న్యూఢిల్లీ/చెన్నై: కర్ణాటకలో ‘కాలా’ సినిమా విడుదలకు సహకరించాలనీ కన్నడిగులకు రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు. సినిమా చూడాలనుకునే వారిని దయచేసి అడ్డుకోవద్దు. మీ సహకారం కోరుతున్నా’ అని చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని నివాసం వద్ద మీడియా సమావేశంలో కన్నడలో అర్థించారు. ‘నా సినిమా విడుదలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసే వారికి ఒకటి చెప్పాలనుకుంటున్నా.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కావేరి యాజమాన్య బోర్డు నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని మాత్రమే నేను కర్ణాటక ప్రభుత్వాన్ని కోరా. అందులో తప్పేమిటో నాకు తెలియదు. కన్నడిగుల ప్రయోజనాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కానేకాదు. కాలా గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతుండగా ఒక్క కర్ణాటకలోనే ఆపివేయటం మంచిదికాదు. హైకోర్టు ఆదేశాల మేరకు సినిమా విడుదల ప్రశాంతంగా జరిగేలా సీఎం కుమారస్వామి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’అని అన్నారు. రజనీకాంత్ హీరో, ఆయన అల్లుడు ధనుష్ నిర్మాతగా ఉన్న ‘కాలా’ గురువారం విడుదలకానున్న విషయం తెలిసిందే.
కొనసాగుతున్న అనిశ్చితి
సుప్రీంకోర్టుతోపాటు కర్ణాటక, మద్రాస్ హైకోర్టులు కాలా విడుదలకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ వివిధ కన్నడ సంఘాలు ఇందుకు ముందే ప్రకటించాయి. కాలా సినిమా పోస్టర్లను చించి వేయడంతోపాటు రజనీకాంత్‌కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. బెంగళూరులోని టౌన్‌హాల్ నుంచి ‘కాలా’ సినిమా ప్రదర్శించే థియేటర్ వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు కన్నడ సంఘాల కన్వీనర్ వాటాల్ నాగరాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment