
గుజరాత్ అసెంబ్లీకి హాజరైన మోడీ
అహ్మదాబాద్ : ఈ నెల 26న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ బుధవారం గుజరాత్ అసెంబ్లీకి హాజరయ్యారు. నేడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. మరోవైపు మోడీకి వీడ్కోలు పలికేందుకు శాసనసభ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. మోడీకి గుజరాత్ శాసనసభ్యులు ఘనంగా వీడ్కోలు చెప్పనున్నారు. ఎమ్మెల్యేలంతా ఆయనను సన్మానించనున్నారు.
12 ఏళ్లపాటు సీఎం పదవి నిర్వహించిన మోడీ ప్రధానిగా ఎంపికవడంతో ఆ బాధ్యతల నుంచి వైదొలుగనున్నారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం మూడున్నరకు మోడీ తన రాజీనామా లేఖను గవర్నర్ కమ్లా బేణీవాల్‌కు అందజేయనున్నారు. మరోవైపు గుజరాత్ తదుపరి సీఎం రేసులో రెవెన్యూశాఖ మంత్రి ఆనందీ బెన్ పటేల్ ముందంజలో ఉన్నారు. శాసనసభాపక్ష సమావేశంలో ఆనందీ బెన్ పటేల్‌ను నేతగా ఎన్నుకునే అవకాశాలున్నాయి.