సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు డెల్టా జిల్లాల్లో సుమారు 15 లక్షల ఎకరాల సంబసాగుకు సిద్ధంగా ఉంది. ఈ 15 లక్షల ఎకరాల సాగులో అధికశాతం కావేరీ జలాలపై ఆధారపడి ఉంది. తమిళనాడుకు వాటా జలాలు ఇవ్వాలని గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం అమలు చేయకపోవడంతో డెల్టా జిల్లాలో సాగు ప్రశ్నార్థకమైంది. నాట్లు వేసి కొందరు, నాట్లు వేయాలా వద్దా అనే అనుమానంతో కొందరు రైతులు దిగాలులో పడిపోయారు. ఈ పరిస్థితిలో ట్రిబ్యునల్ తీర్పును అనుసరించి 50 టీఎంసీల కావేరీ జలాలు విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇటీవల మరో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ ఈనెల 6వ తేదీన విచారణకు రాగా, సెకనుకు 15వేల ఘనపుటడుగులు లెక్కన పదిరోజులపాటు నీటిని విడుదల చేయాల్సిందిగా సుప్రీంకోర్టు కర్ణాటకను ఆదేశించింది. సుప్రీంతీర్పుపై ప్రజల్లో నిరసనలు వెల్లువెత్తగా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్‌తో అత్యవసరంగా సమావేశమైనారు. సుప్రీంకోర్టు ఆదేశాలను దిక్కరించేందుకు వీలులేదని, విడుదల చేయకుంటే చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని న్యాయవాదులు స్పష్టం చేశారు. అంతేగాక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీటిని విడుదల చేసినట్లయితే కర్ణాటక పరంగా పోరాటానికి మార్గం సుగమం అవుతుందని న్యాయవాదులు వివరించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో సీఎం సిద్ధరామయ్య నీటి విడుదలకు అంగీకరించారు.
కావేరీ జల ప్రవాహం:
అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కర్ణాటక ప్రభుత్వం మంగళవారం రాత్రి 12.30 గంటలకు కావేరీ జలాలను విడుదల చేశారు. కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా హెచ్‌టీ కోట్టై తాలూకాలోని కబినీ జలాశయం నుంచి సెకనుకు 5 వేల ఘనపుటడుగుల నీరు, మాండియాలోని కేఆర్‌ఎస్ జలాశయం నుంచి 10వేల ఘనపుటడుగుల నీటిని విడుదల చేశారు. ఈ నీరు తమిళనాడు వైపు పరుగులు తీస్తూ ప్రవహించడం ప్రారంభించింది. మేట్టూరు జలాశయంలో మంగళవారం ఇన్‌ఫ్లో 3935 ఘనపుటడుగులతో 75.83 అడుగుల నీటిమట్టం నమోదై ఉంది. మంగళవారం అర్ధరాత్రి విడుదల చేసిన కావేరీ జలాలు గురువారం ఉదయానికి హొగనెకల్‌కు, మేట్టూరు జలాశయానికి మధ్యాహ్నానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో మేట్టూరు జలాశయంలో నీటి మట్టం గురువారం సాయంత్రానికి వేగంగా పెరిగే అవకాశం ఉంది. మేట్టూరు జలాశయంలో నీటి మట్టం 90 అడుగులకు చేరుకున్న పక్షంలో డెల్టా సాగుకు నీటిని విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. కావేరీ జలాలు కరుణించే అవకాశాలు స్పష్టంగా ఉండడంతో డెల్టా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కావేరీ వస్తోంది
Published Thu, Sep 8 2016 2:52 AM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM
Advertisement
Advertisement