రాజీవ్ హత్య కేసు నిందితులకు ఊరట
కేంద్రానికి చుక్కెదురు
విడుదల ఎప్పుడో
తమిళాభిమానుల హర్షం
సాక్షి, చెన్నై: రాజీవ్ హత్య కేసు నిందితుల ఉరి శిక్ష రద్దు సబబేనని సుప్రీంకోర్టు సమర్థించడం ఈలం మద్దతు, తమిళాభిమాన సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో, ఇక విడుదల నిర్ణయాన్ని కోర్టు ఎప్పుడు సమర్థిస్తుందోనన్న ఎదురు చూపులు పెరిగాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాందీ హత్య కేసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నళిని, మురుగన్, శాంతన్, పేరరివాళన్‌లకు కోర్టు ఉరి శిక్ష విధించింది. తొలుత నళిని శిక్ష యావజ్జీవంగా మారింది. అయితే, మురుగన్, శాంతన్, పేరరివాళన్‌ల క్షమాభిక్ష ఏళ్ల తరబడి రాష్ట్రపతి భవన్‌లో పడి ఉండడం , చివరకు ఉరి అమలుకు పరిస్థితులు దారి తీశాయి.
దీనిని వ్యతిరేకిస్తూ, తమిళనాట నిరసనలు రాజుకున్నాయి. ఎట్టకేలకు చివరి క్ష ణంలో ఉరి తాత్కాళికంగా నిలుపుదల చేశారు. తమ ఉరి శిక్షను వ్యతిరేకిస్తూ, రద్దు నినాదంతో సుప్రీంకోర్టును నిందితులు ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఉరి రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వారి ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది. దీనిని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తీర్పును సమీక్షించాలని, తీర్పులో మార్పు అవసరం అని ఆ పిటిషన్‌లో సూచించారు. అదే సమయంలో నిందితుల ఉరిశిక్ష యావజ్జీవంగా మారడంతో తమిళాభిమాన మది కొల్లగొట్టే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి ఇప్పటికే జైలు జీవితాన్ని గడిపిన నిందితులు, ఇక స్వేచ్ఛాయుత ప్రపంచంలోకి వచ్చేందుకు వీలుగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. రాజీవ్ హత్య కేసు నిందితుల్ని విడుదల చేస్తూ తీర్మానం చే శారు. అయితే, దీనికీ కేంద్రం అడ్డు తగలడంతో వారు విడుదలయ్యేనా... అన్న ఎదురు చూపులు తప్ప లేదు.
ఉరి రద్దు సబబే: ఉరి శిక్షరద్దును వ్యతిరేకిస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ రాజకీయ శాసనాల బెంచ్‌కు చేరింది. కొన్ని నెలలుగా విచారణ సాగుతూ వచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తు, న్యాయమూర్తి ఇబ్రహీం కలీఫుల్లా తదితరులతో కూడిన రాజకీయ శాసనాల బెంచ్ విచారిస్తూ వచ్చింది. బుధవారం తుది విచారణ ముగియడంతో గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రాజకీయ శాసనాల బెంచ్ సమర్థించింది. ఉరి శిక్షను రద్దు చేస్తూ గతంలో ఇచ్చిన తీర్పు సబబేనని పేర్కొంటూ, కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఉరి రద్దు వ్యవహారం నుంచి రాజీవ్ హత్య కేసు నిందితులకు ఊరట లభించినట్టు అయింది. సుప్రీం తీర్పును ఈలం మద్దతు సంఘాలు, పార్టీలు, తమిళాభిమాన సంఘాలు ఆహ్వానిస్తూ, హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో ఆ నిందితుల విడుదల ఎప్పుడో అన్న ఎదురు చూపులు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ విడుదల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌కు మోక్షం ఎప్పుడు లభిస్తుందో, ఆ నిందితుల విడుదల సాధ్యమేనా..? అన్న మీమాంసలో ఈలం మద్దతు, తమిళాభిమాన సంఘాలు ఉన్నాయి.
ఉరి రద్దు సబబే
Published Thu, Jul 30 2015 3:16 AM | Last Updated on Sat, Sep 15 2018 3:04 PM
Advertisement