5 ఏళ్ల బాలిక కాలు కొరికిన బస్సు కండెక్టర్
లుథియానా: ఐదేళ్ల బాలిక కాలును ఓ స్కూల్ బస్సు కండెక్టర్ కొరికిన దిగ్భ్రాంతికరమైన సంఘటన పంజాబ్ రాష్ట్రంలో లుథియానాలో సోమవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. సిమ్లాపురికి చెందిన సర్బజిత్ సింగ్ (27) అనే వ్యక్తి శాస్త్రీ నగరలోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో కండెక్టర్‌గా పనిచేస్తున్నాడు. స్కూల్ బస్సులో బాలికను ఇంటివద్ద దింపే క్రమంలో ఆ స్కూల్ బస్సు కండెక్టర్ బాలిక కాలును కొరికేశాడు. బీఆర్‌ఎస్ నగర్‌లో నివాసముంటున్న తన ఇంటికి చేరుకున్న బాలిక.. జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో బాలిక తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు స్కూల్ యాజమాన్యం కండెక్టర్‌పై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అనంతరం స్కూల్ యాజమాన్యం పోలీసులకు కూడా కండెక్టర్‌పై ఫిర్యాదు చేసింది.
వారి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. స్కూల్‌కు చేరుకున్న పోలీసులు ఈ సంఘటనపై విచారణ చేపట్టారు. బస్సు కండెక్టర్ సర్బజిత్ సింగ్‌ను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసినట్టు ఎస్‌బీఎస్ పోలీసులు తెలిపారు. నిందితుడు కండెక్టర్‌ను స్థానిక కోర్టులో హాజరుపర్చినట్టు తెలిపారు. అనంతరం అతడ్ని జుడిషియల్ కస్టడీకి తరలించినట్టు చెప్పారు. నిందితుడు సర్భజిత్ సింగ్ ఏడవ తరగతి వరకు చదువుకున్నాడనీ, పెళ్లి ఇంకా కాలేదని పేర్కొన్నారు. ఈ ఘటనతో స్కూల్ యాజమాన్యం కండెక్టర్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్టు పోలీసులు తెలిపారు. కాగా, బాలిక కాలును బస్సు కండెక్టర్ ఎందుకు కొరికాడో ఇప్పటివరకూ తెలియలేదు.