న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మరో రెండ్రోజుల్లో జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవాల కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులతోపాటు పారామిలటరీ బలగాలను మోహరించారు. రాజధానిలోని అణువణువునూ పోలీసులు జల్లెడ పడుతున్నారు. గత వారంరోజులుగా తనిఖీలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీకి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచిఉందన్న నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంతగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గగనతలం నుంచి కూడా ఉగ్రవాదులు విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న భద్రతా సిబ్బంది వాటిని కూడా తిప్పికొట్టే ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక హెలిక్యాప్టర్లతో గగనతలాన్ని కూడా తమ ఆదీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో రాజధాని నగరం భూమి-ఆకాశం పూర్తిగా భద్రతా సిబ్బంది చేతుల్లోకి వెళ్లిపోయింది.
ఇక ఉత్సవాలు జరిగే ఎర్రకోట వద్ద ఇప్పటికే మూడంచెల భద్రతను కొనసాగిస్తున్నారు. వీటితోపాటు పెట్రోలింగ్ వాహనాలు నగరాన్ని అనుక్షణం కాపలా కాస్తూనే ఉన్నాయి. రాజ్‌ఘాట్ నుంచి ఎర్రకోట వరకు భద్రత మరింత పటిష్టంగా ఉంది. ఇప్పటికే ఇక్కడ అనేక ఆంక్షలు అమలవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటకు వచ్చే మార్గాన్ని కూడా భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నాయి. ఈ మార్గంలో వచ్చిపోయేవారి కదలికలపై కన్నేశాయి. అనుమానం వచ్చినవారిని వెంటనే తనిఖీ చేస్తూ, ప్రశ్నిస్తున్నారు.
అనుమతి ఉన్న వాహనాలకు మాత్రమే...
ఎర్రకోట పరిసరాల్లోకి పరిమిత వాహనాలను మాత్రమే అనుమతిస్తామని, అయితే వాటికి అనుమతి ఉన్నట్లు సూచించే స్టిక్కర్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అయితే నకిలీ స్టిక్కర్లను అతికించుకొని వచ్చే వాహనాలను సులభంగా గుర్తుపట్టే ఏర్పాట్లు కూడా చేశామన్నారు. పరిసరాల్లోకి వచ్చే వాహనాలపై ఇప్పటి నుంచే ఆంక్షలు విధిస్తున్నారు.
ఇబ్బందులు పడుతున్న నగరవాసులు..
గత వారంరోజులుగా జరుగుతున్న ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్‌తో నగరవాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో పలు పాఠశాలల విద్యార్థులు రిహార్సల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇండియాగేట్ పరిసరాల్లోని రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గత రెండ్రోజులుగా ఎర్రకోట పరిసరాల్లో కూడా ఫుల్‌డ్రెస్ రిహార్సల్స్ జరిగాయి. దీంతో ఇక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో నగరవాసులు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రత్యామ్నాయ మార్గాల మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించారు. దీంతో వాహనదారులు కిలోమీటర్ల దూరంపాటు ప్రయాణించి గమ్యాలను చేరుకోవాల్సి వచ్చింది.
అదనపు బలగాల మోహరింపు...
మెట్రోరైల్ స్టేషన్లలో, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదనపు బలగాలను మోహరించారు. ఉత్సవాలను తిలకించేందుకు పెద్దమొత్తంలో ప్రముఖులు నగరానికి వచ్చే అవకాశమున్నందున భద్రతా బలగాల సంఖ్య పెంచారు. అంతేకాకుండా రైల్వేస్టేషన్లు, అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్స్, కీలక ప్రదేశాల్లో భద్రతా బలగాల సంఖ్య పెంచడంతోపాటు బారీకేడ్లు ఏర్పాటు చేయడం, తనిఖీ యంత్రాలను ఏర్పాటు చేయడం వంటి పనులను ఇప్పటికే పూర్తి చేశారు.
ఇక నగరంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసేందుకు శివారు ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. చెక్‌పోస్టుల కన్నుగప్పి ఏదైనా వాహనం పేలుడు పదార్థాలతో నగరంలోకి వచ్చినా దానిని పసిగట్టేలా నగరంలో కూడా అక్కడక్కడా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ విధుల కోసం 5,000 మంది ఢిల్లీ పోలీసులను నగరవాప్తంగా మోహరించగా ఇంతే సంఖ్యలో సభాస్థలి చుట్టు కూడా మోహరించారు. కేంద్ర పారామిలటరీ బలగాలు కూడా కీలక ప్రాంతాల్లో భద్రతా విధులు నిర్వర్తిస్తాయి. ఉత్సవాలు జరిగే ఎర్రకోట వద్ద 10,000 మంది కూర్చుండేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ భద్రత కోసం షార్ప్‌షూటర్లను, ఎన్‌ఎస్‌జీ కమెండోలను, స్పాటర్లను మోహరించారు. సమీపంలోని మొఘల్ ఫోర్ట్ నుంచి షార్ప్ షూటర్లు ప్రధాని ప్రసంగించే ప్రాంతాన్నంతా కాపలా కాస్తారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
పంద్రాగస్టుకు పటిష్ట భ ద్రత
Published Tue, Aug 12 2014 10:37 PM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM
Advertisement
Advertisement