‘సుప్రీం’ చల్లని కబురు | sweet news of rajiv gandhi murder case abusers | Sakshi
Sakshi News home page

‘సుప్రీం’ చల్లని కబురు

Published Sat, Jul 25 2015 12:10 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

sweet news of rajiv gandhi murder case abusers

యావజ్జీవ శిక్ష పడి జైళ్లలో మగ్గుతున్న వేలాదిమంది ఖైదీలకు ఇది ఉపశమనం కలిగించే కబురు. ఆ తరహా ఖైదీలను మళ్లీ చెప్పేవరకూ విడుదల చేయడానికి వీల్లేదని నిరుడు జూలైలో విధించిన స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు గురువారం ఉపసంహరించుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులను విడుదల చేస్తూ తమిళనాడు ప్రభుత్వం నిరుడు ఫిబ్రవరిలో తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ స్టే ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పట్లో దరిదాపుల్లోకొచ్చిన సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జయలలిత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సరిగ్గా ఆ కారణంగానే అప్పట్లో యూపీఏ సర్కారు కూడా హడావుడిగా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. రాహుల్‌గాంధీ కూడా చురుగ్గా స్పందించారు. ‘ఈ దేశంలో మాజీ ప్రధానికే న్యాయం జరగకపోతే... ఆయనను చంపినవారినే స్వేచ్ఛగా వదిలేస్తే ఇక సామాన్యుడికి న్యాయం లభించేదెలా?’ అంటూ ఆయన వాపోయారు. జయ నిర్ణయంలాగే రాహుల్ స్పందన కూడా ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని చేసిందే. ఎందుకంటే, రాజీవ్ కేసులో ఉరిశిక్ష పడిన దోషు క్షమాభిక్ష పిటిషన్లపై ఏడేళ్లపాటు జాప్యం చేసింది యూపీఏ సర్కారే. అంతక్రితం ఎన్డీయే నాలుగేళ్లు ఆ పిటిషన్లను పెండింగ్‌లో ఉంచింది. ఇలా 11 ఏళ్లు కదలక మెదలక కూర్చున్న కేంద్రం వైఖరిని తప్పుబడుతూ ఆ ఉరిశిక్షలను సుప్రీంకోర్టు యావజ్జీవ శిక్షలుగా మార్చింది. ఆ వెంటనే తమిళనాడు కేబినెట్ ఆదరా బాదరాగా మొత్తం ఏడుగురినీ విడుదల చేయాలని తీర్మానించింది. ఈ తీర్మానమే దేశంలో యావజ్జీవ ఖైదీలపాలిట శాపమైంది.

బయటి సమాజానికి జైలన్నా, ఖైదీలన్నా ఒక దురభిప్రాయం స్థిరపడి ఉంటుంది. అక్కడ ఉండేవాళ్లంతా కరుడుగట్టిన నేరస్తులన్న నమ్మకం ఉంటుంది. కానీ, లోనికి వెళ్లి చూస్తే తప్ప నిజమేమిటో అర్ధంకాదు. జైళ్లలో ఉండే మూడింట రెండొంతులమంది విచారణలో ఉన్న ఖైదీలేనని ఇటీవలి సర్వే తెలిపింది. పైగా వారు చేశారంటున్న నేరం రుజువై పడే శిక్షకు మించి జైళ్లలో మగ్గుతున్నవారు అనేకులున్నారని వివరించింది. ఈ ఖైదీల్లో వృద్ధాప్యానికి చేరుకుని కేన్సర్, ఎయిడ్స్, క్షయ, గుండెజబ్బు వంటి అనేక వ్యాధులతో బాధపడుతున్నవారున్నారు.

చేసిన నేరమో, చేయకున్నా బనాయించిన కేసులోనో, కేవలం అనుమానంపైనో... అరెస్టయి బెయిల్‌కు అవసరమైన పూచీ కత్తులను చూపలేకనో వేలాదిమంది జైళ్లలో మగ్గిపోతున్నారు. దేశంలో మొత్తం 1391 జైళ్లుంటే అందులో పరిమితికి మించి ఖైదీలుంటున్నారని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో చెబుతోంది. మన జైళ్లలో 118.4 శాతం ఖైదీలుంటున్నారని ఆ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉన్న జైళ్లలో పెద్దవి సెంట్రల్ జైళ్లు కాగా వాటిల్లో 121.2 శాతం ఖైదీలుంటున్నారు. అంటే తెలిసో, తెలియకో నేరం చేసినవారిని సంస్కరించి వారిని సన్మార్గంలో పెట్టాల్సిన జైళ్లు వాస్తవానికి కిక్కిరిసి ఉంటున్నాయి. ఫలితంగా అక్కడకు వెళ్లినవారు సత్ప్రవర్తనను అలవర్చుకోవడం అటుంచి రోగగ్రస్తులవుతున్నారు. సరైన పర్యవేక్షణ సాధ్యంకాక నేర ప్రవృత్తిని పెంచుకుంటున్నారు.

