టీనగర్: రాష్ర్టంలోని శాంతి భద్రతలపై కరుణ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పట్టపగలే నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో స్వాతి అనే యువతి దారుణ హత్యకు గురైందన్నారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ నేరుగా స్వాతి ఇంటికి వెళ్లి పరామర్శించారని పేర్కొన్నారు. బహిరంగ స్థలంలో జరిగిన ఈ హత్యోదంతంపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల చర్యను పలువురు ఖండిస్తున్నట్లు తెలిపారు. మద్రాసు హైకోర్టు కూడా దీనిపై తీవ్రంగా స్పందించినట్లు పేర్కొన్నారు. న్యాయమూర్తి ఎన్ కృపాకరన్ ప్రధాన న్యాయమూర్తికి రాసిన ఒక లేఖలో స్వాతికి రక్షణ కల్పించడంలో విఫలమైనందున స్వాతి కుటుంబానికి రైల్వేశాఖ ఎందుకు నష్టపరిహారం చెల్లించకూడదంటూ ప్రశ్నించారన్నారు. చెన్నైలో స్వాతిలాగానే సేలంలో వినుప్రియను కొందరు అసభ్యంగా మార్ఫింగ్ చేయడంతో ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. లేఖలో కరుణానిధి మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తె లిపారు.
మహిళలకు రక్షణ కరువు: పొన్ రాధాకృష్ణన్
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ విమర్శించారు. మంగళవారం పుదుచ్చేరికి చేరుకున్న పొన్ రాధాకృష్ణన్ విలేకరులతో మాట్లాడారు. పుదుచ్చేరి ప్రజలకు అంగీకారయోగ్యం కాని నేతను సోనియాగాంధీ ముఖ్యమంత్రిగా నియమించి కాంగ్రెస్ పార్టీ మహాద్రోహాన్ని తలపెట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
17న డీఎంకేలోకి మక్కల్ డీఎండీకే:
జులై 17న సేలంలో జరుగనున్న కార్యక్రమంలో డీఎంకే పార్టీలోకి మక్కల్ డీఎండికే చేరనున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రకుమార్ ప్రకటించారు. బుధవారం ఉదయం 10 గంటలకు చంద్రకుమార్, పార్థిపన్, సీహెచ్‌శేఖర్ గోపాలపురానికి వెళ్లి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని కలిసి డీఎంకేలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఒక లేఖను అందజేశారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ సమక్షంలో కరుణానిధికి శాలువా కప్పి డీఎంకేలో చేరారు. ఆయనతోపాటు నిర్వాహకులు ఏఈ మురుగేశన్, శివకుమార్, సెంథిల్‌కుమార్, రాజా, వేల్‌మురుగన్ కూడా పార్టీలో చేరారు. అనంతరం చంద్రకుమార్ విలేకరులతో మాట్లాడుతూ తామంతా డీఎంకేలో చేరినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా పర్యటించి డీఎండీకే ఉన్న వారిని డీ ఎంకేలోకి ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. ఇందుకోసం సేలంలో భారీ కార్యక్రమం ఏర్పాటుకానుందన్నారు.
డీఎంకేకు దూరం: విజయకాంత్
డీఎంకేతో ఇక ఎన్నటికీ పొత్తులు పెట్టుకోమని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ తెలిపారు. డీఎండీకే కార్మిక సంఘం 11వ వార్షికోత్సవం కోయంబేడులోగల పార్టీ కార్యాలయంలో జరిగింది. ఇందులో విజయకాంత్ కార్యకర్తలతో మాట్లాడారు. ఒక నిర్వాహకుడు మాట్లాడుతూ విజయకాంత్‌ను, పార్టీ చర్యలను విమర్శిస్తూ 14 జిల్లాల కార్యదర్శులు పేరిట విడుదలయిన లేఖపై ఆయా జిల్లా కార్యదర్శులతో విజయకాంత్ విచారణ జరిపారని, ఈ విచారణలో వారు తాము లేఖను రాయనట్లు తెలిపారన్నారు. దీంతో ఈ లేఖకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడికి విజయకాంత్ సూచనలిచ్చినట్లు తెలిపారు. అంతేగాకుండా డీఎండీకేను పతనం చేసేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారని, ఇందుకు జిల్లాల కార్యదర్శులు వీలు కల్పించరాదన్నారు.
రాష్ట్రంలో భద్రత కరువు
Published Thu, Jun 30 2016 1:29 AM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM
Advertisement
Advertisement