మోడీ వారసురాలు ఆనందీ
- గుజరాత్ సీఎం పదవికి నరేంద్రమోడీ రాజీనామా
- బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఆనందీబెన్ పటేల్ ఏకగ్రీవ ఎన్నిక
- నేడు మోడీ సమక్షంలో గుజరాత్ తొలి మహిళా సీఎంగా ప్రమాణం
గాంధీనగర్: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించటంతో ప్రధానమంత్రి పదవి చేపట్టనున్న నరేంద్ర మోడీ బుధవారం గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో గుజరాత్‌లో 12 ఏళ్ల మోడీ శకానికి తెరపడగా.. కొత్త ముఖ్యమంత్రిగా ఆనందీ బెన్ పటేల్‌ను రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్షం ఎన్నుకుంది. మోడీకి సన్నిహితురాలైన అనందీ బెన్ (73) ప్రస్తుతం రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఆమె గురువారం మోడీ సమక్షంలో రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీ బుధవారం పలువురు మంత్రివర్గ సహచరులు, పార్టీ రాష్ట్ర నేతలతో సహా రాజ్‌భవన్‌లో గవర్నర్ కమలా బేనీవాల్‌ను కలిసి ముఖ్యమంత్రి పదవికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
తాను 2002 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మణినగర్ అసెంబ్లీ స్థానానికీ రాజీనామా చేశారు. అనంతరం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఆనందీని ఎన్నుకున్నారు. ఆనందీ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఇంతటి బాధ్యతాయుతమైన పదవికి ఒక రైతు కుమార్తెనైన నన్ను ఎంపిక చేసినందుకు పార్టీ అగ్రనేతలకు, మన ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సోదరుడు మోడీ ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూ వచ్చారు’’ అని ఆమె చెమర్చిన కళ్లతో పేర్కొన్నారు. మోడీ 21వ శతాబ్దపు నాయకుడన్నారు. ఆనందీని క్రమశిక్షణకు మారుపేరుగా చెప్తారు. ఆమె టీచర్‌గా పనిచేస్తున్నపుడు 1987లో నీటిలో మునిగిపోతున్న ఇద్దరు బాలికలను రక్షించేందుకు సరోవర్ ప్రాజెక్టులోకి దూకి ప్రదర్శించిన సాహసంతో ఖ్యాతిలోకి వచ్చారు.
పొరపాటు చేసివుంటే క్షమించండి: మోడీ ఉద్వేగం
గుజరాత్ సీఎం పదవికి మోడీ రాజీనామా చేసే ముందు శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. 2001 అక్టోబర్ 7 నుంచి గుజరాత్ సీఎంగా కొనసాగిన మోడీ.. వీడ్కోలు ప్రసంగంలో భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రం నుంచి తాను వెళ్లిపోయిన తర్వాతా గుజరాత్ అభివృద్ధి పథంలో కొనసాగాలన్నారు. ‘‘నేను తప్పు చేసివున్నట్లయితే క్షమించండి. నాలుగోసారి సీఎంనయ్యాను.. ఇప్పుడు వెళుతున్నాను.
నేను ఆశించినట్లు పనిచేయలేదని కానీ, నా ప్రవర్తనలో ఏదైనా లోపముందని కానీ భావిస్తే నన్ను క్షమించాలి. ఈ రోజు క్షమాదినం. మీ అందరినీ, ఈ సభను గౌరవిస్తున్నాను. ప్రత్యేకించి ప్రతిపక్షానికి కృతజ్ఞతలు’’ అని గద్గద స్వరంతో పేర్కొన్నారు. తాను ప్రధానిఅయిన తర్వాత రాష్ట్రంపై శ్రద్ధ పెడతానన్నారు. వ్యక్తి ఆధారంగా ముందుకు వెళ్లే విధానం ఎల్లకాలం కొనసాగదని.. మంచి పని కొనసాగాలంటే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తన మంత్రివర్గంలో ఎవరుండాలో తానింకా నిర్ణయించకపోయినా మీడియా మాత్రం ఇరవై వరకు మంత్రివర్గ జాబితాలను రూపొందించిందని నవ్వుతూ అన్నారు.