని విడుదల చేయరాదంటూ కర్ణాటకలో చెలరేగిన ఆందోళనలతో కావేరీ సమస్య మరోసారి అగ్గిలా రాజుకుంది.
 
 సాక్షి ప్రతినిధి, చెన్నై :  కావేరీ నది నుంచి తమిళనాడుకు సెకండుకు 15వేల ఘనపుటడుగుల లెక్కన పది రోజులపాటు నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం ఖాతరు చేయకపోవడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంలో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఈనెల 16వ తేదీన విచారణకు రాబోతుండగా సుప్రీంకోర్టు తీర్పుపై కర్ణాటక ప్రజలు తీవ్రస్థాయిలో నిరసన బాటపట్టారు. తమిళనాడుకు నీటిని విడుదల చేయరాదని డిమాండ్ చేస్తూ కర్ణాటక రైతాంగం మంగళవారం పలుచోట్ల విధ్వంసానికి పాల్పడడం రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేసింది.
 
 రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తవాతావరణం నెలకొనడంతో తమిళనాడు నుంచి కర్ణాటక వైపు వెళ్లే బస్సులను సోమవారం మధ్యాహ్నం నుంచి నిలిపివేశారు. ఈరోడ్డు, కోవై, తిరుప్పూరు తదితర జిల్లాల నుంచి సత్యమంగళం, పన్నారీ ఆశనూరు, తాళవాడి మీదుగా ప్రతిరోజూ 50కి పైగా బస్సులు మైసూరు, బెంగళూరుకు వెళుతుంటాయి. ఈ బస్సులన్నీ రెండో రోజైన మంగళవారం కూడా నిలిచిపోయాయి. స్వల్ప సంఖ్యలో బస్సులు కర్ణాటక సరిహద్దు పులింజూర్ వరకు ప్రయాణికులను చేరవేశాయి. ఈరోడ్డు జిల్లా పన్నారీ చెక్‌పోస్టు నుంచి కొండ ప్రాంతాల మీదుగా ప్రతిరోజూ వందకుపైగా లారీలు, భారీ వాహనాలు వెళుతుంటాయి. కర్ణాటకలో ఆందోళనల కారణంగా వీటన్నింటినీ చెక్‌పోస్టు వద్ద నిలిపివేశారు.
 
  కోయంబత్తూరు-కర్ణాటక రాష్ట్రం మైసూరు, బెంగళూరు, మండియా, కొల్లొ క్కాల్ ప్రాంతాల మధ్య ప్రతిరోజూ తిరిగే 60 బస్సులు సోమవారం ఉదయం నుంచే బస్‌స్టేషన్‌కే పరిమితమయ్యాయి. వినాయక చతుర్థి పండుగను పురస్కరించుకుని కర్ఱాణటకకు వెళ్లాల్సిన ప్రయాణికులు సరిహద్దుల వరకు ఏదో ఒక వాహనంలో చేరుకుని, అక్కడి నుంచి ఆ రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రయాణికుల వత్తిడిని తట్టుకోలేక పోలీసు బందోబస్తుతో రాత్రి వేళ కొన్ని బస్సులను నడిపారు. ఊటీ, కొడెక్కైనాల్‌ను సందర్శించిన పర్యాటకులు తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాల్లో బెంగళూరుకు బయలుదేరగా కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వారి వాహనాలను పోలీసులు అనుమతించలేదు. మంగళవారం రెండోరోజూ కూడా పర్యాటకుల వాహనాలు సరిహద్దుల్లో బారులుతీరి నిలబడి ఉన్నాయి.
 
  ఆయా వాహనాల్లోని కొందరు ప్రయాణికులు కాలినడకతో కొన్ని కిలోమీటర్ల దూరం చేరుకుని కర్ణాటక వాహనాల్లో గమ్యాన్ని చేరుకున్నారు. తమిళనాడు నుంచి హొసూరు మీదుగా బెంగళూరుకు చేరుకునే మరో 300 బస్సులు సోమవారం నుంచే నిలిచిపోయాయి. శని, ఆది, వినాయక చవితి సెలవులు ముగిసి కర్ణాటక చేరుకోవాల్సిన ప్రయాణికులు సోమవారం రాత్రంతా సరిహద్దుల్లో జాగారం చేశారు. ఇదిలా ఉండగా, కర్ణాటక- హోసూరు మధ్య నడిచే ఆ రాష్ట్ర బస్సులు యథావిధిగా తిరగడంతో వాటిల్లో ప్రయాణికులు కిటికిటలాడిపోయారు. కర్నాటక రాష్ట్రం తాళవాడి సమీపం సామ్రాజ్యనగర్ నంజన్ గూడు, మైసూరులలో అక్కడి రైతులు రాస్తారోకో, ఆందోళనలు చేయడంతో ఆయా ప్రాంతాల్లో వ్యాపారాలు సాగిస్తున్న తమిళులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి వెళ్లిపోయారు.
 
 పార్టీల నిరసన:
 సుప్రీంకోర్టు తీర్పు, కర్ణాటక నిరాకరణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తేల్చిచెప్పాలని డీఎంకే అధ్యక్షులు కరుణానిధి ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి జయలలితను డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును సైతం దిక్కరిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్య దేశంలో ఆయన ఎలా కొనసాగుతున్నారో అర్థం కావడం లేదని తమిళమానిల కాంగ్రెస్ అధ్యక్షులు జీకే వాసన్ వ్యాఖ్యానించారు. షెడ్యూలు ప్రకారం సాగునీటి జలాల విడుదల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు హామీ ఇవ్వాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కావేరీ క్రమబద్ధీకరణ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని ఎండీఎంకే అధ్యక్షులు వైగో, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జీ రామకృష్ణన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడగా కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్షంతో సమావేశమైందని, అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా భవిష్య కార్యాచరణ ప్రణాళికపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని వీసీకే అధ్యక్షులు తిరుమా విజ్ఞప్తి చేశారు.
 
 మేట్టూరు నీటికై డిమాండ్:
 కావేరీ జలాల విడుదల జఠిలం కావడంతో రాష్ట్ర రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కావేరీ జలాలు క్రమం తప్పకుండా విడుదలైన పక్షంలో మేట్టూరు జలాశయంలో నీటి మట్టం 50 టీఎంసీలకు చేరుకుంటుంది. మేట్టూరు జలాశయంలో ఇప్పటికే 37.5 టీఎంసీల నీరు నిల్వ ఉన్నందున ఈనెల 16వ తేదీ నాటి సుప్రీం తీర్పుకోసం ఎదురుచూడకుండా సాగునీటిని విడుదల చేయాలని తమిళనాడు వ్యవసాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటి కార్యదర్శి నల్లస్వామి కోరుతున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో సాగునీటిని పారించకుంటే సంబసాగును కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.             
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement