Tamil Nadu State
-
రాష్ట్రంలో భద్రత కరువు
టీనగర్: రాష్ర్టంలోని శాంతి భద్రతలపై కరుణ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పట్టపగలే నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో స్వాతి అనే యువతి దారుణ హత్యకు గురైందన్నారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ నేరుగా స్వాతి ఇంటికి వెళ్లి పరామర్శించారని పేర్కొన్నారు. బహిరంగ స్థలంలో జరిగిన ఈ హత్యోదంతంపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల చర్యను పలువురు ఖండిస్తున్నట్లు తెలిపారు. మద్రాసు హైకోర్టు కూడా దీనిపై తీవ్రంగా స్పందించినట్లు పేర్కొన్నారు. న్యాయమూర్తి ఎన్ కృపాకరన్ ప్రధాన న్యాయమూర్తికి రాసిన ఒక లేఖలో స్వాతికి రక్షణ కల్పించడంలో విఫలమైనందున స్వాతి కుటుంబానికి రైల్వేశాఖ ఎందుకు నష్టపరిహారం చెల్లించకూడదంటూ ప్రశ్నించారన్నారు. చెన్నైలో స్వాతిలాగానే సేలంలో వినుప్రియను కొందరు అసభ్యంగా మార్ఫింగ్ చేయడంతో ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. లేఖలో కరుణానిధి మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తె లిపారు. మహిళలకు రక్షణ కరువు: పొన్ రాధాకృష్ణన్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ విమర్శించారు. మంగళవారం పుదుచ్చేరికి చేరుకున్న పొన్ రాధాకృష్ణన్ విలేకరులతో మాట్లాడారు. పుదుచ్చేరి ప్రజలకు అంగీకారయోగ్యం కాని నేతను సోనియాగాంధీ ముఖ్యమంత్రిగా నియమించి కాంగ్రెస్ పార్టీ మహాద్రోహాన్ని తలపెట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 17న డీఎంకేలోకి మక్కల్ డీఎండీకే: జులై 17న సేలంలో జరుగనున్న కార్యక్రమంలో డీఎంకే పార్టీలోకి మక్కల్ డీఎండికే చేరనున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రకుమార్ ప్రకటించారు. బుధవారం ఉదయం 10 గంటలకు చంద్రకుమార్, పార్థిపన్, సీహెచ్‌శేఖర్ గోపాలపురానికి వెళ్లి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని కలిసి డీఎంకేలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఒక లేఖను అందజేశారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ సమక్షంలో కరుణానిధికి శాలువా కప్పి డీఎంకేలో చేరారు. ఆయనతోపాటు నిర్వాహకులు ఏఈ మురుగేశన్, శివకుమార్, సెంథిల్‌కుమార్, రాజా, వేల్మురుగన్ కూడా పార్టీలో చేరారు. అనంతరం చంద్రకుమార్ విలేకరులతో మాట్లాడుతూ తామంతా డీఎంకేలో చేరినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా పర్యటించి డీఎండీకే ఉన్న వారిని డీ ఎంకేలోకి ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. ఇందుకోసం సేలంలో భారీ కార్యక్రమం ఏర్పాటుకానుందన్నారు. డీఎంకేకు దూరం: విజయకాంత్ డీఎంకేతో ఇక ఎన్నటికీ పొత్తులు పెట్టుకోమని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ తెలిపారు. డీఎండీకే కార్మిక సంఘం 11వ వార్షికోత్సవం కోయంబేడులోగల పార్టీ కార్యాలయంలో జరిగింది. ఇందులో విజయకాంత్ కార్యకర్తలతో మాట్లాడారు. ఒక నిర్వాహకుడు మాట్లాడుతూ విజయకాంత్‌ను, పార్టీ చర్యలను విమర్శిస్తూ 14 జిల్లాల కార్యదర్శులు పేరిట విడుదలయిన లేఖపై ఆయా జిల్లా కార్యదర్శులతో విజయకాంత్ విచారణ జరిపారని, ఈ విచారణలో వారు తాము లేఖను రాయనట్లు తెలిపారన్నారు. దీంతో ఈ లేఖకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడికి విజయకాంత్ సూచనలిచ్చినట్లు తెలిపారు. అంతేగాకుండా డీఎండీకేను పతనం చేసేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారని, ఇందుకు జిల్లాల కార్యదర్శులు వీలు కల్పించరాదన్నారు. -
నాకిది పునర్జన్మ
చెన్నై, సాక్షి ప్రతినిధి: కుటుంబ సభ్యుల ప్రార్థనలు ఫలిం చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి సత్ఫలితాలను ఇచ్చింది. తీవ్రవాదుల చెరలో 8 నెలల పాటు బందీగా గడిపిన ఫాదర్ అలెక్స్ ప్రేమ్‌కుమార్ ఎట్టకేలకు విముక్తి పొందారు. శివగంగైలోనితన స్వగ్రామానికి సోమవారం సురక్షితంగా చేరుకున్నారు. నిజంగా నాకిది పునర్జ్మేనని ఆయన ఆనంద భాష్పాలతో తెలిపారు. తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లా దేవకోట్టై సమీపం వారియన్వయల్ గ్రామానికి చెందిన అలెక్స్ ప్రేమ్‌కుమార్ (47) ఏసు సభ ఫాదర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటలీ రోమ్నగర్ కేంద్రంగా పనిచేసే జేఆర్ఎస్ అనే స్వచ్ఛంద సంస్థలో చేరారు. భార త దేశంలో 50కి పైగా ఉన్న ఆ సంస్థ శాఖల కోసం పనిచేస్తున్నారు. ఈ సంస్థ ద్వారా విద్య, వైద్యం, అత్యవసర సహాయం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2005 జూన్ నుంచి 2011 మే వరకు తమిళనాడులోని శ్రీలంక శరణార్థులకు సేవలు అందించారు. ఆ తరువాత తాలిబాన్ తీవ్రవాదుల కార్యకలాపాలతో తల్లడిల్లిపోతున్న ఆప్ఘనిస్తాన్‌కు చేరుకుని అక్కడి ప్రజలకు సేవచేసేందుకు హీరట్ అనే నగరంలో జేఆర్ఎస్ సంస్థ శాఖను నెలకొల్పారు. శోకాదద్అనే గ్రామంలోని ఒక పాఠశాలలో విద్యాబోధన కోసం ఫాదర్ అలెక్స్ వెళ్లారు. అక్కడ మూడే ళ్లనుంచి పనిచేస్తున్న దశలో గత ఏడాది జూన్ 2న తన నివాసం హీరాట్కు వెళుతుండగా ఆరుగురు తాలిబాన్ తీవ్రవాదులు చుట్టుముట్టి కిడ్నాప్ చేశారు. శివగంగైలోని ఆయన కుటుంబీకులు ఈ సమాచారం తెలుసుకుని తల్లడిల్లిపోయారు. రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని నరేంద్రమోదీకి విన్నవించారు. ఫాదర్ కుటుంబీకులు డిల్లీ వెళ్లి విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌ను సైతం కలుసుకున్నారు. కేంద్రం ఎంతగా ప్రయత్నించినా ఫాదర్‌ను ఎక్కడ దాచిపెట్టింది తెలియరాలేదు. అయితే ఆయన జీవించి ఉన్నట్లు మాత్రం సమాచారం అందింది. మతమార్పిడులకు పాల్పడుతున్నారనే అపోహతో తాలిబన్లు ఫాదర్‌ను కిడ్నాప్ చేశారని, ఆ తరువాత వాస్తవాలు తెలుసుకుని ఫాదర్‌కు హానితలపెట్టలేదని సమాచారం అందింది. అయినా 264 రోజులపాటూ వారివద్దనే బందీగా ఉంచుకుని రెండురోజుల క్రితం విడిచిపెట్టారు. ఆఫ్ఘనిస్తాన్లోని భారత దౌత్యాధికారులు ఫాదర్‌ను కాబూల్‌కు తెచ్చారు. అక్కడి నుంచి ఆదివారం రాత్రి 7.15 గంటలకు ఢిల్లీకి చేర్చారు. జన్మభూమిపై అడుగుపెట్టగానే సంతోషంతో ఉప్పొంగిపోయారు. తండ్రి అంతోనీరాజ్, సోదరులతో కలిసి సోమవారం సాయంత్రం ఢిల్లీ నుండి శివగంగైకి చేరుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ, తాలిబాన్ల నుంచి ప్రాణాలతో బయటపడతానని ఏమాత్రం ఊహించలేద న్నారు. తనకు పునర్జన్మ ప్రసాదించినందుకు ముందుగా భగవంతునికి నమస్కరిస్తున్నానని, ఆ తరువాత ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. -
బతుకు నావ సాగక చావుకు ఎదురీత
సాక్షి ప్రతినిధి, విజయనరం : ఉన్న ఊరిలో ఉపాధి దొరక్క... ప్రకృతి ప్రకోపానికి పంటలు పండక... ఆదుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చూసిన వేళ... అగమ్యగోచరంగా ఉన్న బతుకులకు వలసలే శరణ్యం. జిల్లా వాసు లు కూడా పూట గడవడానికి జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల సరిహద్దులను దాటి చావుకు ఎదురు వెళ్తున్నారు. భార్యాభర్త లు ఒకచోట, పిల్లలు మరొక చోట ఉంటున్నారు. కన్నవారి ప్రేమకు పిల్లలు దూరమవుతున్నారు. పిల్లల ఆలనాపాలనను పండుటాకులకు అప్పగిస్తున్నారు. అలాగ ని వారంతా సుఖంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లిన వారికి చివరికి వేదనే మిగులుతోంది. ఇళ్లు వదిలి సంవత్సరాల తరబడి వలస జీవితం గడుపుతున్న కుటుంబాల్లో ఎప్పుడు ఏ విషాదం చోటు చేసుకుంటుం దో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం జిల్లాలో ఏ పల్లెకెళ్లినా ఇవే దృశ్యాలు కన్పిస్తున్నా యి. వలసల్లేని గ్రామాలు మచ్చుకైనా కన్పించడం లేదు. ప్రతి గ్రామంలో సరాసరి 50 కుటుంబాలు జిల్లా సరిహద్దులుదాటి బతుకుబండిని ఈడుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాలకు గురై పెద్ద దిక్కును కోల్పోతున్నాయి. ఆ జీవితాలు ఛిద్రమైపోతున్నాయి. ఇందుకు చెన్నై భవన కూలి ఘటననే తీసుకోవచ్చు. అనుకోని ప్రమాదంలో జిల్లాకు చెందిన 24 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఆ పల్లెలు గొల్లుమన్నాయి. ఊళ్లకు ఊళ్లు కన్నీటి పర్యంతమయ్యాయి. అనధికారిక లెక్కల ప్రకారం జిల్లా నుంచి సుమారు నాలుగు లక్షల మంది ప్రతి ఏటా వలస వెళ్తున్నారు. స్థానికంగా పనుల్లేకపోవడంతో విశాఖ, తూర్పుగోదావరి, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌తో పాటు తమిళనాడు రాష్ట్రాలకు వలస బాట పడుతున్నారు. కొందరైతే గల్ఫ్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, బర్మా వంటి దేశాలకు వలస పోతున్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాలు, జిల్లాల్లో ఎవరైనా మరణించారంటే వారంతా ఉపాధికి వెళ్లిన వారే అని నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికంతటికీ ఉన్న ఊరిలో ఉపాధి దొరక్కపోవడం, జీవనాధారమైన వ్యవసాయం సాగకపోవడమే కారణమని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్ని నియంత్రించే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసినా ప్రయోజనం ఒనగూరడం లేదు. చట్టంలో ఉన్న నిబంధనలతో ఆ పథకం ప్రయోజనమివ్వలేకపోతోంది.ఒక కుటుంబానికి 100 రోజులు మాత్రమే పని కల్పించాలన్న షరతు పెద్ద ప్రతిబంధకంగా మారింది. 100 రోజులు పని చూపించి, మిగతా 265 రోజులు ఏం చేయాలంటూ ప్రశ్నించే పరిస్థితి ఎదురైంది. ఇక చట్టంలో చెబుతున్న 100 రోజుల పనిదినాలు కూడా కల్పించని పరిస్థితులు జిల్లాలో చాలాచోట్ల ఉన్నాయి.ఒక్క 2013-14 ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుంటే 3.37లక్షల కుటుంబాల్లో కేవలం 1.23 లక్షల కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పనిదినాలు కల్పించారు. అంతకుముందు 2012-13లో లక్షా 23వేల 815 కుటుంబాలకు. 2011-12లో లక్షా 23వేల 776 కుటుంబాలకు, 2010-11లో 92,851 కుటుంబాలకు మాత్రమే 100రోజుల ఉపాధి దొరికింది. ఈ లెక్కను గమనిస్తే మిగతా వారంతా మిగతా రోజుల్లో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవ‘సాయం’లేదు మిగతా 265 రోజుల్లో వ్యవసాయ, ఇతరత్రా ఉపాధి పనులు దొరుకుతాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ పరిస్థితులు ఆ విధంగా లేవు. గత నాలుగేళ్లుగా చూసుకుంటే ఒకవైపు కరువు, మరోవైపు ముంపుతో ఏ ఏడాదీ పంటలు సరిగా పండిన దాఖల్లాలేవు. దీంతో వ్యవసాయ పనులు పరిమితమైపోయాయి. ఈ నేపథ్యంలో ఇళ్లు గడవక అనేక కుటుంబాలు రోజుల తరబడి పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నాళ్లీ బతుకులని పిల్లల్ని వదిలి, జిల్లా సరిహద్దులు దాటి కూలి పనుల కోసం లక్షలాది మంది వలసపోవాల్సిన దుస్థితి ఎదురవుతోంది. ఇలా వెళ్లే అనేక మంది మృత్యువాత పడుతున్నారు. అందుకు తాజా ఉదాహారణ చెన్నై భవన కూలిన ఘటనే. ఈ ప్రమాదంలో దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురానికి చెందిన ఏడుగురు, బాడంగికి చెందిన ఇద్దరు, మక్కువ మండలం తూరుమామిడికి చెందిన ముగ్గురు, పెద గైశీలకు చెందిన ముగ్గురు, కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన ముగ్గురు, మాదలింగికి చెందిన ఒకరు, జియ్యమ్మవలస మండలం నీలమాంబపురానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఇప్పుడా కుటుంబాలన్నీ దిక్కులేనివయ్యాయి. ఆదుకోవాల్సిన పెద్ద దిక్కును కోల్పోవడంతో భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పుడా పల్లెలన్నీ విషాదంతోనే ఉన్నాయి. ప్రమాదంలో బయటపడి గ్రామానికొచ్చిన వారికి ఇంకా అవే దృశ్యాలు వెంటాడుతున్నాయి. కళ్లముందే భవనం కూలిపోవడం, ఆత్మీయులు, అయినవారు సజీవసమాధి చెందిన ఘటనలు గుండెలను మెలేస్తున్నాయి. ఘటన జరిగిన పక్షం రోజులు దాటుతున్నా ఆ గ్రామాలు ఇంకా శోకసంద్రంలో ఉన్నాయి. -
శక్తి పీఠం.. అద్భుత క్షేత్రం..
కా అంటే లక్ష్మీ మా అంటే సరస్వతి అక్షి అంటే కన్ను కామాక్షి దేవి అంటే లక్ష్మీదేవి, సరస్వతీ దేవిని కన్నులుగా కలది అని అర్థం శిల్ప సంపదకు నిలయం కాంచీపురం మూడు రూపాల్లో కామాక్షి అమ్మవారు పట్టుచీరలకు ప్రసిద్ధి కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్: తమిళనాడు రాష్ర్టంలోని కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధికెక్కింది. పుష్పేషు మల్లి.. పురుషేషు విష్ణు.. నారీషు రంభ.. నగరేషు కంచి.. అని మహాకవి కాళిదాసు వర్ణించారు. పువ్వులలో అత్యున్నతమైనది మల్లె అని, పురుషులలో ఉత్తమోత్తముడు శ్రీ మహా విష్ణువని, స్త్రీలలో అందమైన వనిత రంభ అని, నగరాల్లో మహోన్నతమైనది కాంచీపురం అని దీనర్థం. కర్నూలు నగరానికి 450 కిలోమీటర్లు దూరంలో ఉండే కాంచీపురాన్ని చూసేందుకు వేసవిలో జిల్లా వాసులు చాలా మంది వెళ్తుంటారు. ఇక్కడ వెలసిన శ్రీ కామాక్షి అమ్మవారికి కుడి ఎడమలుగా లక్ష్మీ, సరస్వతులు వింజామరలు వీస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో అమ్మవారు ఏడు సంవత్సరాల బాల రూపంలో అవతరించారని చెబుతారు. కామాక్షిదేవి ఇక్కడ కారణ, బింబం, సూక్ష్మం అనే మూడు రూపాలలో విశిష్ట పూజలు అందుకుంటున్నారు. భారతదేశంలోనే సప్త మోక్షపురాలలో కంచి క్షేత్రం ఒకటి. