గుజరాత్ కంటే అగ్రభాగాన తమిళనాడు
- నరేంద్రమోడీ విమర్శలపై స్పందించిన జయలలిత
హొసూరు, న్యూస్‌లైన్ : గుజరాత్ కంటే తమిళనాడు రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. కృష్ణగిరిలో గురువారం మధ్యాహ్నం కృష్ణగిరి అన్నాడీఎంకే అభ్యర్థి అశోక్‌కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. తమిళనాడు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కుంటుపడిందని, ఉద్యోగవకాశాలు కోల్పోయారని, విద్యుత్‌కోత ఉందని, బుధవారం కృష్ణగిరిలో జరిగన ఎన్నికల ప్రచారసభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడి విమర్శించడంపై జయ తీవ్రంగా స్పందించారు.
అన్ని రంగాల్లో గుజరాత్ కంటే తమిళనాడే ముందుందని వివరాలను వెల్లడించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు అధికార మార్పు కోసం జరుగుతున్నవి కాదని, విదేశీ శక్తుల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు ఈ ఎన్నికలలో తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు. కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం మీరిచ్చే తీర్పు ఆధారపడి ఉందన్నారు.
కాంగ్రెస్, డీఎంకే పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తారా అని జయలలిత అడగడంతో ప్రజలు సానుకూలంగా స్పందించారు. యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా మంత్రి పదవులు పొందిన డీఎంకే వారు తమిళనాడు రాష్ట్రం తలదించుకునే విధంగా 2జీ స్పెక్ట్రం కుంభకోణం చేశారని ఆరోపించారు. తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ఏం చేశాయని జయలలిత ప్రశ్నించారు.
హొగేనకల్ పథకంపై స్టాలిన్ తప్పుడు ప్రచారం
హొగేనకల్ తాగునీటి పథకంపై స్టాలిన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని జయలలిత ఆరోపించారు. డీఎంకే హయాంలో హొగేనకల్ పనులు 18 శాతం మాత్రమే పూర్తిచేశారని, అన్నాడీఎంకే అధికారం చేపట్టిన తర్వాత పనులు పూర్తిచేసి, 2013మే నెలలో హొగేనకల్ పథకాన్ని ప్రారంభించి తాగునీరందిస్తున్నామన్నారు. స్టాలిన్ హొగేనకల్ పనులను మూలన పడేశారని పచ్చి అపద్ధాలు చెపుతున్నారని విమర్శించారు.
అన్నాడీఎంకే పాలనలో చేపట్టిన కృష్ణగిరి జిల్లాలో అభివృద్ది పనులను ముఖ్యమంత్రి వివరించారు. కేంద్రంలో సహకారం అందించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అన్నాడీఎంకే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కృష్ణగిరి జిల్లా ప్రజల చిరకాలవాంఛ అయిన హొసూరు-జోలార్‌పేట రైలు మార్గాన్ని సాధించుకుందామని హర్షాధ్వానాల మధ్య జయలలిత ప్రకటించారు.
నదుల అనుసంధానానికి మోడీ హామీ ఇవ్వగలరా
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు దేశంలో నదుల అనుసంధానం కోసం కృషి చేశారని కృష్ణగిరి, సేలం బహిరంగ సభల్లో నరేంద్రమోడీ చెప్పారని, అయితే ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని జయ ప్రశ్నించారు. తమిళనాడులో నదుల అనుసంధానానికి బీజేపీ హామీ ఇస్తుందా అని, ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అన్నాడీఎంకేలో చేరిక
కృష్ణగిరి జిల్లాలో వివిధ పార్టీల నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తళి మాజీ ఎమ్మెల్యే దివంగత వేణుగోపాల్ తనయుడు వి.వెంకటేశ్, జూజువాడి మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ శ్రీధర్, హొసూరు మున్సిపల్ డీఎంకే కౌన్సిలర్ కుమార్, మూకొండపల్లి కౌన్సిలర్ వెంకటరెడ్డి, మరికొంతమంది కౌన్సిలర్లు అన్నాడీఎంకే పార్టీలో చేరారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే.పి.మునిస్వామి, బర్గూరు ఎమ్మెల్యే కే.ఈ.కృష్ణమూర్తి, ఊతంగెరె ఎమ్మెల్యే మనోరంజితం, హొసూరు మున్సిపల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, యూనియన్ చైర్‌పర్సన్ పుష్పాసర్వేష్, కృష్ణగిరి మున్సిపల్ చైర్మన్ తంగముత్తు పాల్గొన్నారు. బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.