anandi ben patel
-
పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ దంకర్... త్రిపుర గవర్నర్ గా రమేష్ బైస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్‌ను ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా...బిహార్ గవర్నర్‌గా పనిచేస్తున్న లాల్ జీ టాండన్‌ను మధ్యప్రదేశ్ గవర్నర్‌గా కేంద్రం బదిలీ చేసింది. అదే విధంగా బిహార్ గవర్నర్‌గా పగు చౌహాన్... నాగాలాండ్ గవర్నర్‌గా ఆర్ ఎన్ రవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆనందీ బెన్ రాజీనామా ఆమోదం
అహ్మదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ రాజీనామాకు రాష్ట్ర గవర్నర్ ఓపీ కోహ్లీ ఆమోదం తెలిపారు. ఆనందీ బెన్ బుధవారం సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. కాగా గుజరాత్ కొత్త సీఎం అభ్యర్థి ఎంపిక గురువారం ఖరారు కానుంది. ఇందుకోసం పార్టీ పరిశీలకులుగా నితిన్ గడ్కరీ, సరోజ్ పాండే గుజరాత్ వెళ్లనున్నారు. మరోవైపు సీఎం రేసులో పలువురు ముఖ్యనేతల పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. గుజరాత్ ఆరోగ్య మంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్ విజయ్ రూపానీ, సౌరభ్ పటేల్ పేర్లు ముందంజలో ఉన్నాయి. ఇక నరేంద్రమోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన నేపథ్యంలో ఆనందీ బెన్ 2014లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఇటీవల రాష్ట్రంలో రాజకీయంగా పలు సవాళ్లతో సతమతమవుతున్న సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తన వయసు 75 ఏళ్లకు చేరుతున్నందున ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటానంటూ రెండు నెలల కిందటే పార్టీ నాయకత్వానికి తాను లేఖ రాశానని ఆనందీబెన్ సోమవారం ఫేస్బుక్లో తెలిపారు. -
ముఖ్యమంత్రికి మోదీ అభినందనలు
అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్‌కు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ఆమెతో పాటు టీం గుజరాత్ మొత్తాన్ని ఆయన తన ట్వీట్ ద్వారా అభినందించారు. సుపరిపాలనతో పాటు ఏడాది కాలంలో మంచి పురోగతి సాధించారంటూ ప్రశంసలతో ముంచెత్తారు. రాబోయే కాలానికి శుభాభినందనలు కూడా తెలిపారు. అందుకు సీఎం ఆనందిబెన్ పటేల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ట్వీట్ ఇచ్చారు. భారతదేశాన్ని 'ప్రపంచానికే గురువు' చేసేందుకు తమ శక్తివంచన లేకుండా సామర్థ్యం మేరకు కృషిచేస్తామని, ఈ దిశగా గుజరాత్ తన సేవలు అందిస్తుందని ఆమె తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోదీ.. గత సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ సాధించి ప్రధాని అవ్వడంతో గుజరాత్ సీఎం పదవికి ఆనందిబెన్ పటేల్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. I congratulate Gujarat CM @anandibenpatel & entire Team Guj on completing a successful year of progress & good governance. My best wishes. — Narendra Modi (@narendramodi) May 22, 2015 Thank you PM @narendramodi for your kind wishes. Gujarat will continue to contribute to the best of its capacity to make India 'Vishwa Guru' — Anandiben Patel (@anandibenpatel) May 22, 2015 -
మోడీ వారసురాలు ఆనందీ
- గుజరాత్ సీఎం పదవికి నరేంద్రమోడీ రాజీనామా - బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఆనందీబెన్ పటేల్ ఏకగ్రీవ ఎన్నిక - నేడు మోడీ సమక్షంలో గుజరాత్ తొలి మహిళా సీఎంగా ప్రమాణం గాంధీనగర్: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించటంతో ప్రధానమంత్రి పదవి చేపట్టనున్న నరేంద్ర మోడీ బుధవారం గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో గుజరాత్లో 12 ఏళ్ల మోడీ శకానికి తెరపడగా.. కొత్త ముఖ్యమంత్రిగా ఆనందీ బెన్ పటేల్‌ను రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్షం ఎన్నుకుంది. మోడీకి సన్నిహితురాలైన అనందీ బెన్ (73) ప్రస్తుతం రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఆమె గురువారం మోడీ సమక్షంలో రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీ బుధవారం పలువురు మంత్రివర్గ సహచరులు, పార్టీ రాష్ట్ర నేతలతో సహా రాజ్‌భవన్‌లో గవర్నర్ కమలా బేనీవాల్‌ను కలిసి ముఖ్యమంత్రి పదవికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. తాను 2002 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మణినగర్ అసెంబ్లీ స్థానానికీ రాజీనామా చేశారు. అనంతరం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఆనందీని ఎన్నుకున్నారు. ఆనందీ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఇంతటి బాధ్యతాయుతమైన పదవికి ఒక రైతు కుమార్తెనైన నన్ను ఎంపిక చేసినందుకు పార్టీ అగ్రనేతలకు, మన ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సోదరుడు మోడీ ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూ వచ్చారు’’ అని ఆమె చెమర్చిన కళ్లతో పేర్కొన్నారు. మోడీ 21వ శతాబ్దపు నాయకుడన్నారు. ఆనందీని క్రమశిక్షణకు మారుపేరుగా చెప్తారు. ఆమె టీచర్‌గా పనిచేస్తున్నపుడు 1987లో నీటిలో మునిగిపోతున్న ఇద్దరు బాలికలను రక్షించేందుకు సరోవర్ ప్రాజెక్టులోకి దూకి ప్రదర్శించిన సాహసంతో ఖ్యాతిలోకి వచ్చారు. పొరపాటు చేసివుంటే క్షమించండి: మోడీ ఉద్వేగం గుజరాత్ సీఎం పదవికి మోడీ రాజీనామా చేసే ముందు శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. 2001 అక్టోబర్ 7 నుంచి గుజరాత్ సీఎంగా కొనసాగిన మోడీ.. వీడ్కోలు ప్రసంగంలో భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రం నుంచి తాను వెళ్లిపోయిన తర్వాతా గుజరాత్ అభివృద్ధి పథంలో కొనసాగాలన్నారు. ‘‘నేను తప్పు చేసివున్నట్లయితే క్షమించండి. నాలుగోసారి సీఎంనయ్యాను.. ఇప్పుడు వెళుతున్నాను. నేను ఆశించినట్లు పనిచేయలేదని కానీ, నా ప్రవర్తనలో ఏదైనా లోపముందని కానీ భావిస్తే నన్ను క్షమించాలి. ఈ రోజు క్షమాదినం. మీ అందరినీ, ఈ సభను గౌరవిస్తున్నాను. ప్రత్యేకించి ప్రతిపక్షానికి కృతజ్ఞతలు’’ అని గద్గద స్వరంతో పేర్కొన్నారు. తాను ప్రధానిఅయిన తర్వాత రాష్ట్రంపై శ్రద్ధ పెడతానన్నారు. వ్యక్తి ఆధారంగా ముందుకు వెళ్లే విధానం ఎల్లకాలం కొనసాగదని.. మంచి పని కొనసాగాలంటే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తన మంత్రివర్గంలో ఎవరుండాలో తానింకా నిర్ణయించకపోయినా మీడియా మాత్రం ఇరవై వరకు మంత్రివర్గ జాబితాలను రూపొందించిందని నవ్వుతూ అన్నారు. -
గుజరాత్ అసెంబ్లీకి హాజరైన మోడీ
అహ్మదాబాద్ : ఈ నెల 26న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ బుధవారం గుజరాత్ అసెంబ్లీకి హాజరయ్యారు. నేడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. మరోవైపు మోడీకి వీడ్కోలు పలికేందుకు శాసనసభ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. మోడీకి గుజరాత్ శాసనసభ్యులు ఘనంగా వీడ్కోలు చెప్పనున్నారు. ఎమ్మెల్యేలంతా ఆయనను సన్మానించనున్నారు. 12 ఏళ్లపాటు సీఎం పదవి నిర్వహించిన మోడీ ప్రధానిగా ఎంపికవడంతో ఆ బాధ్యతల నుంచి వైదొలుగనున్నారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం మూడున్నరకు మోడీ తన రాజీనామా లేఖను గవర్నర్ కమ్లా బేణీవాల్‌కు అందజేయనున్నారు. మరోవైపు గుజరాత్ తదుపరి సీఎం రేసులో రెవెన్యూశాఖ మంత్రి ఆనందీ బెన్ పటేల్ ముందంజలో ఉన్నారు. శాసనసభాపక్ష సమావేశంలో ఆనందీ బెన్ పటేల్‌ను నేతగా ఎన్నుకునే అవకాశాలున్నాయి.