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో కంచి కామాక్షి దేవి ఒకరు. దశరథ, తుండీర, శ్రీ కృష్ణదేవరాయలు, చోళ రాజులు, ఇక్ష్వాకు వంశస్థులు అమ్మవారిని ఆరాధించినట్లు చరిత్ర చెబుతోంది. పద్మాసనంలో కూర్చున్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. చూడవలసిన దేవాలయాలు పలార్ నది ఒడ్డున వెలసిన కాంచీపురంలో పురాతన ఆలయాలు ఉన్నాయి. కామాక్షి అమ్మవారి దేవాలయంతో పాటు ఏకాంబరనాథన్, వరదరాజ పెరుమాల్, ఉలగలంద పెరుమాల్, కుమార కొట్టం, కైలాసనాథర్, కాంచీపురేశ్వర దేవాలయాను చూడవచ్చు. చూడవలసిన దేవాలయాలు పలార్ నది ఒడ్డున వెలసిన కాంచీపురంలో పురాతన ఆలయాలు ఉన్నాయి. కామాక్షి అమ్మవారి దేవాలయంతో పాటు ఏకాంబరనాథన్, వరదరాజస్వామి(బంగారుబల్లి), ఉలగలంద పెరుమాల్, కుమార కొట్టం, కైలాసనాథర్, కాంచీపురేశ్వర దేవాలయాను చూడవచ్చు. భక్తులకు సౌకర్యాలు కంచిలో భక్తులు బస చేసేందుకు దేవాలయానికి చెందిన సత్రాలు, ఇతర అతిథి గృహాలు ఉన్నాయి. ప్రైవేటు అతిథి గృహాలో శ్రీ శక్తి రెసిడెన్సీ, ఎంఎం హోటల్, బాల సూర్య, భీమా రెసిడెన్సీ, జీఆర్టీ రెసిడెన్సీ, శ్రీరామ, ఎస్ఎస్కే ఇన్ ్ల ప్రధానమైనవిగా ఉన్నాయి. ప్రత్యేకతలు కంచీపురం పట్టు చీరలకు ప్రసిద్ధి. ఇక్కడ శిల్కు సొసైటీలు ఉన్నాయి. వివిధ రకాలకు చెందిన శిల్కు వస్త్రాలు, ముఖ్యంగా చీరలు ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ కంచి కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఇక్కడకు నిత్యం దేశ, విదేశాలకు చెందిన యాత్రికులు, వ్యాపారులు, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఎలా వెళ్లాలి కర్నూలు నుంచి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచీపురానికి వెళ్లాలంటే ముందుగా తిరుపతి లేదా చిత్తూరుకు చేరుకోవాలి. అక్కడి నుంచి నేరుగా బస్సుల్లో వెళ్లవచ్చు. లేదంటే కర్నూలు నుంచి నేరుగా చెన్నై వెళ్లి అక్కడి నుంచి కంచికి చేరుకోవచ్చు. చెన్నై నుంచి కంచి 65 కిలోమీటర్లు ఉంటుంది. జిల్లాలో ఎమ్మిగనూరు నుంచి కంచికి నేరుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది. అయితే పలు కారణాల వల్ల రద్దు అయ్యింది. రైలు మార్గం ద్వారా వెళ్లాలంటే కర్నూలు నుంచి తిరుపతికి వెళ్లాలి. అక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉంది. కర్నూలు నుంచి తిరుపతి వెళ్లేందుకు ప్రతి రోజు రాత్రి 11.46 గంటలకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రాత్రి 8 గంటలకు చైన్నై ఎక్స్‌ప్రెస్, ప్రతి సోమ, గురు, శనివారాల్లో మధ్యాహ్నం 1.30కు ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్, ప్రతి మంగళ, శుక్రవారాల్లో రాత్రి 9.50 గంటలకు ఏడుకొండలు ఎక్స్‌ప్రెస్, సోమ, గురువారాల్లో రాత్రి 9.50 గంటలకు తిరుపతి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇటీవలే ప్రవేశపెట్టిన డబుల్‌డెక్కర్ సూపర్‌ఫాస్ట్ ఏసీ రైలు ప్రతి బుధ, శనివారాల్లో ఉదయం 11 గంటలకు నడుస్తోంది. -
గుజరాత్ కంటే అగ్రభాగాన తమిళనాడు
నరేంద్రమోడీ విమర్శలపై స్పందించిన జయలలిత హొసూరు, న్యూస్‌లైన్ : గుజరాత్ కంటే తమిళనాడు రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. కృష్ణగిరిలో గురువారం మధ్యాహ్నం కృష్ణగిరి అన్నాడీఎంకే అభ్యర్థి అశోక్‌కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. తమిళనాడు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కుంటుపడిందని, ఉద్యోగవకాశాలు కోల్పోయారని, విద్యుత్‌కోత ఉందని, బుధవారం కృష్ణగిరిలో జరిగన ఎన్నికల ప్రచారసభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడి విమర్శించడంపై జయ తీవ్రంగా స్పందించారు. అన్ని రంగాల్లో గుజరాత్ కంటే తమిళనాడే ముందుందని వివరాలను వెల్లడించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు అధికార మార్పు కోసం జరుగుతున్నవి కాదని, విదేశీ శక్తుల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు ఈ ఎన్నికలలో తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు. కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం మీరిచ్చే తీర్పు ఆధారపడి ఉందన్నారు. కాంగ్రెస్, డీఎంకే పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తారా అని జయలలిత అడగడంతో ప్రజలు సానుకూలంగా స్పందించారు. యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా మంత్రి పదవులు పొందిన డీఎంకే వారు తమిళనాడు రాష్ట్రం తలదించుకునే విధంగా 2జీ స్పెక్ట్రం కుంభకోణం చేశారని ఆరోపించారు. తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ఏం చేశాయని జయలలిత ప్రశ్నించారు. హొగేనకల్ పథకంపై స్టాలిన్ తప్పుడు ప్రచారం హొగేనకల్ తాగునీటి పథకంపై స్టాలిన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని జయలలిత ఆరోపించారు. డీఎంకే హయాంలో హొగేనకల్ పనులు 18 శాతం మాత్రమే పూర్తిచేశారని, అన్నాడీఎంకే అధికారం చేపట్టిన తర్వాత పనులు పూర్తిచేసి, 2013మే నెలలో హొగేనకల్ పథకాన్ని ప్రారంభించి తాగునీరందిస్తున్నామన్నారు. స్టాలిన్ హొగేనకల్ పనులను మూలన పడేశారని పచ్చి అపద్ధాలు చెపుతున్నారని విమర్శించారు. అన్నాడీఎంకే పాలనలో చేపట్టిన కృష్ణగిరి జిల్లాలో అభివృద్ది పనులను ముఖ్యమంత్రి వివరించారు. కేంద్రంలో సహకారం అందించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అన్నాడీఎంకే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కృష్ణగిరి జిల్లా ప్రజల చిరకాలవాంఛ అయిన హొసూరు-జోలార్‌పేట రైలు మార్గాన్ని సాధించుకుందామని హర్షాధ్వానాల మధ్య జయలలిత ప్రకటించారు. నదుల అనుసంధానానికి మోడీ హామీ ఇవ్వగలరా వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు దేశంలో నదుల అనుసంధానం కోసం కృషి చేశారని కృష్ణగిరి, సేలం బహిరంగ సభల్లో నరేంద్రమోడీ చెప్పారని, అయితే ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని జయ ప్రశ్నించారు. తమిళనాడులో నదుల అనుసంధానానికి బీజేపీ హామీ ఇస్తుందా అని, ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్నాడీఎంకేలో చేరిక కృష్ణగిరి జిల్లాలో వివిధ పార్టీల నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తళి మాజీ ఎమ్మెల్యే దివంగత వేణుగోపాల్ తనయుడు వి.వెంకటేశ్, జూజువాడి మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ శ్రీధర్, హొసూరు మున్సిపల్ డీఎంకే కౌన్సిలర్ కుమార్, మూకొండపల్లి కౌన్సిలర్ వెంకటరెడ్డి, మరికొంతమంది కౌన్సిలర్లు అన్నాడీఎంకే పార్టీలో చేరారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే.పి.మునిస్వామి, బర్గూరు ఎమ్మెల్యే కే.ఈ.కృష్ణమూర్తి, ఊతంగెరె ఎమ్మెల్యే మనోరంజితం, హొసూరు మున్సిపల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, యూనియన్ చైర్పర్సన్ పుష్పాసర్వేష్, కృష్ణగిరి మున్సిపల్ చైర్మన్ తంగముత్తు పాల్గొన్నారు. బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.