
సీక్రెట్ పోలీస్‌గా శ్రుతిహాసన్
ప్రస్తుతం హాట్ హీరోయిన్ల పట్టికలో నటి శ్రుతిహాసన్‌దే అగ్రస్థానం అని చెప్పక తప్పదు. పాత్ర డిమాండ్ చేస్తే గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేయడానికి సిద్ధమే అనే శ్రుతిహాసన్ టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్నారు. తమిళంలో విజయ్ సరసన నటించిన పులి చిత్రం నిరాశపరచినా అజిత్‌తో జత కట్టిన వేదాళం చిత్రం ఆ దిగులును పోగొట్టేసింది. ప్రస్తుతం సూర్య సరసన సింగం-3లో నటిస్తున్నారు.
సింగం, సింగం-2 చిత్రాల సక్సెస్‌తో సింగం-3పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కమర్షియల్ దర్శకుడు హరి-సూర్య కాంబినేషన్ అంటేనే ఒక క్రేజ్ ఉంది. ఇక సింగం-3లో సూర్య సరసన అనుష్క, శ్రుతిహాసన్ నటించడంతో ఈ చిత్రం ఆది నుంచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇందులో శ్రుతిహాసన్ సీక్రెట్ పోలీసు అధికారిణిగా యాక్షన్ పాత్రలో కనిపించనున్నారట. ఈ పాత్ర హీరో సూర్య పాత్రకు ధీటుగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో శ్రుతిహాసన్ యాక్షన్ అవతారం ఎత్తుతున్నారన్నమాట.