సాంకేతికంగా చూస్తే యావజ్జీవ శిక్ష అంటే జీవితాంతమూ...అంటే మరణించే వరకూ శిక్ష అనుభవించడమనే భావన ఉంది. కానీ సీఆర్‌పీసీ నిబంధనలు మాత్రం యావజ్జీవ శిక్షను ఆ రకంగా చూడటంలేదు. 14 ఏళ్లు శిక్ష అనుభవించిన ఖైదీలకు క్షమాభిక్షపెట్టే అధికారాన్ని అందులోని 432, 433 సెక్షన్లు రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చాయి. అయితే, ఆరుగురు సభ్యులుండే సలహా బోర్డు సిఫార్సు తర్వాత మాత్రమే ప్రభుత్వాలు ఆ పని చేయాలి. పైగా సీబీఐ లేదా మరే ఇతర కేంద్ర సంస్థ అయినా దర్యాప్తు జరిపిన కేసుల్లో యావజ్జీవ శిక్ష పడినపక్షంలో అలాంటివారిని విడుదల చేసేముందు ఆ సంస్థ అనుమతిని తీసుకోవాలి.  రాజీవ్ కేసు దోషుల విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఇలాంటి లాంఛనాలను పూర్తి చేయలేదన్న మాట వాస్తవమే. పైగా ఫలానా వారిని తాము విడుదల చేయదల్చుకున్నామని మాత్రమే కేంద్రానికి వర్తమానం పంపింది.

అయితే సుప్రీంకోర్టు ఇన్నాళ్లుగా విధించిన స్టే దేశవ్యాప్తంగా వేలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తమిళనాడు సర్కారు నిర్ణయం తప్పొప్పుల మాటెలా ఉన్నా తమ అధికారానికి పరిమితులు విధించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును వెనువెంటనే కోరి ఉంటే బాగుండేది. కాస్త జాప్యం చేసినా కర్ణాటక, పశ్చిమబెంగాల్ తదితర ప్రభుత్వాలు కొన్ని ఈ స్టే ఉత్తర్వులను రద్దు చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరాయి. 20 ఏళ్లు పైబడి శిక్ష అనుభవించిన ఖైదీలు సైతం జైళ్లలో ఉండటాన్ని అవి న్యాయమూర్తుల దృష్టికి తీసుకొచ్చాయి.

ఏటా రిపబ్లిక్ డే(జనవరి 26), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2) సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యావజ్జీవ శిక్ష పడిన ఖైదీలను, సత్ప్రవర్తన కారణంగా రెమిషన్ లభించిన ఖైదీలనూ విడుదల చేస్తున్నాయి. అయితే, అన్ని ప్రభుత్వాలూ ఒకే పద్ధతిని పాటించడంలేదు. మధ్యప్రదేశ్‌లో 14 ఏళ్ల శిక్ష తర్వాత యావజ్జీవ శిక్షపడినవారిని విడుదల చేస్తుంటే యూపీ 17 ఏళ్ల శిక్ష తర్వాత, మహారాష్ట్ర దాదాపు 24 ఏళ్ల శిక్ష తర్వాత విడుదల చేస్తున్నాయి. యావజ్జీవ శిక్ష విషయంలో ఉన్న అస్పష్టత కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. ఇందువల్ల ఖైదీల హక్కులకు భంగం కలుగుతున్న సంగతిని అటు న్యాయస్థానాలుగానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలుగానీ పట్టించుకోవడం లేదు.

ఇప్పుడు సుప్రీంకోర్టు వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులకు ఎన్నో షరతులున్నాయి. అత్యాచారం, హత్య కేసుల్లో యావజ్జీవ శిక్షపడినవారికి ఇది వర్తించదు. యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయస్థానాలు నిర్దిష్ట శిక్షా కాలాన్ని పేర్కొన్న పక్షంలో అలాంటివారికీ క్షమాభిక్ష పెట్టకూడదు. యూఏపీఏ వంటి చట్టాలకింద యావజ్జీవ శిక్షపడిన ఖైదీలు కూడా విడుదలకు అనర్హులు. సీబీఐ, ఎన్‌ఐఏ వంటి సంస్థలు దర్యాప్తు జరిపిన కేసుల్లో శిక్షపడినవారి విడుదల కూడా కుదరదు. ఇక రాజీవ్ కేసు దోషులు సరేసరి. తుది తీర్పు వెలువడే వరకూ వారి విడుదల సాధ్యంకాదు. ఈ కేసులో సాధ్యమైనంత త్వరగా తుది తీర్పు వెలువరించడంతోపాటు కారాగారాల అధ్వాన్నస్థితిపై సుప్రీంకోర్టు దృష్టిపెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సూచనలివ్వాలి. 120 ఏళ్లనాటి జైళ్ల చట్టాన్ని సమూలంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కదలాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement