నితిన్ బాయ్ పటేల్
అహ్మదాబాద్: సార్వత్రిక ఎన్నికలు మరో వారంలో ముగియనుండడం, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే అవకాశముందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం పదవికి పోటీ మొదలైంది. పార్టీ తనకు ఆ పదవి ఇస్తే చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర ఆర్థిక మంత్రి నితిన్ బాయ్ పటేల్ సోమవారం పీటీఐకి చెప్పారు. ‘మీరు సీఎం పోస్టు తీసుకోవడానికి సిద్ధమేనా అని ఏ ఎమ్మెల్యేను అడిగినా అవుననే బదులిస్తారు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ కావడం ఇష్టమేనా అని విరాట్ కోహ్లిని అడిగితే ఇష్టం లేదని ముమ్మాటికీ చెప్పడు. అయితే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నాతోపాటు అందరూ కట్టుబడి ఉంటారన్నారు' అని రాష్ట్ర సీనియర్ మంత్రి నితిన్ పటేల్ చెప్పారు.
గుజరాత్ సీఎం పదవి రేసులో పటేల్‌తోపాటు మంత్రులు ఆనందీ పటేల్, సౌరభ్ పటేల్, పార్టీ ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జి అమిత్ షా, మరో నేత పురుషోత్తం రుపాలా తదితరులు ఉన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే, మోడీకి సరితూగే వ్యక్తి ఎవరూ లేరు కనుక సీఎం పదవిని భర్తీ చేయడం కష్టమవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నెల 16న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.