శక్తి పీఠం.. అద్భుత క్షేత్రం.. | kanchi kamakshi temple is one fo the big tample | Sakshi
Sakshi News home page

శక్తి పీఠం.. అద్భుత క్షేత్రం..

Published Thu, May 22 2014 4:04 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM

ఏకాంబరనాథన్ ఆలయం

ఏకాంబరనాథన్ ఆలయం

 కా అంటే లక్ష్మీ
 మా అంటే సరస్వతి
 అక్షి అంటే కన్ను
 కామాక్షి దేవి అంటే
 లక్ష్మీదేవి, సరస్వతీ దేవిని
 కన్నులుగా కలది అని అర్థం


 
  శిల్ప సంపదకు నిలయం కాంచీపురం మూడు రూపాల్లో కామాక్షి అమ్మవారు పట్టుచీరలకు ప్రసిద్ధి
 
 కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్: తమిళనాడు రాష్ర్టంలోని కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధికెక్కింది. పుష్పేషు మల్లి.. పురుషేషు విష్ణు.. నారీషు రంభ.. నగరేషు కంచి.. అని మహాకవి కాళిదాసు వర్ణించారు. పువ్వులలో అత్యున్నతమైనది మల్లె అని, పురుషులలో ఉత్తమోత్తముడు శ్రీ మహా విష్ణువని,  స్త్రీలలో అందమైన వనిత రంభ అని, నగరాల్లో మహోన్నతమైనది కాంచీపురం అని దీనర్థం. కర్నూలు నగరానికి 450 కిలోమీటర్లు దూరంలో ఉండే కాంచీపురాన్ని చూసేందుకు వేసవిలో జిల్లా వాసులు చాలా మంది వెళ్తుంటారు.

ఇక్కడ వెలసిన శ్రీ కామాక్షి అమ్మవారికి కుడి ఎడమలుగా లక్ష్మీ, సరస్వతులు వింజామరలు వీస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో అమ్మవారు ఏడు సంవత్సరాల బాల రూపంలో అవతరించారని చెబుతారు. కామాక్షిదేవి ఇక్కడ కారణ, బింబం, సూక్ష్మం అనే మూడు రూపాలలో విశిష్ట పూజలు అందుకుంటున్నారు. భారతదేశంలోనే సప్త మోక్షపురాలలో కంచి క్షేత్రం ఒకటి. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో కంచి కామాక్షి దేవి ఒకరు. దశరథ, తుండీర, శ్రీ కృష్ణదేవరాయలు, చోళ రాజులు, ఇక్ష్వాకు వంశస్థులు అమ్మవారిని ఆరాధించినట్లు చరిత్ర చెబుతోంది. పద్మాసనంలో కూర్చున్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.
 
చూడవలసిన దేవాలయాలు
పలార్ నది ఒడ్డున వెలసిన కాంచీపురంలో పురాతన ఆలయాలు ఉన్నాయి. కామాక్షి అమ్మవారి దేవాలయంతో పాటు ఏకాంబరనాథన్, వరదరాజ పెరుమాల్, ఉలగలంద పెరుమాల్, కుమార కొట్టం, కైలాసనాథర్, కాంచీపురేశ్వర దేవాలయాను చూడవచ్చు.
 
చూడవలసిన దేవాలయాలు
పలార్ నది ఒడ్డున వెలసిన కాంచీపురంలో పురాతన ఆలయాలు ఉన్నాయి. కామాక్షి అమ్మవారి దేవాలయంతో పాటు ఏకాంబరనాథన్, వరదరాజస్వామి(బంగారుబల్లి), ఉలగలంద పెరుమాల్, కుమార కొట్టం, కైలాసనాథర్, కాంచీపురేశ్వర దేవాలయాను చూడవచ్చు.
 
భక్తులకు సౌకర్యాలు
కంచిలో భక్తులు బస చేసేందుకు దేవాలయానికి చెందిన సత్రాలు, ఇతర అతిథి గృహాలు ఉన్నాయి. ప్రైవేటు అతిథి గృహాలో శ్రీ శక్తి రెసిడెన్సీ, ఎంఎం హోటల్, బాల సూర్య, భీమా రెసిడెన్సీ, జీఆర్‌టీ రెసిడెన్సీ, శ్రీరామ, ఎస్‌ఎస్‌కే ఇన్ ్ల ప్రధానమైనవిగా ఉన్నాయి.
 
ప్రత్యేకతలు
కంచీపురం పట్టు చీరలకు ప్రసిద్ధి. ఇక్కడ శిల్కు సొసైటీలు ఉన్నాయి. వివిధ రకాలకు చెందిన శిల్కు వస్త్రాలు, ముఖ్యంగా చీరలు ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ కంచి కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఇక్కడకు నిత్యం దేశ, విదేశాలకు చెందిన యాత్రికులు, వ్యాపారులు, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
 
ఎలా వెళ్లాలి
కర్నూలు నుంచి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచీపురానికి వెళ్లాలంటే ముందుగా తిరుపతి లేదా చిత్తూరుకు చేరుకోవాలి. అక్కడి నుంచి నేరుగా బస్సుల్లో వెళ్లవచ్చు. లేదంటే కర్నూలు నుంచి నేరుగా చెన్నై వెళ్లి అక్కడి నుంచి కంచికి చేరుకోవచ్చు. చెన్నై నుంచి కంచి 65 కిలోమీటర్లు ఉంటుంది. జిల్లాలో ఎమ్మిగనూరు నుంచి కంచికి నేరుగా ఆర్‌టీసీ బస్సు సౌకర్యం ఉండేది. అయితే పలు కారణాల వల్ల రద్దు అయ్యింది. రైలు మార్గం ద్వారా వెళ్లాలంటే కర్నూలు నుంచి తిరుపతికి వెళ్లాలి. అక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉంది.

కర్నూలు నుంచి తిరుపతి వెళ్లేందుకు ప్రతి రోజు రాత్రి 11.46 గంటలకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రాత్రి 8 గంటలకు చైన్నై ఎక్స్‌ప్రెస్, ప్రతి సోమ, గురు, శనివారాల్లో మధ్యాహ్నం 1.30కు ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్, ప్రతి మంగళ, శుక్రవారాల్లో రాత్రి 9.50 గంటలకు ఏడుకొండలు ఎక్స్‌ప్రెస్, సోమ, గురువారాల్లో రాత్రి 9.50 గంటలకు తిరుపతి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇటీవలే ప్రవేశపెట్టిన డబుల్‌డెక్కర్ సూపర్‌ఫాస్ట్ ఏసీ రైలు ప్రతి బుధ, శనివారాల్లో ఉదయం 11 గంటలకు నడుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement